సోమవారం 25 మే 2020
Rajanna-siricilla - May 23, 2020 , 03:00:08

ఇక నియంత్రిత సేద్యమే..

ఇక నియంత్రిత సేద్యమే..

కరీంనగర్‌ జిల్లాలో స్థూల ప్రణాళిక సిద్ధం 

3.50 లక్షల ఎకరాలకుపైగా పంటలు

సింహ భాగం వరే.. సన్నాలకు ప్రాధాన్యత

త్వరలో క్లస్టర్ల వారీగా సమావేశాలు 

ఆ తర్వాతే సూక్ష్మ ప్లాన్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా కరీంనగర్‌ జిల్లాలో పంటలు సాగు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వానకాలం పంటల నియంత్రిత పద్ధతిపై గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా స్థూల ప్రణాళికకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో వచ్చే వారంలో జిల్లాలోని 76 వ్యవసాయ క్లస్టర్లలో సమావేశాలు నిర్వహించి, ఏ గ్రామంలో ఏ పంటలు వేయాలనే విషయమై సూక్ష్మ ప్రణాళికను రూపొందించనున్నారు. జిల్లాలో 3,50,782 ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా సింహభాగం వరికే ఇచ్చారు. అందులో ఈ సారి సన్న రకాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

 -కరీంనగర్‌, నమస్తే తెలంగాణ

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ప్రాజెక్టుల హబ్‌గా మారుతున్న జిల్లాలో ఈ వానకాలం పంటల ప్రణాళికలో సింహ భాగం వరికే దక్కింది. జిల్లాలో మొత్తం 3,50,782 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో 2,22,199 ఎకరాల్లో వరి, 1,00,979 ఎకరాల్లో పత్తి, 5,902 ఎకరాల్లో పెసర, 3,050 ఎకరాల్లో ప్రధాన పంటగా, 30,294 ఎకరాల పత్తిలో అంతర పంటగా కంది, 275 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌, 2,300 ఎకరాల్లో కూరగాయలు, 125 ఎకరాల్లో పండ్ల తోటలు, 8,888 ఎకరాల్లో ఇతర పంటల సాగుకు జిల్లా వ్యవసాయశాఖ స్థూల ప్రణాళికను రూపొందించింది. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నియంత్రిత పద్ధతిలో సాగుపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఈ ప్రణాళికను ఆమోదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి ఎల్‌ఎండీకి నీళ్లు వస్తుండడంతో ఎప్పటిలాగే ఈ వానకాలంలో కూడా ఆయకట్టు ప్రాంతంలో వరి సాగును ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇందులో సన్నాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగు ప్రణాళికలో 63.34 శాతం వరికి చోటు దక్కగా ఇందులో 72 వేల ఎకరాల్లో సన్న రకాలు సాగు చేయాలని ప్రణాళికలు చేశారు. అంటే 2,22,199 ఎకరాల్లో వరి సాగవుతుండగా ఇందులో 34.40 శాతం సన్న రకాలు సాగు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం వంటి సన్న రకాలను సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. మిగతా విస్తీర్ణంలో దొడ్డు రకమైన 1010 రకం సాగు చేయాలని సూచించినట్లు చెప్పారు. వాన కాలంలో డిమాండ్‌ ఉన్న పంటల సాగుకు ప్రణాళికలో ప్రాముఖ్యత ఇచ్చారు. వరి తర్వాత ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తున్నారు. వాన కాలంలో మక్కజొన్న తెరువుకు వెళ్లవద్దని సీఎం కేసీఆర్‌ చేసిన సూచనల మేరకు అధికారులు స్థూల ప్రణాళికలో ఆ పంటను చేర్చ లేదు.


క్లస్టర్ల పరిధిలో అవగాహన..

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు క్లస్టర్ల పరిధిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే వారంలోనే సదస్సులు నిర్వహించనున్నారు. ఏ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనేది ఈ సమావేశాల్లో నిర్ణయించి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయకట్టు ప్రాంతం పెరిగింది. జిల్లాలో వర్షాధారంగా పత్తి సాగు ఎక్కువగా జరిగేది. ఇప్పుడు ప్రాజెక్టుల నీళ్లు చాలా మండలాల్లో అందుబాటులో ఉన్నాయి. పత్తి విస్తీర్ణం పెరిగినా నీటి వసతి కల్పించే అవకాశాలున్నాయి. ఇక ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువగా వరి ముఖ్యంగా సన్న రకాలను ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. సన్న రకం వరిలో దీర్ఘ, మధ్య, స్వల్ప కాలిక రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, సీఎం కేసీఆర్‌ సూచించిన సన్న రకాల్లో ఎక్కువగా దీర్ఘకాలిక రకాలే ఉన్నాయి. దీంతో ప్రాజెక్టుల పరిధిలో అయితేనే ఆరుగాలం నీళ్లు అందుబాటులో ఉంటాయని, వర్షాలు అనుకూలించక పోయినా పంటలను రక్షించుకునేందుకు ప్రాజెక్టుల నీటిని వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే క్లస్టర్ల సమావేశాల్లో ఆయకట్టు ఏరియాలో వరిలో సన్న రకాలకు సూక్ష్మప్రణాళికలో ఎక్కువగా చోటు దక్కే అవకాశం ఉన్నది. బావులు, బోర్ల కింద స్వల్ప కాలిక రకాలైన దొడ్డు వడ్ల సాగును సూక్ష్మప్రణాళికలో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో పెసర, కంది వంటి పంటలకు అవసరమైతేనే నీటి తడులు అందించాల్సి ఉంటుంది. బావులు, బోర్ల కింద ఈ పంటలు ఎక్కువగా సాగు చేసే అవకాశాలుంటాయి. ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలనే సూక్ష్మ ప్రణాళికకు త్వరలోనే తుది రూపం రానున్నది. అయితే సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు దీర్ఘకాలిక వరి సన్నాలు సాగు చేసే రైతులు ఇప్పటికే వరి నార్లు పోసుకుంటున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తాం

నియంత్రిత పద్ధతిలో ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, సీనియర్‌ రైతులు, అధికారులతో చర్చించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థూల ప్రణాళికను సిద్ధం చేశాం. కలెక్టర్‌ శశాంక అనుమతితో వచ్చే వారంలో క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పుడు నిర్ణయించిన జిల్లా స్థాయి ప్రణాళికలో భాగంగా క్లస్టర్ల వారీగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేస్తాం. నీటి వసతి, నేలలు, వర్షపాతం ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పంటలు సాగు చేయాలో సూక్ష్మ ప్రణాళికలో చేర్చుతాం. ప్రభుత్వం సూచించినట్లు రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

- వాసిరెడ్డి శ్రీధర్‌, డీఏవోlogo