శనివారం 06 జూన్ 2020
Rajanna-siricilla - May 21, 2020 , 05:33:50

ఇంటికి ఇరుసై..బతుకు బరువై..

ఇంటికి ఇరుసై..బతుకు బరువై..

కుటుంబంలో నలుగురూ బధిరులే

మరోవైపు వెంటాడుతున్న పేదరికం

పింఛనే జీవనాధారం

రంగపేటలో ఒంటరిగా ఓ మహిళ బతుకుపోరు

కుటుంబ భారం మోయలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులురాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన తుమ్మలపల్లి హన్మాండ్ల్లు, అమృతవ్వ దంపతులు. వారిలో హన్మాండ్లు బధిరుడు. వారికి దివ్య, లక్ష్మణాచారి సంతానం. వారిద్దరూ పుట్టు మూగ. చెవుడు. కూతురు దివ్యకు కొడిమ్యాలకు చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిపించారు. ఆ దంపతులకు రెండేళ్ల క్రితం కొడుకు దీపక్‌ జన్మించగా, అతడు కూడా పుట్టు, మూగ చెవుడు. దీంతో నాటి నుంచి వెంకటేశ్‌ తన భార్యను, కొడుకును పుట్టింటికి పంపించాడు. ఇదిలా ఉండగా కొడుకు లక్ష్మణాచారికి, వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన మారోజు నందయ్య, ధర్మవ్వ రెండో కూతురు లతతో 2000వ సంవత్సరంలో వివాహం జరిపించాడు. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. అందులో చిన్నకూతురు మాధవి పుట్టు మూగ, చెవుడు. పెద్ద కూతురు రమ్య ఇంటర్మీడియెట్‌ చదివి ఇంటి వద్దనే ఉంటున్నది. మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించిన హన్మాండ్ల్లు ప్రస్తుతం వయస్సు మీద పడడంతో ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబ భారాన్ని మోస్తున్న కొడుకు లక్ష్మణాచారి మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నాటి నుంచి కుటుంబ భారం మొత్తం అతని భార్య లతపై పడింది. కూతురు మాధవికి, తనకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌తో పాటు బీడీలు చుడుతూ ఇంటిని వెల్లదీస్తున్నది. ఆరునెలల క్రితం లత కూడా అనారోగ్యం బారిన పడింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యచికిత్స కోసం ఉన్న పుస్తెలతాడునూ ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో వైద్యం చేయించుకున్నట్లు లత విలపించింది. అదీగాక హన్మాండ్ల్లు భార్య అమృతవ్వ కూడా క్యాన్సర్‌తో ఇటీవలే  మృతిచెందడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నది. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలువాలని గ్రామ సర్పంచ్‌ నందగిరి లింగం కోరుతున్నారు.

మామ.. కూతురు.. ఆడబిడ్డ ఇలా ఇంటినింటా బధిరులే. పుట్టు మూగ. చెవిటితనం. వెన్నాడుతున్న పేదరికం.. గోరు చుట్టుమీద రోకలి పోటులా కుటుంబ భారాన్ని మోస్తున్న భర్త అకాల మరణం. దుఃఖాన్ని పంటిబిగువున అణచుకుని.. ఒంటి చేత్తో బతుకు బండిని ఈడ్చుకొస్తున్నది. ఇంటికి ఇరుసై నిలుస్తున్నది. భారం మోయలేక.. బిడ్డల కడుపు నింపలేక నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నది. ఇదీ వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన లత దీనగాథ. అంతులేని కన్నీటి వ్యథ.   

- వీర్నపల్లి


logo