గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - May 20, 2020 , 02:38:24

వేగంగా ధాన్యం కొంటున్నాం

వేగంగా ధాన్యం కొంటున్నాం

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో, జిల్లాలో శరవేగంగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్ప ష్టం చేశారు. స్థానిక శ్వేతా హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి యాసంగిలో భూమికి బరువయ్యేంత ధాన్యం దిగుబడులు వచ్చాయని, ఉమ్మడి రాష్ట్రంలో 60 రోజుల్లో 20 లక్షల మెట్రిక్‌ టన్నులు కొంటే, తెలంగాణలో ఈ ఒక్క సీజన్‌లో నే 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్‌ టన్నుల ధా న్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని చెప్పా రు. ఇంత చేస్తున్నా కొందరు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు లేచిన కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొనడం లేదని సొల్లు చెబుతున్నారని మండిపడ్డా రు. నిండు వేసవిలోనూ జిల్లాలోని 80 శాతం చెరువులు మత్తడి దునుకుతున్నాయని, మిగతావి నిండుతున్నాయని, ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు తోనే సాధ్యమైందన్నారు. మధ్యమానేరు లెఫ్ట్‌ కెనా ల్‌, వరద కాలువతో మరిన్ని చెరువులకు త్వరలోనే నీళ్లు వదులుతామన్నారు. వరద కాలువ పరిధిలో ఓటీలు నిర్మించుకునేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతులిచ్చారని గుర్తు చేశారు. కాలువల కు కనెక్టివిటీ లేని చెరువులు, గొలుసుకట్టు చెరువులకు టెండర్లు పిలిచి కాలువలు నిర్మిస్తామన్నారు.

జిల్లాకు త్వరలో సీఎం కేసీఆర్‌

జిల్లాలో ముందస్తు సాగును ప్రారంభించేందుకు త్వరలో సీఎం కేసీఆర్‌ వస్తున్నారని మంత్రి గంగుల తెలిపారు. 72 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో బియ్యం గింజ సైజ్‌ చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని, 6.5 మిల్లీ మీటర్ల సైజ్‌లో ఉండే బియ్యం పండించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని, పంట దిగుబడుల నాణ్యత విషయంలో ఆయన ఎంత నిషితంగా పరిశీలిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. దొడ్డు రకం పండి స్తే ఎఫ్‌సీఐ గోదాముల్లో మూల్గుతున్నాయని, మనం తింటున్న సన్న రకాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అదే పంట ను మన రైతులు కూడా పండించాలనేది కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. సన్న రకాలు పండిస్తే మద్దతు ధరకు మించి ధర పెట్టి కొనుగోలు చేసేందుకు మిల్లర్లు, వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘మేడిన్‌ తెలంగాణ’ పేరు రావాలని, తెలంగాణలో ఆహార పదార్థాల ఉత్పత్తులు పెం చేందుకు వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలు స్థా పించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక వ్యవసాయ ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తామని, పరిశ్రమల హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, ఈ హబ్‌లలో అన్ని రకాల వ్యవసాయ పరిశ్రమలు స్థాపించే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 2.70 లక్షల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా ఎంత ధాన్యం వస్తే అంత కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొనుగోళ్లు ముగియడంతో ఇప్పటికే 11 కేంద్రాలు మూసివేశామన్నారు. జిల్లాలో 1153, 1156 రకం వరి సాగు చేసిన చోట కొంత తాలు వచ్చిన మాట నిజమని, తాలు తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్యాడీ క్లీనర్లు తెచ్చి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఒక్క కరీంనగర్‌లో మినహా ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా రాలేదన్నారు. జిల్లా వానకాలం ప్రణాళికను ఖరారు చేసేందుకు అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా హాజరవుతున్నారని తెలిపారు. 

బండి సంజయ్‌ది విచిత్ర పోరాటం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పోతిరెడ్డిపాడుపై చేస్తున్న పోరాటం విచిత్రంగా ఉన్నదని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు చేయడమేమిటో తనకు అర్థం కావ డం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఆయనకు ద మ్ముంటే పోతిరెడ్డిపాడు వెళ్లి ఆంధ్రా ప్రభుత్వంపై పోరాడాలని సవాల్‌ విసిరారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశమే అతనికి ఉంటే ప్రధాని నరేంద్ర మోడి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు మహారాష్ట్ర వెళ్లి, అక్క డి పోలీసులతో దెబ్బలు తిన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికీ తనపై కేసు ఉన్నదని చెప్పారు. పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని, తెలంగాణకు అన్యా యం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పొన్నం ప్రభాకర్‌ ఏం మాట్లాడుతున్నారో? ఆయనకే తెలియడం లేదని, కరోనా భయంతో ఇంటికే పరిమితమైన ఆ యన కొనుగోళ్లు ముగుస్తున్న సమయంలో వచ్చి ధాన్యం కొనడం లేదని అనడం సరికాదన్నారు. కరోనా సమయంలో కనీసం ఒక్కరికైనా ఒక ఇడ్లీ కూడా పెట్టలేదని, ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కరీంనగరే కాకుండా రాష్ట్రం మొత్తం కరోనా ఫ్రీగా మారుతున్నదని, సీఎం కేసీఆర్‌ ముందు చూపు తో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు దోహద పడ్డాయని చెప్పారు. మేయర్‌ సునీల్‌రావు, ఎంపీపీలు లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, జడ్పీటీసీ పురమల్ల లలిత, నాయకులు చల్ల హరిశంకర్‌, గుగ్గిళ్లపు రమేశ్‌ పాల్గొన్నారు. 


logo