మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - May 12, 2020 , 01:41:28

నేతన్నకు అభయం

నేతన్నకు అభయం

  • అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ భరోసా n జాతీయస్థాయిలో గుర్తింపు తెస్తామని హామీ
  • కార్మికులను గౌరవంగా చూసుకోవాలని యజమానులకు సూచన
  • బద్దెనపల్లి టెక్స్‌టైల్‌ పార్క్‌లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
  • అపెరల్‌, గార్మెంట్‌ తయారీలో శిక్షణ పొందిన 40 మందికి ధ్రువీకరణ పత్రాలు అందజేత
  • తంగళ్లపల్లిలో 275 మంది కార్మికులకు ఆర్థికసాయం, నిత్యావసర సరుకులు పంపిణీ

సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్‌ : కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ కార్మికక్షేత్రంలో పర్యటించారు. అన్ని విధాలా అండగా ఉంటామని, అధైర్య పడద్దని నేతన్నలకు, యజమానులకు అభయమిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌కు చేరుకున్న ఆయన, గంటకుపైగా అక్కడే ఉన్నారు. 3.76 కోట్లతో పూర్తయిన నాలుగు వరుసల రహదారి, సెంట్రల్‌ లైటింగ్‌ను, 5.40 కోట్లతో నిర్మించిన ఆధునిక పరిపాలనా భవనాన్ని, సమర్థ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం కుట్టు శిక్షణ కేంద్రంలో అపెరల్‌, గార్మెంట్‌ తయారీలో శిక్షణ పొందిన 40 మందికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. మధ్యాహ్నం 1.45కు తంగళ్లపల్లి మార్కండేయ ఆలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమంలో భాగంగా 275 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 500 ఆర్థిక సాయం, 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయని, నేతన్నకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేనేతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, సిరిసిల్ల కార్మికుల నైపుణ్యం ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కొనియాడారు. రాబోయే రోజుల్లో కార్మికులకు మరింత చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు. నేత కార్మికులకు సాయం కోరుతూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశామని తెలిపారు. ప్రభుత్వం తరఫున బతుకమ్మ చీరెలు, ఆర్వీఎం, రంజాన్‌, క్రిస్మస్‌ దుస్తులు తదితర ఆర్డర్లను కేటాయించి ఉపాధి అవకాశాలు పెంచామని వివరించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చి వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. కార్మికులను గౌరవంగా చూసుకోవాలని, వారి శ్రేయస్సుకు పాటుపడాలని యజమానులకు సూచించారు. కార్మికులతో యాజమాన్యాలు చేసుకున్న ఒప్పందాలను తప్పకుండా అమలు చేయాలన్నారు. ఆ తర్వాత 2.15 గంటలకు సిరిసిల్లలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ భోజనం చేసిన అనంతరం తన మిత్రులతో కలిసి బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వెళ్లారు. ప్రాజెక్టును తిలకించి, తిరుగుపయనమయ్యారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ పడిగెల మానస, టెక్స్‌టైల్‌ పార్క్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నల్‌ దాస్‌ అనిల్‌, సర్పంచ్‌ అనిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.logo