ఆదివారం 06 డిసెంబర్ 2020
Rajanna-siricilla - May 11, 2020 , 02:51:58

టెక్స్‌టైల్‌ పార్క్‌కు మహర్దశ

టెక్స్‌టైల్‌ పార్క్‌కు మహర్దశ

  • రూ.14.64 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులు
  • నేడు ప్రారంభించనున్న అమాత్యుడు కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల రూరల్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌కు మంచిరోజులు వచ్చాయి. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో రూ.14.64 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తికాగా, నేడు(సోమవారం) ప్రారంభించనున్నారు. ఆధునిక పరిపాలన భవనం, శిక్షణ కేంద్రం, క్యాంటీన్‌, నీటి వసతి, మరుగుదొడ్లు, నాలుగు వరుసల రహదారులు, సెంట్రల్‌లైటింగ్‌తోపాటు ఆధునిక వసతులు కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. 

రూ.14.64 కోట్ల అభివృద్ధి పనులు

రూ.5.40 కోట్లతో టెక్స్‌టైల్‌పార్క్‌లోని ఆధునిక పరిపాలన భవనం, రూ.2.75 కోట్లతో మిషన్‌ భగీరథ ద్వారా నీటి వసతి, రూ.3.76 కోట్లతో నాలుగు వరుసల రహదారులు, వాటి మధ్యలో సెంట్రల్‌లైటింగ్‌ సిస్టం, ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రహదారి మధ్య, ఇరువైపులా మొక్కలు నాటారు. అంతర్గతంగా సీసీ రోడ్లతోపాటు రూ.2.52 కోట్లతో రోడ్లకు ఇరువైపులా మురుగు కాలువలు, మరో రూ.21 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించనుండగా, కార్మికులు, యజమానుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

నేడు జిల్లాకు మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌పార్క్‌కు చేరుకుంటారు. కార్మికులతో మాట్లాడి, మధ్యా హ్నం 12.30 గంటలకు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఒంటి గంటకు 275 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. 2 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. మరమగ్గాలను పరిశీలిస్తారు. 3 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో అధికారులతో  సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.