గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - May 07, 2020 , 02:53:23

అకాల వర్షం

అకాల వర్షం

శంకరపట్నం/తిమ్మాపూర్‌ రూరల్‌/రుద్రంగి/ముస్తాబాద్‌: శంకరపట్నం మండలం కేశవపట్నంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం అరగంట పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. మండల కేంద్రంలో అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి పడగా, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఓ చికెన్‌ సెంటర్‌ ముందు వేసిన రేకులు కూలిపోయాయి. మొలంగూర్‌ పంచాయతీ పరిధిలోని నల్లవెంకయ్యపల్లెలో ఈదురుగాలులకు పౌల్ట్రీ ఫాం రేకులు కూలి మీద పడగా, మాజీ జడ్పీటీసీ, మెట్‌పల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ పొద్దుటూరి సంజీవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అలాగే తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. ధాన్యం తడిసిముద్దయింది. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.  రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల గిరిజన తండాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడవగా కోతకు వచ్చిన వరిపంట నేలవాలింది. ముస్తాబాద్‌ మండలం మొర్రాపూర్‌ గ్రామానికి చెందిన రాజవ్వ కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్‌ కప్పేందుకు వెళ్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా సమీపంలోని ఇంటిముందు వేసిన రేకులు ఎగిరివచ్చి ఆమెకు తగిలాయి. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వరుణ్‌ గాంధీకి చెందిన 25 ఎకరాల మామిడితోటలో కాయలు నేలరాలాయి. కోళ్ల ఫారంలోని రేకులు, పలువురి ఇండ్లలోని పైకప్పులు ఎగిరిపోయాయని ఎంపీటీసీ రాంచంద్రారెడ్డి తెలిపారు. 


logo