ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - May 06, 2020 , 01:54:35

మా ఊరికస్తం.. సాయం జెయ్యిండ్రి

మా ఊరికస్తం.. సాయం జెయ్యిండ్రి

  • భారత్‌, నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్న సంచారజాతి
  • రెండు నెలలుగా 16మంది పడిగాపులు

రామడుగు: పొట్టకూటి కోసం వెళ్లి లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌, నేపాల్‌ దేశ సరిహద్దులోని నేపాల్‌గంజ్‌లో చిక్కుకుపోయిన కరీంనగర్‌ జిల్లాలోని సంచారజాతికి చెందిన సుమారు 16 మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బేడబుడిగజంగం కులానికి చెందిన రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని 14 మంది, గంగాధరలోని ఇద్దరితోపాటు ఓ ఆరు మాసాల పసిగుడ్డు మార్చి నెలలో నేపాల్‌ వెళ్లారు. జ్యోతిష్యం, పంచాంగం చెబుతూ, రంగురాళ్లను అమ్ముకొని జీవించే వీరు ఆరు నెలలు సంచార జీవనం గడుపుతూ, మరో ఆరు నెలలు స్వగ్రామాల్లో ఉంటారు. కాగా, లాక్‌డౌన్‌తో నేపాల్‌గంజ్‌లో ఆగిపోయారు. అక్కడి అధికారులు వీరిని గుర్తించి ఆరునెలల బాబుతో సహా 10 మందిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా, ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవడంతో హోంక్వారంటైన్‌లో ఉంచారు. మిగతా ఆరుగురు నేపాల్‌గంజ్‌ సమీపంలోని ఓ పల్లెటూరిలో తలదాచుకోగా రెండు నెలలుగా గ్రామస్తుల సహకారంతో ఒంటిపూట భోజ నం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేదని, సొంతూరికి ఎలా రావాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు. ‘మా ఊరికస్తం సాయంజెయ్యిండ్రి’ అని ఫోన్‌ ద్వారా ఇక్కడి ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. 


logo