మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - May 03, 2020 , 02:56:59

తెరుచుకున్న టెక్స్‌టైల్‌పార్క్‌

తెరుచుకున్న టెక్స్‌టైల్‌పార్క్‌

  • 40 రోజుల తర్వాత పనుల్లో చేరిన నేతకార్మికులు

సిరిసిల్ల రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్‌ పార్క్‌ లో పరిశ్రమలు శనివారం పునఃప్రారంభమయ్యాయి. ఈ టెక్స్‌టైల్‌పార్క్‌లో 111 యూనిట్లకు 85 యూనిట్లు కొనసాగుతుండగా.. వెయ్యిమందికిపైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ, మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూసివేశారు. గ్రామీణ ప్రాంతంలోని పరిశ్రమలను నడిపించేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, మంత్రి కేటీఆర్‌ సూచనలతో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోగల టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పరిశ్రమల నిర్వహణకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అనుమతినిచ్చారు. శనివారం పరిశ్రమలను ప్రారంభించగా కార్మికులు ఉత్సాహంగా పనుల్లో చేరారు. 40 రోజుల తర్వాత పరిశ్రమలు ప్రారంభం కావడంతో టెక్స్‌టైల్‌ పార్క్‌ యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్‌ దాస్‌ అనిల్‌తోపాటు కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

లాక్‌డౌన్‌తో రూ.25 కోట్ల మేర నష్టం

టెక్స్‌టైల్‌ పార్క్‌లోని 85 యూనిట్లలో రోజూ 2.50 లక్షల నుంచి 3 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరుగుతుంది. లాక్‌డౌన్‌తో 40 రోజుల్లో సుమారు రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఒక్కో కార్మికుడు దాదాపు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉపాధి కోల్పోయినట్లు సమాచారం.