శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Apr 16, 2020 , 03:52:16

కంటైన్మెంట్‌లో కాలినడకన

కంటైన్మెంట్‌లో కాలినడకన

  • వేములవాడలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన
  • 45 నిమిషాలపాటు కలియదిరిగిన అమాత్యుడు
  • ఆప్యాయంగా పలుకరింపు.. ఆర్యోగ పరిస్థితులపై ఆరా
  • వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచన
  • ఇండ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి
  • సేవలు బాగున్నాయని అధికార యంత్రాంగానికి కితాబు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/ వేములవాడ, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం వేములవాడలో ఆకస్మికంగా పర్యటించారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డేతో కలిసి కంటైన్మెంట్‌ ఏరియాలో దాదాపు 45 నిమిషాలపాటు కలియదిరిగారు. మధ్యాహ్నం 2గంటలకు చేరుకున్న ఆయన, పద్మశాలి కల్యాణ మండపం వద్ద నుంచి సుభాష్‌నగర్‌, చిలుక వీధిలో ఇంటింటికీ తిరుగుతూ, ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు. వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వృద్ధులు, చిన్నారులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ సాయం అందుతున్నదా? అని అడిగారు. కరోనా నియంత్రించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నదని, ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ ముగిసే దాకా ప్రజలు ఇండ్ల నుంచి రావద్దని, అత్యవసరమై బయటకు వస్తే తప్పకుండా సామాజికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యుల సలహాలను పాటించాలని సూచించారు. అంతకుముందు ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారి వివరాలు, వారి ఆరోగ్య వివరాలను వైద్యాధికారి రేగులపాటి మహేశ్‌రావును అడిగి తెలుసుకున్నారు. కంటైన్మెంట్‌ ఏరియాలో 602 నివాసాలుండగా, 2,252 మంది ప్రజలు ఉన్నారని మంత్రికి వైద్యాధికారి తెలిపారు. ఆ పరిధిలో వైద్య బృందాలు రోజూ ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నాయని చెప్పారు.  

సేవలు అభినందనీయం..

మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మంత్రి చేరుకున్నారు. భోజనం తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని, జిల్లా ప్రజలంతా స్వీయనిర్బంధాన్ని పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ అమలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు బేఖాతరు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వ్యాధి నియంత్రణలో ఇతర జిల్లాలతో పోలిస్తే, జిల్లా మెరుగైన స్థితిలో ఉందన్నారు. అధికారుల కృషి, ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. నియంత్రణలో కలెక్టర్‌, ఎస్పీ, వైద్య సిబ్బంది, పోలీస్‌, పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. 

రైతులూ ఆందోళన వద్దు..

మధ్యాహ్నం ఒంటి గంటకు నేరుగా హైదరాబాద్‌ నుంచి ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరతో కొంటుందని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. మెట్టప్రాంతమైన జిల్లాలో కాళేశ్వరం జలాలతో రెట్టింపు ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణతో ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు తప్పక మాస్కులు ధరించాలని కోరారు. టోకెన్ల ప్రకారమే ధాన్యం తీసుకురావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. సిరిసిల్లలో నేత కార్మికులను అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుంటున్నదని, ఇప్పటికే ఉచితంగా బియ్యం అందజేసిందని తెలిపారు. ఇక్కడ ఎంపీపీ జనగామ శరత్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, సెస్‌డైరెక్టర్‌ విజయరామారావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సహకార సంఘం చైర్మన్‌ తన్నీరు బాపురావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, తదితరులున్నారు.

18లక్షల విరాళం 

మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం సిరిసిల్ల జిల్లా పాలిస్టర్‌ అసోసియేషన్‌ 18 లక్షల విరాళాన్ని ప్రకటించింది. చెక్కును మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా కలెక్టర్‌కు అందించారు. కరోనా కట్టడిలో భాగంగా సెస్‌ డైరెక్టర్‌ అల్లాడి రమేశ్‌ 51వేల చెక్కును మంత్రికి అందజేశారు. ఆయనవెంట జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, కమిషనర్‌ సమ్మయ్య, టీపీవో అన్సారీ, సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు, డైరెక్టర్లు అల్లాడి రమేశ్‌, కొక్కు దేవేందర్‌, న్యాలకొండ రాఘవరెడ్డి ఉన్నారు.


logo