శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Apr 11, 2020 , 02:42:20

కరోనాపై కదం

కరోనాపై కదం

  • సిరిసిల్ల జిల్లాలో వైరస్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
  • మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన యువకుడికి పాజిటివ్‌తో మరింత అలర్ట్‌
  • రంగంలోకి అధికార యంత్రాంగం
  • శరవేగంగా నివారణ చర్యలు
  • సుభాష్‌నగర్‌ చుట్టూ కిలోమీటర్‌ పరిధిలో దిగ్బంధం
  • ఇంటింటికీ వైద్య పరీక్షలు చేసిన బృందాలు
  • పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీ

వేములవాడ, నమస్తే తెలంగాణ/సిరిసిల్ల టౌన్‌/కలెక్టరేట్‌ : కరోనా కట్టడికి జిల్లా అధికారులు పకడ్బందీగా నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఆయాచోట్ల రెవెన్యూ సిబ్బందికి తాజాగా విధులను కేటాయిస్తూ కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలను మాత్రమే జిల్లాలోకి అనుమతించాలని సూచించారు. విదేశాల నుంచి, ఇతర అనుమానిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిని స్వీయ గృహ నిర్బంధంలో ఉండేలా చూడాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అనుమానితులను గుర్తించేందుకు గ్రామ, మండల కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌ చేశారు. ఇందులో చాలా మందికి నెగెటివ్‌ రావడంతో ఇండ్లకు తరలించారు. ఇదే సమయంలో అంతటా పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. జిల్లా దవాఖానలో సేఫ్టీ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెల్దండి సమ్మయ్య, దవాఖాన సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావు ప్రారంభించారు.  

నలుగురిలో ఒకరికి పాజిటివ్‌..

ఢిల్లీ మర్కజ్‌లో మార్చి 13 నుంచి 15వరకు జరిగిన మతపరమైన ప్రార్థనలకు వేములవాడలోని సుభాష్‌నగర్‌కు చెందిన నలుగురు యువకులు వెళ్లినట్లు ఈ నెల 31న గుర్తించారు. వెంటనే ఆ నలుగురికి వైద్య పరీక్షలు చేశారు. అప్పుడు నెగెటివ్‌ రావడంతో వేములవాడలోని బాలుర సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు తీసుకెళ్లారు. ఏప్రిల్‌ 2న నెగెటివ్‌ రావడంతో బుధవారం మరోసారి వైద్యపరీక్షలు చేశారు. గురువారం రాత్రి అందులో ఒకరికి పాజిటి వ్‌ వచ్చినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ రావు తెలిపారు. సదరు యువకున్ని హై దరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. యువకుడి కుటుంబసభ్యులను ఐసోలేషన్‌ వార్డుకు తీసుకెళ్లారు. 

శరవేగంగా నివారణ చర్యలు..

మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో అధికారులు శరవేగంగా నివారణ చర్యలు చేపట్టారు. సుభాష్‌నగర్‌ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ ఏరియా (నియంత్రిత ప్రాంతం)గా ప్రకటించి, కాలనీ పరిధిలో కిలో మీటరు వరకు దిగ్బంధించారు. బద్దిపోశమ్మ వీధి, వడ్ల కమ్మరి వీధి, కూరగాయల మార్కెట్‌, ఆలయ ప్రధాన రహదారులను మూసివేశారు. వైద్యాధికారులు ఆవుల సుమన్‌మోహన్‌రావు, రేగులపాటి మహేశ్‌రావు ఆధ్వర్యంలో 34 వైద్య బృందాలతో 1700 నివాసాల్లో ఇంటింటికీ సర్వే చేశారు. 25,433 జనాభా ఉండగా, ఇందులో 6,272 మందిని ఆరోగ్యపరంగా సర్వే చేశామన్నారు. అనుమానంగా ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యాధికారులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్‌రూంను కూడా ఏర్పాటుచేశారు. 

పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీ

కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఎస్పీ రాహుల్‌ హెగ్డే సుభాష్‌నగర్‌లో పర్యటించారు. పట్టణానికి చేరుకునే తిప్పాపూర్‌ బస్టాండ్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను పరిశీలించారు. ప్రజలు బయటకు రావద్దని, అవసరమైతే నిత్యావసర సరుకులను ఇంటికే పంపిస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి సమయంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. 

లక్ష్మీ గణపతి కాంప్లెక్స్‌లో ఐసోలేషన్‌ వార్డు..

ఇప్పటి వరకు చెక్కపల్లి రహదారిలోని బాలుర వసతి గృహంలో 25 పడకలతో ఐసోలేషన్‌ వార్డు ఉండగా, తాజాగా రాజన్న ఆలయ వసతి గృహమైన లక్ష్మీ గణపతి వసతి సముదాయంలో 95 గదులతో ఏర్పాటు చేశారు. కరోనా నెగెటివ్‌ వచ్చిన ముగ్గురితోపాటు పాజిటివ్‌ వచ్చిన యువకుడికి సంబంధించిన 12 మంది కుటుంబ సభ్యులను కూడా ఈ వార్డుకు తరలించినట్లు వైద్యాధికారి తెలిపారు.