గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Apr 07, 2020 , 03:04:27

సఫాయిలకు సలాం.. వైద్యులకు వందనం

సఫాయిలకు సలాం.. వైద్యులకు వందనం

  • కరోనా కట్టడిలో కీలకపాత్ర పోషిస్తున్నారంటూ ముఖ్యమంత్రి అభినందనలు
  • సేవలకు ప్రోత్సాహకాలు
  • పూర్తిస్థాయి వేతనాలు
  • కేసీఆర్‌ నిర్ణయంపై హర్షాతిరేకాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి మానవీయత చాటుకున్నారు. కరోనా కట్టడిలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందిని అభినందించడమే కాదు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆ రెండు విభాగాల సిబ్బందికి పూర్తిస్థాయి వేతనాలతోపాటు అదనంగా చెల్లించాలని ఆదేశించగా, సంబంధిత వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లోనూ సీఎం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రస్తుతం కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. సొంత కుటుంబసభ్యులే ఒకరినొకరు కలుసుకోవడానికి, దగ్గరుండి మాట్లాడుకోవడానికి సందేహిస్తున్నారు. ఇక పక్కింటి వాళ్లనయితే ఇళ్లలోకి రానీయడం లేదు. అలాంటిది వైద్యులు మాత్రం.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి సైతం నిర్విరామంగా సేవలందిస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారందరినీ తమ కంటికి రెప్పలా చూస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా తమ వద్దకు వచ్చిన వ్యక్తుల్లో మనోధైర్యం నింపుతూ, రోగాలను తగ్గిస్తూ తిరిగి ఇండ్లకు పంపిస్తున్నారు. వీరి సేవలను గుర్తించి, ‘వైద్యులూ మీకు వందనం’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యుల సేవలను కొనియాడారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి  వేతనం అందిస్తామని, సేవలకు గుర్తింపుగా గ్రాస్‌ వేతనంపై పది శాతం ప్రోత్సాహకంగా ఇస్తామని శుభవార్త చెప్పారు. వైద్యసిబ్బందితోపాటే పారిశుధ్య కార్మికులనూ ప్రశంసించారు. మీ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పారు. ప్రత్యేక ప్రోత్సాహకం కింద మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కార్మికులకు తలో 5వేలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ‘సఫాయి అన్నా నీకు సలాం. మీరు కరోనా నుంచి కాపాడుతున్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేయండి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం’ అంటూ పిలుపునిచ్చారు. ఇలా కష్టకాలంలో పనిచేసే వారిని గుర్తించడం ఒక ఎత్తయితే.. వారికి ప్రత్యేక ప్రోత్సాహకం అందించడం ముఖ్యమంత్రి మానవీయ కోణానికి నిదర్శనమని పలువురు అభివర్ణిస్తున్నారు. దేశంలో ఈ తరహా నిర్ణయం బహుశా ఎవరూ తీసుకొని ఉండకపోవచ్చని చెబుతున్నారు. సీఎం నిర్ణయంపై వైద్య సిబ్బంది, సఫాయి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలోనూ కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని సంబురంగా చెబుతున్నారు.

వెన్నుదన్నుగా నిలుస్తున్నారు..

కరోనాను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అత్యంత బాధ్యతగా ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ప్రోత్సాహం ఉద్యోగులందరిలో ఆనందాన్ని నింపింది.  

- ఎన్‌ శ్రీనివాస్‌ కర్ణ, తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు (కరీంనగర్‌ హెల్త్‌)

మీ ప్రోత్సాహమే మా ధైర్యం..

నెల రోజులుగా కరోనా బాధితులకు ధైర్యాన్ని అందిస్తూ వైద్య సేవలందిస్తున్నాం. మా సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ సార్‌కు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యం. ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తున్నాం. ఎన్నో రోజులుగా కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు చేస్తున్న తమను గుర్తించిన ప్రభుత్వాన్ని మరువలేం. 

- జనగామ సులోచన, ఇన్‌చార్జి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ (కరీంనగర్‌ హెల్త్‌)

మా కష్టాన్ని గుర్తించారు..

ఇది నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కష్టాన్ని సీఎం కేసీఆర్‌ సార్‌ గుర్తించారు. ఇలాంటి ప్రోత్సాహం ఉంటే మరింత కష్టపడి పనిచేసేందుకు ఉత్సాహం వస్తుంది. కరోనా నివారణ జరిగేంత వరకూ నగరంలో పరిశుభ్రత కోసం పాటుపడుతాం.

- వెంకన్న, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కరీంనగర్‌ కార్పొరేషన్‌)

ఆనందంగా ఉంది..

మాకు సీఎం సార్‌ జీతంతోపాటు అదనంగా ఐదు వేలు ఇస్తామనడం ఆనందంగా ఉంది. ప్రతిరోజూ రోడ్లపై పారిశుధ్య పనులు చేస్తున్నాం. కానీ, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులను చూడలేదు. ఇప్పుడు సీఎం సార్‌ అదనంగా డబ్బులు ఇవ్వడం సంతోషంగా ఉంది. 

-  కనకయ్య, పారిశుధ్య కార్మికుడు (కరీంనగర్‌ కార్పొరేషన్‌)

గర్వంగా ఉన్నది..

నేను 22ఏళ్ల నుంచి పారిశుధ్య కార్మికురాలిగా పని చేసున్నా. కరోనా కట్టడికి మేము ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేస్తున్నాం. మా కష్టాన్ని, పనిని సీఎం కేసీఆర్‌ సారు గుర్తించి రూ.5వేల బహుమతి ప్రకటించారు. మాకు గర్వంగా ఉన్నది.

- కొత్తూరి మల్లు, పారిశుధ్య కార్మికురాలు (చెన్నూర్‌)

 మరిచిపోలేం..

మాకు జీతంతోపాటు ప్రోత్సాహకం ప్రకటించడం సంతోషంగా ఉంది. మేం ఇన్నాళ్లూ పడుతున్న కష్టాన్ని సీఎం సార్‌ గుర్తించారు. ఇప్పటికే మేం పని చేస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు, నాయకులు మమ్మల్ని ఎంతో గొప్పగా చూస్తున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ సార్‌ కూడా మా సేవలను కొనియాడడం మరిచిపోలేం.  

- సంజీవ్‌, శానిటరీ జవాన్‌ (కరీంనగర్‌ కార్పొరేషన్‌)logo