ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Apr 06, 2020 , 00:40:44

అప్రమత్తంగా ఉండండి

అప్రమత్తంగా ఉండండి

  • లాక్‌డౌన్‌ ముగిసే దాకా ఇండ్ల నుంచి బయటకు రాకండి
  • పేదలు, కూలీలను ఆదుకునేందుకు ముందుకు రావాలి
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ బుగ్గారం/గొల్లపల్లి : లాక్‌డౌన్‌ ముగిసేదాకా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని రాష్ట్ర మంత్రి కొప్పుల సూచించారు. జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్‌ అధ్యక్షుడు ఎల్లాల శ్రీకాంత్‌ రెడ్డితో కలిసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లు, లాక్‌డౌన్‌పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. పటిష్టమైన నిర్ణయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నియంత్రణకు పాటుపడుతున్నారని, వైద్య, పోలీస్‌, పారిశుధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని ప్రశంసించారు. లాక్‌డౌన్‌తో మన వద్ద ఇబ్బంది పడుతున్న కూలీలను, ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన వలస కూలీలను పెద్ద మనసుతో ఆదుకోవాలని, అందుకు ప్రజాప్రతినిధులు, వర్తక వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. మహారాష్ట్రలో ఉన్న ధర్మపురి నియోజకవర్గంలోని వలస కూలీలకు తాను ఒక్కో వ్యక్తికి వెయ్యి చొప్పున బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశానని తెలిపారు. మండలాల్లోని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఇతర రాష్ర్టాల్లో ఉన్న వలస కూలీలను ఆదుకునేందుకు ఒక్కొక్కరి ఖాతాలో వెయ్యి జమ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బుగ్గారం మండలంలో 83 మంది గల్ఫ్‌ నుంచి, 40 మంది ముంబై నుంచి వచ్చారని, వారిని నిత్యం హోం క్వారంటైన్‌లో ఉండేలా చూస్తున్నామని తాసిల్దార్‌ సుజాత తెలిపారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, ఈ కేంద్రాల్లోనే మక్కలు విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో ఎంపీపీలు రాజమణి, నక్క శంకరయ్య, జడ్పీటీసీలు రాజేందర్‌, జలంధర్‌, విండో అధ్యక్షులు డాక్టర్‌ రాజసుమన్‌ రావు, గందె వేణుమాధవ రావు, ఎంపీడీవో తిరుపతి, సీఐ లక్ష్మీబాబు, స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.


logo