సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - Apr 01, 2020 , 02:08:34

ఒక్క పాజిటివ్‌ కేసూ లేదు

ఒక్క పాజిటివ్‌ కేసూ లేదు

మందమర్రి రూరల్‌/బెల్లంపల్లి టౌన్‌/సీసీసీ నస్పూర్‌ : మంచిర్యాల జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్‌ భారతి స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా మందమర్రిలోని మోడల్‌ స్కూల్‌లో 69 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తుండగా కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. ఇప్పటివరకు ఎనిమిది మంది అనుమానితులను బెల్లంపల్లి సెంటర్‌కు పంపినట్లు తెలిపారు. జిల్లాలో కొంతమంది శాంపిల్స్‌ పంపగా నెగెటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆమెతోపాటు అదనపు కలెక్టర్‌ దీపక్‌ కుమార్‌, తాసిల్దార్‌ మోహన్‌రెడ్డి, కమిషనర్‌ రాజు, డాక్టర్‌ శివప్రసాద్‌, శైలజ, డీహెచ్‌వో గంగాధర్‌ పాల్గొన్నారు. ఐసోలేషన్‌ కేంద్రం వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఆమె పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. అందులోని నలుగురితో మాట్లాడి భరోసా ఇచ్చారు. అనుమానిత లక్షణాలతో కేంద్రానికి వచ్చిన వారిని వెంటనే గాంధీ దవాఖానకు పంపాలన్నారు. ఆమె వెంట ఏరియా దవాఖాన అదనపు వైద్యాధికారి అశోక్‌కుమార్‌, వైద్యులు కుమారస్వామి, రాధాకృష్ణ ఉన్నారు. వలస కూలీలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న 30 మందిని పోలీసులు నస్పూర్‌ కేజీబీవీకి తరలించగా, వారి పరిస్థితి తెలుసుకున్నారు. ఆ తర్వాత తీగల్‌పహాడ్‌ రేషన్‌ దుకాణంలో పలువురికి సరుకులు అందజేశారు. ఇక్కడ తాసిల్దార్‌ శేఖర్‌ ఉన్నారు.

మంచిర్యాలలో నలుగురికి నెగెటివ్‌

- ఒకరు మహారాష్ట్ర, ముగ్గురు ఎంపీవాసులు..

బెల్లంపల్లి టౌన్‌ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్‌ సెంటర్‌లో వైరస్‌ అనుమానిత లక్షణాలతో చేరిన నలుగురికి నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యుడు కుమారస్వామి మంగళవారం వెల్లడించారు. ఇందులో ముగ్గురిది మధ్యప్రదేశ్‌ కాగా మరొకరిది మహారాష్ట్ర. వీళ్లంతా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గోలేటి ఓపెన్‌కాస్ట్‌లో రోజువారీ కూలీలు. పది రోజుల క్రితం స్వస్థలాలకు వెళ్లి వచ్చి విధుల్లో చేరి అస్వస్థత చెందారు. వీరిని గోలేటిలోని క్వారంటైన్‌కు పంపనున్నారు. అలాగే మంచిర్యాల సున్నంబట్టివాడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సైతం బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. బుధవారం అతడి నమూనాలను హైదరాబాద్‌ గాంధీకి పంపనున్నారు.


logo