గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Mar 29, 2020 , 02:34:11

దూరమే సమాజ క్షేమం

దూరమే సమాజ క్షేమం

 • కరోనా అంతానికి సామాజిక దూరం తప్పనిసరి
 • బయటకు వెళ్లిన సమయంలో జాగ్రత్త
 • గుంపులు గుంపులతో వైరస్‌ ముప్పు
 • ఒక్కరికి పాజిటివ్‌ ఉన్నా విజృంభించే ప్రమాదం 
 • సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి
 • విశాలమైన ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు
 • అన్ని షాపుల ఎదుట మార్కింగ్‌ 

అది కంటికి కనిపించని వైరస్‌. ప్రాణాంతకమైన రాక్షసి. ఎటు నుంచి వస్తుందో.. ఎవరిపై దాడి చేస్తుందో.. ఎవరికీ తెలియదు. జనసమూహంలో ఒక్కరికి కరోనా ఉన్నా.. ఆ వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు పడినా..  ఇతరులను తాకినా వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే మందులేని ఈ మహమ్మారిని నిరోధించాలంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు ‘సామాజిక దూరమే’ మనకు ఏకైక ఆయుధం. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మనిషికీ మనిషికి నడుమ ‘మీటర్‌ దూరం’ ఉంటేనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టపడుతుంది. కూరగాయల మార్కెట్లు, కిరాణాలు, మెడికల్‌ షాపులు, సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌, ఇతర షాపుల వద్ద సోషల్‌ డిస్టెన్స్‌ కోసం వేసిన మార్కింగ్‌ను ఫాలో అయితేనే కట్టడి సాధ్యమవుతుంది. సమాజం క్షేమంగా ఉంటుంది. లేదంటే పెనుముప్పు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా భయంకరమైన వైరస్‌. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా శరవేగంగా విజృంభించే మహమ్మారి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఉన్నది ఒక్కటే మార్గం. అది సోషల్‌ డిస్టెన్స్‌ (సామాజిక దూరం). స్వీయ నియంత్రణ, శుభ్రత పాటించడమే ఆయుధం. ప్రభుత్వం లాక్‌డౌన్‌ పాటించిన నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నా, నిత్యావసరాలు, కూరగాయలు, మందుల కోసం బయటకు తప్పక రావాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రమాదం బారిన పడాల్సి వస్తుం ది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గుంపులు గుంపులుగా తిరిగినా.. అందులో ఒక్కరికి కరోనా ఉన్నా.. దగ్గినా, తుమ్మినా.. ఇతరులను తాకినా కొవిడ్‌-19 వేగం గా విస్తరించే ముప్పు ఉంటుంది. అందుకే మనం తప్పని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలి. మా స్కులు ధరించడంతోపాటు శానిటైజర్‌ వెంట తీసుకెళ్లాలి. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. వ్యక్తికీ వ్యక్తికీ నడుమ కనీసం మీటరు దూరం ఉండాలి. వీలైనంత మేర నిత్యావసరాలు, కూరగాయలు, మెడిసిన్‌ కోసం ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్లకుండా దగ్గరలోనే తెచ్చుకోవాలి. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలు కూడా పోవచ్చు. చేయని తప్పుకు మనమే కాదు, మన కుటుంబం, సమాజం మొత్తం బాధ పడాల్సి వస్తుంది. 

యంత్రాంగం ఏర్పాట్లు..

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉమ్మడి జిల్లా యం త్రాంగం విస్తృత చర్యలు చేపడుతున్నది. ఈ నెల 23 నుం చి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించగా, ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నది. అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నది. నగరంలో కొన్ని ప్రాంతాల ను రెడ్‌జోన్లుగా ప్రకటించి, నిత్యావసర వస్తువులను ఇం టింటికీ సరఫరా చేస్తున్నది. మిగతా ప్రాంతాల వారికి నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రతి రోజూ కొంత సమ యం కేటాయించింది. స్వీయ నిర్బంధం పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, కు టుంబం నుంచి ఒక్కరే ఉండాలని పదే పదే చెబుతున్నది. బయటకు వచ్చిన సందర్భాల్లో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులు గుంపులుగా తిరగవద్దని విజ్ఞప్తి చేస్తున్నది. అయినా ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమని గుర్తించిన అధికారులు, సామాజిక దూ రం పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇరుకు ప్రాంతాల్లో ఉన్న కూరగాయల మార్కెట్లను తొలగించి, కొ త్తగా విశాలమైన ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఇప్పటి వరకు కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఉండగా, కొత్తగా 11 చోట్ల ఏర్పాటు చేశారు. ప్రధాన కూరగాయల మార్కెట్‌ను విశాలమైన కరీంనగర్‌ బస్టేషన్‌కు తరలించారు. ఇక్కడ ఎంత మంది వ్యాపారులైనా విక్రయించే ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తికి నడుమ మీటర్‌ దూరం ఉండే విధంగా మార్కింగ్‌ ఇచ్చారు. ఇలానే ఉమ్మడి జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, హుజూరాబాద్‌, సిరిస్లిల్ల కొత్త, పాత బస్టాండ్లతోపాటు చాలాచోట్ల బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో కొత్తగా మార్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు కిరాణ దుకాణాలు, సూపర్‌బజార్లు, షాపింగ్‌ మాల్స్‌లో కూడా సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. 

నిర్లక్ష్యం వద్దే వద్దు..

ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌తోపాటు అన్ని పట్టణాల్లో నూ తాత్కాలిక కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలకూ అందుబాటులో ఉండే విధం గా తెచ్చారు. అయితే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనేందుకు కాలినడకన వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే చాలాచోట్ల ప్రజలు అధికారుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. ‘మాకేమైతదిలే’ అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బైక్‌లపై వెళ్లడం, అదీ ఇద్దరిద్దరు వెళ్లడం, కొందరు కార్లలో వెళ్లడం చేస్తున్నారు. ప్రతి కూరగాయల మార్కెట్‌, నిత్యావసర దుకాణం, మెడికల్‌ షాపుల ఎదుట నిల్చునేందుకు మార్కింగ్‌లు ఇచ్చినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాంతాల వారీగా మార్కెట్లు ఏర్పాటు చేసిన అంతా ఒక్కదగ్గరికే వస్తున్నారు. కానీ, ఇక్కడే పెనుముప్పు పొంచి ఉన్నది. జాగ్రత్తలు తీసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమాజానికే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించడమే ఇప్పుడు ఆయుధంగా కనిపిస్తున్నది. నిర్లక్ష్యం వద్దే వద్దు. అప్రమత్తతతోనే వైరస్‌ను నియంత్రించవచ్చు. 

వీటిని పాటిద్దాం..

 • ఎవరికి వైరస్‌ ఉన్నదో ఎవరికి తెలుసు? సోకిన వ్యక్తిని తాకిన మరుక్షణంలో ఇతరులకు సోకుతుంది. అందుకే సామాజిక దూరం తప్పనిసరి.
 • గుంపులుగా ఉన్నపుడు ఎవరైనా తుమ్మినా, దగ్గినా పక్కన ఇతరులకు ప్రమాదం. 
 • అందుకే ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అత్యవసరమై వస్తే దూరంగా ఉండాలి. 
 • నలుగురిలోకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించాలి. సెల్ఫ్‌ శానిటైజర్లు వెంట తీసుకెళ్లాలి.
 • ప్రతి రెండు గంటలకోసారి చేతులు శుభ్రంగా కడగాలి.
 • మెటల్‌ వస్తువులపై వైరస్‌ 12 గంటల పాటు బతికి ఉంటుంది. అందుకే వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మెటల్‌ వస్తువులు ముట్టుకున్నా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. 
 • ఫ్యాబ్రిక్‌ మెటీరియల్‌పై కరోనా వైరస్‌ 9 గంటల పాటు ఉంటుంది. బట్టలను శుభ్రంగా ఉతుక్కోవాలి. 2 గంటల పాటు ఎండలో ఆరవేయాలి. 
 • మనిషి చేతులకు అంటుకున్న వైరస్‌ 10 నిమిషాల పాటు బతికి ఉంటుంది. జేబులో ఆల్కహాల్‌ స్టెరిలైజర్‌ను ఉంచుకోవాలి. ప్రతి రెండు గంటలకోసారి చేతులను శుభ్రం చేసుకోవాలి. 
 • దగ్గు, జ్వరం ఉంటే జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉండి వైద్యులను సంప్రదించాలి.
 • చల్లని పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. వేడి నీళ్లు తాగితే మంచిది.