గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Mar 28, 2020 , 02:38:21

దేనికైనా సిద్ధమే..

దేనికైనా సిద్ధమే..

  • కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు రెడీగా ఉమ్మడి జిల్లా యంత్రాంగం
  • ప్రతి జిల్లాలోనూ ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులు, క్వారంటైన్‌ సెంటరు
  • అవసరాన్ని బట్టి పడకలు, వార్డుల సంఖ్య పెంచేందుకు ఏర్పాట్లు 
  • కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో మూడు చోట్ల ప్రత్యేక కేంద్రాలు
  • జిల్లా ప్రధాన దవాఖాన నుంచే గాంధీ వైద్యశాలకు రక్త నమూనాలు 
  • 24గంటలపాటు వైద్యులు, సహాయ సిబ్బంది విధులు
  • అనుమానితులు, బాధితులకు అవిశ్రాంతంగా సేవలు
  • పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు

కరోనా కట్టడికి ఉమ్మడి జిల్లా యంత్రాంగం కదిలింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైరస్‌ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నది. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులు, క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌-19 ప్రభావం కరీంనగరంలో ఎక్కువగా ఉండడంతో ప్రధాన దవాఖానలో 220 బెడ్లతో ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులను సిద్ధం చేసి, 24గంటలపాటూ సేవలందిస్తున్నది. ఇక్కడి నుంచే అనుమానితుల రక్త నమూనాలు సేకరించి, గాంధీ వైద్యశాలకు పంపిస్తున్నది. ఈ దవాఖానతోపాటే చల్మెడ, ప్రతిమ వైద్య కళాశాలల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లకు ఆదేశించిన నేపథ్యంలో మరింత అప్రమత్తమైంది. కొత్తగా నగర శివారులోని శాతవాహన విశ్వవిద్యాలయం, చొప్పదండి నవోదయ పాఠశాల, జమ్మికుంట ఏరియా దవాఖాన, నాచుపల్లిలోని జేఎన్టీయూ, పొలాస వ్యవసాయ కళాశాల, మండెపల్లి శివారులోని డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు పరిశీలిస్తున్నది. 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కరీంనగర్‌ హెల్త్‌ : కరోనా నియంత్రణకు ఉమ్మడి జిల్లా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పకడ్బందీగా నివారణ చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ప్రభావం ఎక్కువగా ఉన్న కరీం‘నగరం’లో పలు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి, ప్రజలను హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అనుమానితులను ప్రభుత్వ ప్రధాన దవాఖాన, చల్మెడలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. వీరి ఆరోగ్యం ఇప్పటి వరకు నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది, వారితో సన్నిహితంగా మెదిలిన ఒకరికి మినహా మిగతా వారెవరికీ పాజిటివ్‌ రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అందులో భాగంగా కొత్తగా మరిన్ని ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులను అందుబాటులోకి తేనున్నారు. కొత్తగా శాతవాహన యూనివర్సిటీలో 50 బెడ్స్‌, జమ్మికుంటలో 20 బెడ్స్‌తో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, హుజూరాబాద్‌లో 25 బెడ్స్‌తో ఐసోలేషన్‌, ఐదు పడకలతో ఐసీయూను కూడా అందుబాటులోకి తేనున్నారు. అవసరమైతే చొప్పదండిలోని నవోదయ పాఠశాల, తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు పరిశీలిస్తున్నారు. అలాగే కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూ, జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.  

ప్రతిమలో వంద పడకలు..

కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో 100 పడకల ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేస్తున్నా రు. ఇప్పటికే 50 ఐసోలేషన్‌ పడకలు, 20 ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచారు. 15 వెంటిలేటర్స్‌ కూడా సిద్ధంగా ఉంచారు. అంతే కాకుండా మొబైల్‌ సేవలందించేందుకు ఒక అంబులెన్స్‌ కేటాయించారు. అత్యవసర సేవలైన గుండెకు సంబంధించి, కడుపు నొప్పి, ప్రసూతి సేవలు, చిన్న పిల్లల ట్రామాలాంటి సేవలకు నగునూర్‌ నుంచి 20 కిలో మీటర్ల పరిధిలో సేవలందిస్తున్నారు. 24 గంటలు సేవలందించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8333999678ను అందుబాటులోకి తెచ్చారు. 

రాజన్న సిరిసిల్లలో 35 పడకలు..

జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో 10 బెడ్లు, వేములవాడ చెక్కపల్లి రోడ్డులోని బాలుర వసతి గృహంలో 25 బెడ్లతో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13 మంది వైద్యులతో పాటు 26 మంది ఏఎన్‌ఎంలు, 3 ఆర్‌బీఎస్‌కే సిబ్బంది, 30 మంది స్టాఫ్‌ నర్సులు మూడు షిప్టులలో పనిచేస్తున్నారు. వీరితోపాటు మరో 150 మంది ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుమన్‌రావు, సిరిసిల్ల ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, వేములవాడ వైద్యాధికారి రేగులపాటి మహేశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో పది మందిని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. ఇందులో ఐదుగురికి నెగిటివ్‌ రాగా, డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించారు. మరో ఐదుగురిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. 165 బెడ్లతో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో బాలుర వసతి గృహం, 25 బెడ్లతో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని బాలికల వసతి గృహంలో క్వారంటైన్‌ కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. గొల్లపల్లి క్వారంటైన్‌ కేంద్రంలో వివిధ మండలాలకు చెందిన ఏడుగురిని పరిశీలనలో ఉంచారు. మూడు అంబులెన్సులతోపాటు అవసరమైతే నాలుగు అమ్మఒడి వాహనాలను వినియోగించనున్నారు. 

పెద్దపల్లి జిల్లాలో 130 బెడ్స్‌.. 

జిల్లాలో ఆరు ఐసోలేషన్‌ వార్డులు, రెండు ఐసీయూ వార్డులను సిద్ధంగా ఉంచారు. మొత్తం 100 మందికిపైగా వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 20 బెడ్లు, సుల్తానాబాద్‌ టీబీ దవాఖానలో 40, గోదావరిఖని ఏరియా దవాఖానలో 20, సింగరేణి దవాఖానలో 10, ఎన్టీపీసీ దవాఖానలో 10 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ప్రధాన దవాఖానలో 20 బెడ్స్‌, గోదావరిఖని ఏరియా దవాఖానలో 10 బెడ్స్‌తో ఐసీయూ వార్డులను అందుబాటులోకి తెచ్చారు. అవసరమైతే మరో 250 పకడలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను జిల్లాలోని ప్రైవేట్‌ దవాఖానలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

కరీంనగర్‌ ప్రధాన దవాఖానలో 220 బెడ్స్‌..

జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ముందుగా ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేశారు. ఇక్కడ 180 నుంచి 200 బెడ్స్‌లో వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 80 బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. త్వరలో 100 బెడ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు, సిబ్బంది ఇలా 65 మంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు వైద్యులు, తొమ్మిది మంది స్టాఫ్‌నర్సులు, ముగ్గురు హెడ్‌ నర్సులు, మరో ముగ్గురు ఫార్మసిస్టులు, ముగ్గురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు పేషెంట్‌ కేర్‌ సిబ్బంది, ఆరుగురు శానిటరీ వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. కలెక్టర్‌ శశాంక, నోడల్‌ ఆఫీసర్‌, డీసీవో సీహెచ్‌ మనోజ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, వైద్యలు శౌర్య, అలీం, అతుల్‌, శ్రీధర్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి నుంచే అనుమానితుల రక్త నమూనాలు సేకరించి, గాంధీ వైద్యశాలకు పంపిస్తున్నారు. వారి సూచనల మేరకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో 30 మంది అనుమానితులను ఉంచి, పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఏడుగురిని ప్రత్యేక గదుల్లో ఉంచారు. ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 20 పడకలతో ఐసీయూ వార్డును కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే మరిన్ని పడకలు, వార్డులు కూడా పెంచనున్నారు.

‘చల్మెడ’లో వంద బెడ్స్‌..

చల్మెడ వైద్య కళాశాలలో ఇప్పటికే ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో 67 మంది అనుమానితులు ఉన్నారు. ప్రభుత్వ వైద్యులు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ వార్డును నిర్వహిస్తున్నారు. నోడల్‌ అధికారిగా జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి ఐసోలేషన్‌ వార్డులో వంద మంది వరకు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు వార్డులు అందుబాటులోకి తెచ్చారు. 

జగిత్యాలలో జిల్లాలో 90 బెడ్లు..

జిల్లాలో రెండు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశా రు. జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో 40 పడకలతో ఐసోలేషన్‌, 10 బెడ్లతో ఐసీయూ సిద్ధం చేశారు. ప్రస్తుతం ముగ్గురు అనుమానితులు ఉన్నా రు. ఐసోలేషన్‌ వార్డులో ముగ్గురు ఫిజీషియన్లు సేవలందిస్తున్నారు. వీరిలో ఒకరు పల్మనాలజిస్ట్‌. అత్యవసర సేవల కోసం 15 మంది వైద్యులను కేటాయించారు. ఐదు అంబులెన్స్‌లను అందుబాటులో ఉం చారు. మెట్‌పల్లి ఏరియా దవాఖానలో 40 బెడ్స్‌తో ఐసోలేషన్‌ వార్డు ఉండగా, ముగ్గురు డాక్టర్లు, ఏడుగురు సిబ్బందిని కేటాయించారు. రెండు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. 

సన్నద్ధంగా ఉన్నాం..

కరోనా బాధితులకు 24 గంటలు సేవలందించేందుకు జిల్లా ప్రధాన దవాఖాన వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నాం. దవాఖానలోని ఒక ఫ్లోర్‌ను 50 పడకలతో అందుబాటులో ఉంచాం. ఈ ఫ్లోర్‌లో 40 పడకలతో ఐసోలేషన్‌ వార్డును, 10 పడకలతో ఐసీయూ వార్డును ఏర్పాటు చేశాం. ఇద్దరు ఫిజీషియన్లు, ఒక పల్మనాలజిస్ట్‌తో కూడిన వైద్య బృందాన్ని మూడు షిప్టులతో 24 గంటలు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉంచాం. రాత్రి పూట వైద్య సేవలందించేందుకు 17 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఏ సందర్భంలోనైనా అన్ని విధాలుగా వైద్య సేవలందించేందుకు మేమంతా సన్నద్ధంగా ఉన్నాం. 

- సుదక్షిణాదేవి, సూపరింటెండెంట్‌ (జగిత్యాల)

అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం.. 

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్‌ శశాంక ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో రెండు చోట్ల ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. ఇందులో ఇంకా బెడ్స్‌ పెంచుకునే అవకాశాలను పరిశీలిస్తు న్నాం. కొత్తగా శాతవాహన యూనివ ర్సిటీ, ప్రతిమ మెడికల్‌ కళాశాల, హుజూరాబాద్‌, జమ్మికుంట ప్రభుత్వ దవాఖానల్లో కూడా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. అవసరాన్ని బట్టి ఐసీయూ వార్డులు కూడా పెంచుకుంటాం. జిల్లాలోని అన్ని మండలాల్లో ర్యాపిడ్‌ యాక్షన్‌ టీంలు పనిచేస్తున్నాయి. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో వైద్య బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 76 మందికి వైద్య పరీక్షలు చేశాం. ఇందులో ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. మిగతా వాళ్ల పరిస్థితి ఇప్పటి వరకు నిలకడగానే ఉన్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నాం.                 

- సుజాత, డీఎంఅండ్‌హెచ్‌వో (కరీంనగర్‌)

అవసరమైతే బెడ్స్‌ పెంచుతాం.. 

జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో అవసరాన్ని బట్టి బెడ్స్‌ను పెంచుతాం. ఇప్పటి వరకు 80 బెడ్స్‌ సమకూర్చాం. రెండు మూడు రోజుల్లో వంద బెడ్స్‌ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి ఐసోలేషన్‌ వార్డులో ఉన్నవారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. వీరికి ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాలతో వైద్య బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. మూడు షిఫ్టుల్లో వైద్య బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. 

- డాక్టర్‌ అజయ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ (కరీంనగర్‌ ప్రధాన దవాఖాన)

అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నాం.. 

చల్మెడలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో ఉంటున్న వారికి అన్ని వసతులూ కల్పిస్తున్నాం. ఇక్కడ 67 మంది వరకు ఉన్నారు. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షలు చేస్తున్నారు. వారి ఆరోగ్యాలు నిలకడగా ఉండే విధంగా చూ స్తున్నారు. కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌, డాక్టర్‌ శ్రీధర్‌ కూడా నిరంతరం వచ్చి ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చల్మెడలో 100బెడ్స్‌ వరకు ఏర్పాటు చేసుకునే అవకాశమున్నది.

- వాసిరెడ్డి శ్రీధర్‌, నోడల్‌ ఆఫీసర్‌, చల్మెడ ఐసోలేషన్‌ వార్డు (కరీంనగర్‌) 

సామాజిక బాధ్యత 

ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు ప్రతిమ మెడికల్‌ కళాశాల సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మా దవాఖానలో ఐసోలేషన్‌ వార్డులో 50 బెడ్స్‌, ఐసీయూ వార్డులో 20 బెడ్స్‌ ఏర్పాటు చేశాం. అవసరాన్ని బట్టి మరిన్ని బెడ్స్‌ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని ఏ మెడికల్‌ కళాశాలలో లేని విధంగా మా కళాశాలలో ఐసీయూలో 200 బెడ్స్‌ ఉన్నాయి. పరిస్థితిని బట్టి కరోనా నివారణ చర్యలకు అన్ని బెడ్స్‌ వినియోగిస్తాం. ఐసోలేషన్‌ వార్డును కూడా విస్తరిస్తాం.                       

  - డాక్టర్‌ అమిత్‌ కుమార్‌, కో ఆర్డినేటర్‌, ప్రతిమ ఐసోలేషన్‌ వార్డు (కరీంనగర్‌)

 అప్రమత్తంగా ఉన్నాం.. 

ప్రభుత్వ పిలుపు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యం త్రాంగం అప్రమత్తంగా ఉన్నది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 100 పడకలతో ఐసోలేషన్‌ వార్డులను, 30వరకు ఐసీయూలను ఏర్పాటు చేశాం. అవసరమైతే జిల్లాలో మరో 250 పడకలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తిచేశాం. 

- సుధాకర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో (పెద్దపల్లి)

24గంటలపాటు అత్యవసర సేవలు..

జిల్లా ప్రధాన దవాఖానలో 24 గంటలు సేవలందించేం దుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు. మూడు షిప్టుల్లో వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి వైద్య పరీక్షలు చేశాం. ఐదుగురికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేసి పంపించాం. మరో ఐదుగురిని ఐసోలేషన్‌ గదిలో ఉంచి అబ్జర్వేషన్‌లో పెట్టాం. ఎక్కువ సంఖ్యలో వస్తే అందుకు మరిన్ని వార్డులను ఐసోలేషన్‌ గదులుగా మార్చి సేవలందిస్తాం. 

- మురళీధర్‌రావు, సూపరింటెండెంట్‌ (సిరిసిల్ల)logo