మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Mar 26, 2020 , 02:54:58

పల్లె స్ఫూర్తి

పల్లె స్ఫూర్తి

  • స్వీయ నిర్బంధంవైపు గ్రామాలు
  • రోజురోజుకూ గ్రామీణుల్లో చైతన్యం 
  • మరిన్ని చోట్ల రాకపోకలు బంద్‌
  • ఊళ్ల్లలోనూ కరోనా నివారణ చర్యలు

కరోనా వైరస్‌ నియంత్రణకు గ్రామీణులు మరింత అప్రమత్తమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో స్వీయ నిర్బంధం విధించుకుంటున్నారు. ఇతరులెవరూ తమ గ్రామాలకు రావద్దంటూ దారులను మూసివేస్తున్నారు. ఇప్పటికే వందలాది ఊళ్లకు రాకపోకలు బంద్‌ కాగా, బుధవారం కూడా పెద్దసంఖ్యలో పల్లెలకు నిలిపివేశారు. శివార్లలో రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, రాళ్లు, ముళ్లకంపలు పెట్టారు. గ్రామాల్లోనూ నివారణ చర్యలు చేపట్టారు. మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, సామాజిక దూరం పాటించాలని విస్తృతం ప్రచారం చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.  

-కరీంనగర్‌ ప్రతినిధి/జగిత్యాల ప్రతినిధి/ పెద్దపల్లి ప్రతినిధి/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కరీంనగర్‌ జిల్లాలో వందకుపైగా గ్రామాలు..

జిల్లాలో మంగళవారం సుమారు 30గ్రామాలు నిర్బంధం పాటించగా, బుధవారం 74 పల్లెలు ఆంక్షలు విధించుకున్నాయి. చొప్పదండి మండలం భూపాలపట్నం, రేవెళ్లి, మంగళపల్లిలో బారికేడ్లు పెట్టారు. గంగాధర, రామడుగు మండలాల్లో అయితే అన్ని గ్రామాల ప్రజలు అష్టదిగ్భంధం చేసుకున్నారు. మానకొండూర్‌ మండలం ముంజంపల్లిలో రోడ్డుకు అడ్డంగా కంచె నాటుకున్నారు. చిగురుమామిడి మండలం సుందరగిరిలో చెక్‌ పోస్టును ఏర్పాటు చేసుకున్నారు. రేకొండలో ముళ్ల పొదలు అడ్డం పెట్టి రోడ్డును మూసేశారు. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి, కొండాపూర్‌, గుండ్లపల్లి గ్రామాలకు రాకుండా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసుకున్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం, కన్నాపూర్‌, కాచాపూర్‌, రాజాపూర్‌, ఆముదాలపల్లి గ్రామాల్లో ఇతరులెవరు తమ గ్రామాల్లోకి రావద్దని తాళ్లు, కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. సైదాపూర్‌ మండలం లస్మన్నపల్లిలో, హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అమ్మక్కపేటలో ముళ్ల పొదలు అడ్డు వేశారు. వీణవంకతోపాటు గంగారంలో కూడా ముళ్లపొదలు అడ్డువేసి రోడ్లను మూసేశారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం ఫకీర్‌ పేట, మందులపల్లి, మొగ్దుంపూర్‌, దుర్శేడ్‌లో రోడ్లుపై కంచెలు వేశారు. నగునూర్‌, మొగ్దుంపూర్‌లో తీసుకోవాలసిన జాగ్రతల గురించి ప్రచారం చేస్తున్నారు.  

జగిత్యాల జిల్లాలో 70కిపైగా పల్లెలు.. 

జిల్లా అంతటా మూడో రోజూ లాక్‌డౌన్‌ ప్రశాంతంగా సాగింది. నిన్నటిదాకా 50గ్రామాలు స్వీయ నిర్బంధం అమలు చేసుకోగా, బుధవారం నాటికి మరో 20గ్రామాలు రాస్తా బంద్‌ చేసుకున్నాయి. ధర్మపురి మండలం నాగారం, కమలాపూర్‌, తుమ్మెనాల, నక్కలపేట, దొంతాపూర్‌, ఆరెపల్లి శివార్లలో ముండ్ల కంపతో కంచెలు వేసుకున్నారు. కోరుట్ల మండలంలోని అన్ని ఊళ్లలో సెల్ఫ్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. కోరుట్ల పట్టణంలోని ఓ కాలనీవాసులు సైతం తాళ్లతో కంచె వేసుకొని స్వీయ నిర్బంధం విధించుకున్నారు. గొల్లపల్లి మండలం వెంగళాపూర్‌, రాపల్లిలో రహదారులు బంద్‌ చేశారు. పారిశుధ్య పనులు చేపట్టారు. మెట్‌పల్లి, సారంగాపూర్‌, కథలాపూర్‌, మల్లాపూర్‌ మండలాల వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగింది. మేడిపల్లి మండల కేంద్రంతో పాటు లింగంపేట, కట్లకుంట, తోంబర్‌రావుపేట, గూండ్లపల్లి, మోత్కురావుపేట, మన్నెగూడెం, భీమారం, కొండాపూర్‌, ఒడ్డ్యాడులో రహదారుల దిగ్బంధం చేశారు. బీర్‌పూర్‌ మండలం కొల్వాయి, కోమన్‌పల్లిలో ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరిని అధికారులు కలిసి ముందస్తు జాగ్రత్తలు వివరించి వారి పాస్‌పోర్టులు తీసుకున్నారు. రాయికల్‌ మండలంలోని ఇటిక్యాల తదితర గ్రామాల్లో యువకు లు గస్తీ తిరుగుతున్నారు. రాయికల్‌ మున్సిపల్‌ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా విధించేలా తీర్మానం చేశారు. మల్యాలతో పాటు 19ఊర్లలో స్వీయ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. మద్దుట్ల, మ్యాడంపల్లి, ముత్యంపేటలో రహదారులను మూసివేసి పారిశుధ్య పనులు చేపట్టారు. 

సిరిసిల్ల జిల్లాలో 81 ఊళ్లు.. 

పల్లెలు ప్రజలు సరిహద్దులను దిగ్బంధనం చేస్తున్నారు. తమ ఊరికి రావద్దంటూ రాళ్లు, కంచెలు, ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకర్లు, టైర్లు, ఎడ్లబండ్లతో కట్టడి చేస్తున్నారు. జిల్లాలో మంగళవారం 31 గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానించి, స్వీయనిర్బంధంలోకి వెళ్లగా, బుధవారం మరో 50 గ్రామాల్లో సరిహద్దుల్లో రాకపోకలను నిలిపివేశారు. వీర్నపల్లి మండలంలోని శాంతినగర్‌లో జిల్లా, నిజామాబాద్‌ను కలిపే సరిహద్దులను రాళ్లతో మూసి వేశారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. 

బుధవారం చందుర్తి మండలంలోని 4, కోనరావుపేట మండలంలో 10, వేములవాడ రూరల్‌ మండలంలో 2, ఎల్లారెడ్డిపేట మండలంలో 5, గంభీరావుపేట మండలంలో 5, ఇల్లంతకుంట మండలంలో 3, వీర్నపల్లి మండలంలో 8, ముస్తాబాద్‌ మండలంలో 10, తంగళ్లపల్లి మండలంలో 3 గ్రామాల్లో రాకపోకలు నిలిపివేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల చెక్‌పోస్టు లో తనిఖీలు నిర్వహించారు. పెద్దూరు శివారులో అపెరల్‌ పార్క్‌లో పనిచేస్తున్న కార్మికులకు కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ అవగాహన కల్పించారు. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన ఓ వ్యక్తిని గొల్లపల్లి బీసీ హాస్టల్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకు వెళ్లి వచ్చే అడవిపదిర గ్రామస్తులు చేతులు శుభ్రం చేసుకునేందుకు గ్రామశివారులో కుండీల్లో నీటిని అందుబాటులో ఉంచారు. బోయినపల్లి మండలం బూరుగుపల్లిలో కల్లు విక్రయించవద్దని కల్లు మండువలో వీపీవో దేవేందర్‌, గ్రామస్తులు కల్లు కుండలను పగులగొట్టారు. 

పెద్దపల్లి జిల్లాలో 140కిపైగా గ్రామాలు..

జిల్లాలో మంగళవారం 60కిపైగా గ్రామాలు లాక్‌ డౌన్‌ పాటించగా, బుధవారం 84 గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఆయా గ్రామాల్లోకి బయటి వారెవరూ రాకుండా, గ్రామానికి చెందినవారెవరూ బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన రోడ్లకు చెట్ల కొమ్మలు, ట్రాక్టర్లను అడ్డుగా ఏర్పాటు చేశారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల్లోకి ఇతర వాహనాలు ప్రవేశించకుండా ప్రధాన రహదారులను మూసి వేశారు. మంథనిలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు పుట్ట శైలజ లాక్‌ డౌన్‌ను పర్యవేక్షించారు. గోదావరిఖనిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పర్యటించి, పరిస్థితులను పరిశీలించారు.logo