మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Mar 26, 2020 , 02:52:16

వైద్యులూ వందనం..

వైద్యులూ వందనం..

  • కరోనాపై సర్కారు సర్కారు డాక్టర్లు, సహాయ సిబ్బంది అలుపెరగని పోరాటం
  • ప్రాణాలకు తెగించి 24గంటలపాటు సేవలు
  • ఐసోలేషన్‌ వార్డులో జంకు లేకుండా విధులు
  • రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ఇంటింటికీ స్క్రీనింగ్‌ పరీక్షలు
  • బాధితులు, అనుమానితులకు  ‘మేమున్నా’మనే భరోసా
  • సర్వత్రా ప్రశంసలు 
  • సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు 

వైద్యం అంటే.. ఓ వృత్తి కాదు, మనుషులను బతికించే ఓ మహాశక్తి అని నిరూపిస్తున్నారు కరీంనగర్‌ జిల్లా సర్కారు వైద్యులు! కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు శాయశక్తులా పోరాడుతున్నారు. ప్రాణాంతకమైన వైరస్‌ అని తెలిసినా ప్రాణాలకు తెగించి సైనికుల వలె 24గంటలపాటూ సేవలందిస్తున్నారు. వృత్తినే దైవంగా భావించి ప్రధాన దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డులో అనుమానితులు, బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇటు కరీం‘నగరం’లో గుర్తించిన రెడ్‌ జోన్‌ ఏరియాల్లో ఇంటింటికీ స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తూ, చైతన్యం చేస్తున్నారు. ‘వైద్యో నారాయణో హరి’ అన్న పెద్దల మాటలను అక్షరాలా నిజం చేస్తూ, ప్రజలకు ‘మేమున్నా’మనే భరోసా ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు ఇదే తీరున సేవలందిస్తుండగా, ప్రజలంతా సెల్యూట్‌ కొడుతున్నారు. సోషల్‌ మీడియాలో అయితే పోస్టులతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌ హెల్త్‌: ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం.. అక్కడి నుంచి వచ్చిన పది మందితోపాటు స్థానికంగా ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. సదరు వ్యక్తులతో సన్నిహితంగా మెదిలిన.. లేదా కలిసిన వ్యక్తులను గుర్తించి పరీక్షల కోసం జిల్లాయంత్రాగం కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నది. ఇదే సమయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనుమానితులను ఇక్కడికే పంపిస్తుండగా, వైద్య యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. ఈ ఐసోలేషన్‌ వార్డులో వైద్యులు, హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, వార్డు బాయ్స్‌, స్వీపర్లు కలిసి మొత్తం 65 మంది పనిచేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సేవలందిస్తున్నారు. నైట్‌ షిప్టు కోసం సిబ్బందిని అదనంగా వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఒక సూపరింటెండెంట్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఈ వార్డును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 24 గంటల్లో ఎప్పుడు సమాచారం వచ్చినా అంతే వేగంగా స్పందిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు, లేదా అనుమానితుల సమాచారం అందిన వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తీసుకొచ్చి, ప్రాథమిక పరీక్షలు చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడే రక్త నమూనాలు సేకరించి గాంధీ వైద్యశాలకు పంపిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినా.. వైద్య సిబ్బంది మాత్రం తమ సేవల్లో ఏమాత్రం లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఐసోలేషన్‌ వార్డుకు వచ్చిన వ్యక్తులకు భరోసా కల్పిస్తున్నారు. ‘మేం ఉన్నాం... మీకేమీ కాదం’టూ వారిలో నమ్మకాన్ని పెంచుతున్నారు. ఇటు కరోనా ప్రభావిత ప్రాంతమైన ముకరంపుర, కశ్మీర్‌గడ్డ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నుంచి రక్త నమూనాలు కూడా సేకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెడ్‌జోన్‌లో ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఒక్క కరీంనగర్‌లోనే కాదు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సేవలందిస్తున్నారు. కష్టమని తెలిసినా.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కంటి మీద కునుకులేకుండా పనిచేస్తూ, ప్రజల అభిమానం చూరగొంటున్నారు. సోషల్‌ మీడియాలో అయితే ప్రత్యేకంగా పోస్టులు రూపొందించి, అభినందిస్తున్నారు. 

ఆకలి, నిద్ర లేకుండా  పనిచేస్తున్నాం..

ఐసోలేషన్‌ వార్డులోకి రాగానే ముందు భయపడ్డా.. వృత్తినే దైవంగా భావించి సేవలందిస్తున్నాం. ఆకలి, నిద్ర లేకుండా పనిచేస్తున్నాం. గతంలో ఎంతో మంది హెచ్‌ఐవీ బాధితులకు వైద్యం చేసినా భయపడలేదు. నా 32 ఏళ్ల సర్వీసులో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏనాడూ కనిపించలేదు. మా కుటుంబంలో అందరూ ఇదే వృత్తిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నది.

-సరళ, హెడ్‌నర్స్‌ (కరీంనగర్‌) 


రిస్క్‌లో ఉన్నా సేవలందిస్తున్నాం

కరోనా లాంటి వైరస్‌ను ఎన్నడూ చూడలేదు. ఇది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఇండోనేషియావాసులు కరీంనగర్‌కు రావడంతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రధాన దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ముందుగా కొంచెం భయపడినప్పటికీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో వైద్య సేవలందిస్తున్నాం. రిస్క్‌లో ఉన్న పేషెంట్లకు వైద్య సలహాలు ఇస్తూ, చికిత్స అందిస్తున్నాం. 

- కుమార్‌, వైద్యుడు (కరీంనగర్‌) 

వృత్తినే దైవంగా భావిస్తున్నాం..

మొదట నాకు ఐసోలేషన్‌ వార్డులో డ్యూటీ వేయగానే భయమేసింది. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత భయంపోయింది. అనుమానితులకు భరోసా కల్పిస్తున్నాం. వృత్తినే దైవంగా భావించి, ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నాం. ఏదేమైనా సహాయం చేయడం ఆనందంగా ఉంది.      

 -మామిడి శారద, ఫార్మసిస్ట్‌ (కరీంనగర్‌) 

ఇక్కడే డ్యూటీ చేయాలనిపిస్తున్నది..

కరోనా అనుమానితులకు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నాం. ఎంతో టెన్షన్‌తో వచ్చే బాధితులకు కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. మేమున్నాం అనే భరోసా ఇస్తున్నాం. వారు సంతోషంగా ఉండడం మాకు సంతోషంగా ఉంది. మొదట భయం అనిపించినా ఇప్పుడు డ్యూటీ ఇక్కడే చేయాలనిపిస్తున్నది.    

-సుష్మ, స్టాఫ్‌ నర్స్‌ (కరీంనగర్‌) 

బాధ్యతగా పనిచేస్తున్నాం..

నేను ఐసోలేషన్‌ వార్డులో పనిచేస్తున్నా. ప్రభుత్వం తక్కువ సమయంలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి, వసతులు కల్పించడం శుభపరిణామం. మాకు మాస్కులు, డ్రెస్‌లు పూర్తిస్థాయిలో ఉన్నాయి. అధికారులు మాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నారు. నర్సింగ్‌ వృత్తిని ఒక బాధ్యతగా తీసుకొని సేవలందిస్తున్నాం. 

-భారతి, హెడ్‌ నర్స్‌ (కరీంనగర్‌) 

నేనే ముందుకు వచ్చా..

కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్న వార్డులో నేను పనిచేస్తున్నా. మొదట భయం అనిపించినా, ఇప్పుడు ధైర్యంగా ఉన్నాం. మూడు వార్డులను ఇద్దరం కలిసి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. డ్రెస్స్‌, గ్లౌజ్‌, మాస్కులు వేసుకొని పనిచేస్తున్నాం. ప్రజలు ఎక్కువగా భయపడుతున్నారు. కానీ, అలాంటి భయమేమీ లేదు. వైద్యులు మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మొదట ఇక్కడ పనిచేసేందుకు నేనే ముందుకు వచ్చా.  

-రాధ, స్వీపర్‌ 


logo