బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Mar 23, 2020 , 02:01:51

జయహో జనతా

జయహో జనతా

  • జిల్లాలో విజయవంతమైన కర్ఫ్యూ
  • ఉదయం నుంచే నిర్మానుష్యంగా పట్టణాలు
  • పల్లెల్లోనూ అదే వాతావరణం
  • పోలీసులు తప్ప కనిపించని జనం 
  • ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునకు విశేష స్పందన
  • స్వచ్ఛందంగా పాల్గొన్న జిల్లాప్రజలు
  • సాయంత్రం వేళ సేవకులకు చప్పట్లు
  • చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌.. హైదరాబాద్‌లో రసమయి

వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే జిల్లా ప్రధానదారులు ఆదివారం బోసిపోయాయి.. కొత్త, పాత బస్టాండ్‌లు, గాంధీ, నేతన్న చౌక్‌లు, కోర్టు, ఎల్లమ్మ చౌరస్తాలు.. ఇలా అన్ని ప్రాంతాలూ వెలవెలబోయాయి.. దవాఖానలు, మెడికల్‌షాపులు, మార్కెట్లు, వ్యాపారసముదాయాలన్నీ మూతపడ్డాయి.. వేములవాడతో పాటు మండల కేంద్రాలు, పల్లెల్లోనూ అవే దృశ్యాలు కనిపించాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునివ్వగా, జిల్లా ప్రజానీకం స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణం నెలకొనగా, జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలకు సంఘీభావంగా సాయంత్రం ప్రజలు ఇంటి ముంగిళ్లలో నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలి పి, ఐక్యత చాటారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చొప్పదండిలో, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హైదరాబాద్‌లోని తమ ఇళ్లలోనే కుటుంబసభ్యులతో గడిపారు. పోలీసులు ఆయాచోట్ల పర్యటించి కర్ఫ్యూను పర్యవేక్షించారు. 

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. జనతా క ర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. సోమవారం ఉదయం నుంచే జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను మూసివేశాయి. నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని కొత్త, పాత బస్టాండ్‌లు, నేతన్న చౌక్‌, ఎల్లమ్మ, కోర్టు చౌరస్తాలు, భక్తులతో కిటకిటలాడే వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలు బోసిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు లేక బస్‌డిపోలు వెలవెలబోయాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని ఏ ప్రాంతం చూసినా నిర్మానుష్యంగా కనిపించింది. అక్కడక్కడా విధులు నిర్వహించిన పోలీసులు మినహా సాధారణ జనం కనిపించలేదు. డీఎస్పీ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెల్దండి సమ్మయ్య ఆధ్వర్యంలో సిరిసిల్లలోని పలు ప్రాం తాల్లో పర్యటించి పరిస్థితిని స మీక్షించారు. అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. 

మిగతా చోట్లా స్వచ్ఛంద బంద్‌..

మండల కేంద్రా లు, గ్రామాల్లోనూ నిర్మానుష్య వాతావారణమే కనిపించింది. ఎక్కడ చూసినా జనసంచారం, వాహనాలు కనిపించలేదు. రహదారులపై పోలీసుల పహారా కొనసాగింది. 

మార్మోగిన చప్పట్లు.. 

కరోనా వైరస్‌ సోకిన వారిని రక్షించేందుకు సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు సంఘీభావం తెలపాలని ప్రధాని, సీఎం పిలుపు మేరకు జిల్లాప్రజలు సాయం త్రం 5 గంటలకు చప్పట్లు కొట్టారు. ఎవరి ఇండ్లలో వారు ఉండి కొందరు, మరి కొందరు వీధుల్లోకి వచ్చి, ఇంకొందరు గ్రామాల్లోని చౌరస్తాలు, ప్రధాన కూడళ్లల్లోకి వచ్చి చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. 

స్వీయ నిర్బంధంలో ప్రజాప్రతినిధులు..

నగరంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఆదివారం తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపారు. భార్యా పిల్లలలో కలిసి టీవీ చూశారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో గడిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ సిరిసిల్లలో, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి వేములవాడలో తమ కుటుంబ సభ్యులతో ఇండ్ల వద్ద ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.