ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Mar 21, 2020 , 02:22:21

కందులే కందులు..

కందులే కందులు..

  • కొనుగోలు కేంద్రాలకు  పోటెత్తిన గింజలు
  • ఈయేడు అంచనాలకు మించి దిగుబడులు  
  • 1,470 హెక్టార్లలో సాగు 
  • గత సంవత్సరం 575 హెక్టార్లు.. 
  • మద్దతు ధర రూ.5,800 

జిల్లాలో కందుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. 1,470 హెక్టార్లలో సాగు కాగా, కేంద్రాలకు పోటెత్తాయి. 5,100 క్వింటాళ్లు కొనాలన్నది మార్కెఫెడ్‌ శాఖ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 12,683 క్వింటాళ్లు కొనుగోలు అయ్యాయి. చివరి గింజ వరకూ కొనాలనే మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మార్కెటింగ్‌ శాఖ శుక్రవారం సాయంత్రం దాకా తీసుకోగా, అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. - రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ 

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కొనుగోలు కేంద్రాలకు కందులు పోటెత్తాయి. దిగుబడిపై  అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. గతేడాది 575 హెక్టార్లలో సాగు చేయగా, ఈయేడు 1,470 హెక్టార్లలో పంట వేశారు. 5100 క్వింటాళ్లు కొనుగోలు చేయాలన్నది మార్కెఫెడ్‌ శాఖ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 12,683 క్వింటాళ్లు కొనుగోలయ్యాయి. రాష్ట్ర మంతటా కొనుగోళ్లు మూడు రోజుల క్రితమే ము గిసినప్పటికీ, చివరి గింజ వరకూ కొని రైతుకు న్యాయం జరిగేలా చూడాలని ఇటీవల మంత్రి కే టీఆర్‌ ఆదేశించారు. ఈమేరకు మార్కెటింగ్‌ శాఖ నేటి సాయంత్రం వరకు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రభుత్వ మద్దతు..

ఊహించని విధంగా కంది దిగుబడి రావడం తో రైతుల్లో ఆనందం వెల్లి విరిసింది. దళారులకు అమ్మకుండా నేరుగా మార్కెట్‌కే కందులు తీసుకొచ్చారు. ప్రభుత్వం కందికి రూ. 5800 మద్దతు ధర కల్పించింది. గత సంవత్సరం రూ. 5500 ఉండగా ఈసంవత్సరం కాస్త పెంచింది. బయట దళారులు క్వింటాలుకు రూ. 4000 మాత్రమే చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ప్రభుత్వ మద్దతు ధరకే మొగ్గుచూపుతున్నారు.  పెద్ద సంఖ్యలో రైతులు కందులతో తరలి రావడంతో మార్కెట్‌ యార్డులు కిటకిటలాడుతున్నాయి. 

రైతులకు మౌలిక వసతుల కల్పన

కందులు విక్రయించడానికి వస్తున్న రైతులకు వ్యవసాయ మార్కెట్‌లో మౌలిక వసతులు కల్పించారు. ఆరబోసేందుకు టార్పాలిన్‌ కవర్లు, చెత్తను వేరు చేసేందుకు పది వరకు జల్లెడ యంత్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూపన్లు ఇస్తున్నారు. బయటి దళారుల కన్నా ప్రభుత్వం ఇస్తున్న మద్ద తు ధర క్వింటాలుకు రూ.5,800 చెల్లిస్తున్నందున రైతులంతా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు.  సర్కారు మద్దతు ధరతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రేపటితో కొనుగోళ్లు బంద్‌ 

జిల్లాలో కందుల దిగుబడి అంచనాలకు మిం చి రావడంతో  వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన కందులను వెంట వెంటనే కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం తగ్గిన వెంటనే తూకం వేసి బస్తాల్లో నింపి గోదాములకు తరలిస్తున్నారు. కొత్తగా వచ్చి న రైతులకు ఆరబోసుకునే అవకాశం కల్పిస్తున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 18తోనే కొనుగోళ్లు ముగిసినప్పటికీ, దిగుబడి పెరగడం వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు అధికారులు ఈనెల 20వరకు పొడిగించారు.  వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 5100 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని అధికారుల అంచనా కాగా, ఇప్పటివరకు 12,683 క్వింటాళ్లను 2117 మంది రైతుల వద్ద కొనుగోలు చేశారు. రూ.7 కోట్ల 35లక్షల 64వేల 300 చెల్లించారు. నేటి సాయంత్రం వరకు మరో వెయ్యి క్వింటాళ్ల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి సాయంత్రం వరకు మార్కెట్‌ కమిటీలకు వచ్చిన కందులను మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తుగా రైతులు వచ్చి టోకెన్లు తీసుకుంటున్నారు. కందులు తెచ్చే రైతులు స్థానిక వ్యవసాయ శాఖ ఏఈవో, ఏవోలతో పంట విస్తీర్ణం రాయించుకుని వస్తే మార్కెట్‌ కమిటీలో అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. కొనుగోలు చేసిన కందులకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తున్నారు. 

మద్దతు ధరకే అమ్ముతున్నం 

కందులు ఈసారి ఎక్కువ మొత్తంలో వచ్చాయి. బయటి దళారులు క్వింటాలుకు రూ.4వేలు అడుగుతున్నరు. అందుకే సర్కారు ఇస్తున్న మద్దతు ధర రూ.5,800కు అమ్ముకుంటున్నం. మార్కెట్‌లో మాకు మంచి సౌకర్యాలు కల్పించిండ్రు. 

-సామ నర్సింహారెడ్డి, రైతు ముస్కానిపేట ఇల్లంతకుంట మండలం 


ఏర్పాట్లు బాగున్నయ్‌.. 

సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఏర్పాట్లు బాగున్నయి. కందులు ఆరబోసుకునేందుకు టార్పాలిన్‌ కవర్లు వట్టిగనే ఇస్తున్నరు. చెప్పినట్లు తేమ శాతం ఉంటే వెంటనే తూకం వేసి కొంటున్నరు. డబ్బులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తున్నారు.   

-పయ్యావుల మల్లయ్య, సిరికొండlogo