గురువారం 04 జూన్ 2020
Rajanna-siricilla - Mar 21, 2020 , 02:19:58

ఆపరేషన్‌ కరోనా

ఆపరేషన్‌ కరోనా

  • రోడ్లన్నీ నిర్మానుష్యం
  • ఇండ్లకే పరిమితమైన జనం
  • వ్యాపార సముదాయాల మూసివేత 
  • ఆరోగ్య సూత్రాలు పాటించాలి
  • వేములవాడలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ విస్తృత ప్రచారం 
  • సిరిసిల్లలోని ప్రధాన దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు పరిశీలన

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాపి నేపథ్యంలో జిల్లా అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రావద్దని ప్రభుత్వ ఆదేశాలతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. దు కాణాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటళ్లు, సిని మా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ స్వచ్ఛందంగా మూసివేశారు. దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు వేములవాడ రాజన్న, భీమేశ్వర, అగ్రహారంలోని ఆంజనేయ ఆలయాలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయాలన్నీ మూసి వేయించారు. ప్రార్థనా స్థలాలను కూడా మూసి వేసి, ఇండ్లలోనే నమాజ్‌, ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సలహాలు ఇస్తున్నారు. ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులను తగ్గించింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మున్సిపల్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాహనాలకు మైకులు కట్టి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మా స్కులు ధరించి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. 

విదేశాల నుంచి వచ్చేవారిపై నిఘా .. 

 కరోనా వ్యాప్తి నేపథ్యంలో యం త్రాగం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున, స్వగ్రామాలకు వచ్చేవారిపై నిఘాపెట్టింది. వివిధ దేశాల నుంచి స్వగ్రామాలకు వస్తు న్న వారి వివరాలను ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి స్వీకరిస్తున్నారు. వచ్చిన వారి సమాచారం సేకరించి అధికారులు స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఇండ్లనుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాకు వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గ్రామాలు, నివాస ప్రాంతాల్లో ఉండేవారికి విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు తెలుపాలని అధికారులు తమ ఫోన్‌ నంబర్లను ఇస్తున్నారు. 

సినిమా థియేటర్లు మూసివేత  

 సినిమా థియేటర్లు, పార్కులు, ఎగ్జిబిషన్‌ నిర్వాహకులను పిలిచి మూసివేయాలని సూచించారు. ప్ర భుత్వ ఆదేశాలతో యజమానులు స్వచ్ఛందంగా మూ సివేశారు. వారం క్రితమే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రారంభమైన ఎగ్జిబిషన్‌కు కరోనా ఎఫెక్ట్‌తో బ్రేక్‌ పడింది. పార్కులు, హోటళ్లు , టిఫిన్‌ సెంటర్లు, షాపింగ్‌ మాల్స్‌, బట్టల దు కాణాలు, మూసివేశారు. కేవలం మందులు, కిరాణా, పెట్రోల్‌ బంకులు పాక్షికంగా నడుస్తున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే పెట్రోలు బంకుల వద్ద వాహనాలు కనిపించడం లేదు.  

తగ్గిన ప్రయాణికుల సంఖ్య..

కరోనా వ్యాప్తి చెందకుండా ఇండ్లనుంచి బయటకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రావడం లేదు. ప్రయాణికుల సంఖ్య తగ్గింది. బస్టాండ్లలో జనం లేక ఆర్టీసీ బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. ప్రధాన మైన రూ ట్లలో మాత్రమే బస్సులను నడిపిస్తున్నారు. బస్టాండ్లలో ఆర్టీసీ ఉద్యోగులు కరోనా వైరస్‌పై ప్రయాణికుల కు అవగాహన కల్పిస్తున్నారు. బస్సులను ఎప్పటికప్పు డు శుభ్రం చేస్తున్నారు. వివాహాలు, శుభకార్యాలలో జనం రద్దీ కనిపించడం లేదు. మాంసం అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 

 లండన్‌ ఎయిర్‌పోర్టులో  సిరిసిల్ల యువకుడు

 సిరిసిల్లటౌన్‌: కరోనా ఎఫెక్ట్‌ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. సిరిసిల్ల సెస్‌ వైస్‌చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్‌ కొడుకు శ్రవణ్‌ లండన్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమం లో శ్రవణ్‌ కూడా స్వదేశానికి వచ్చేందుకు శుక్రవారం లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. కాగా అక్కడి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు విమానాలు నిలిపివేసినట్లు చెప్పడంతో శ్రవణ్‌ అక్కడే ఉండిపోయాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రవణ్‌ మాదిరిగానే ఆయా దేశాల్లో సిరిసిల్లకు చెందిన మరింత మంది ఉన్నట్లు తెలుస్తున్నది. logo