గురువారం 04 జూన్ 2020
Rajanna-siricilla - Mar 21, 2020 , 02:12:22

ఆలయాల మూసివేత

ఆలయాల మూసివేత

వేములవాడ, నమస్తేతెలంగాణ/ వేములవాడ కల్చరల్‌ : ప్రతినిత్యం భక్తుల సందర్శనతో కళకళలాడే రాజన్న ఆలయం నేడు వెలవెలబోతున్నది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆలయాలకు భక్తుల సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయగా, రాజన్న ఆలయంలోనూ అధికారులు అమలు చేశారు. వందేళ్ల క్రితం ప్లేగు వ్యాధితో మూడు నెలలు ఆలయానికి భక్తుల తాకిడిని నిలుపుదల చేయగా, 1978లో కలరా వ్యాధితో నెల రోజుల పాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలను నిలిపివేశారు. తాజాగా కరోనా వ్యాధి వ్యాప్తిచెందకుండా జన సందోహాన్ని నియంత్రించేందుకు 42 ఏళ్ల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. నిత్యసేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు.

కొనసాగుతున్న చతుష్కాల పూజలు

దేవాదాయశాఖ అధికారుల అనుమతితో రాజన్న ఆలయంలోనికి భక్తుల రాకను అధికారులు శుక్రవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో భక్తులు ఆలయ మెట్లపైనే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని వెనుదిరిగారు. స్వామివారికి నిత్యం చతుష్కాల (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి) పూజలను మాత్రం ఆలయ అర్చకులు నిర్వహించారు. రాజన్న అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, శ్రీనగరేశ్వరాలయాలు కూడా మూసి ఉండడంతో భక్తులు వాటి ముందు నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

చతుష్కాల పూజలు చేస్తున్నాం..

స్వామివారి దర్శనాన్ని మాత్రమే అధికారులు నిలుపుదల చేశారు. స్వామివారికి నిత్యం జరిపే చతుష్కాల పూజలను మాత్రం యథావిధిగా కొన సాగిస్తున్నాం. లోక కల్యాణార్థం చేపట్టిన ఈ కార్య క్రమానికి భక్తులు సహకరించాలి. 

- అప్పాల భీమాశంకర్‌, స్థానాచార్యులు 

భక్తుల తాకిడి తక్కువగా ఉండేది

1978లో కలరా వ్యాధితో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఆలయాన్ని అప్పటి అధికారులు మూసివేశారు. భక్తుల రద్దీ కూడా వం దల సంఖ్యలోపే ఉన్నప్పటికీ వ్యాధి నియంత్రణకు అధికారులు చొరవ చూపారు.  

- గండ్ర ఆగమరావు, రిటైర్డ్‌ ఏఈవో, వేములవాడ

ధర్మపురి ఆలయం 

ధర్మపురి,నమస్తేతెలంగాణ/మల్యాల/సారంగాపూర్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్య ల్లో భాగంగా రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయా న్ని శుక్రవారం ఉదయం నుంచి మూసివేసినట్లు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్‌ తెలిపారు. నిత్యకైంకర్యాలు, అర్చనాది కార్యక్రమాలను అర్చకు లు నిర్వహిస్తారని, భక్తులను  దర్శనానికి అనుమతించబోమని చెప్పారు. దేవాదాయ శాఖ నుంచి తర్వాతి ఆదేశాలు వచ్చేంతవరకు ఆర్జితసేవలను నిలిపివేస్తామని, భక్తులు సహకరించాలని కోరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలోనూ స్వామివారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసా ద్‌ తెలిపారు.నిత్య పూజలు ధూపదీప, నైవేద్యాలను, బోగాలను అర్చకులతో నిర్వహిస్తామని, భక్తులకు దర్శనాన్ని రద్దు చేశామని చెప్పారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ శర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు ఆలయ సిబ్బంది ఉన్నారు. సారంగాపూర్‌ మండలంలోని పెంబట్ల దుబ్బ రాజేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలో సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి నీటి తో శుభ్రంగా కడిగారు. డెటాల్‌తో క్యూలైన్లను శుభ్రం చేశారు. భక్తులకు ఎప్పటికప్పుడు మైక్‌ ద్వారా సూచనలు ఇస్తున్నారు. 


logo