బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Mar 20, 2020 , 03:12:00

తొలిరోజు ప్రశాంతం

తొలిరోజు ప్రశాంతం

  • ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
  • జిల్లా వ్యాప్తంగా 6,548 మంది విద్యార్థులు హాజరు.. 15 మంది గైర్హాజరు..
  • పలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌ అంజయ్య

జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 6,473 మంది విద్యార్థులకు గాను 6,548 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్‌ అంజయ్య, డీఈవో రాధాకిషన్‌ తనిఖీ చేశారు. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో సెంటర్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. 

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు-1 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలలో 6,548 మంది విద్యార్థులు హాజరయ్యా రు. రెగ్యులర్‌ విద్యార్థులు 6,460 మందికి  6,448, మంది హాజరు కాగా 12 మంది గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీలో 13 మంది విద్యార్థులకు 10మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ 99.65శాతం, సప్లిమెంటరీ 73.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల సూచన మేరకు విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల్లో విద్యార్థుల కోసం మెడికల్‌ కిట్లు, సురక్షితమైన తాగునీటిని అధికారులు అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్‌శాఖ సహకారంతో పూర్తిస్థాయి బందోబస్తు కల్పించారు. జిల్లా విద్యాధికారి డీ రాధాకిషన్‌, పరీక్షల సహాయ నిర్వహణ అధికారి బీ శ్రీనివాస్‌ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. 

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌  

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాల, తంగళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్‌ అంజయ్య గురువారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పరీక్ష ముగిసిన అనంతరం  విద్యార్థులు గుమి గూడకుండా, త్వరగా ఇంటికి వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

 విలాసాగర్‌లో అంధ విద్యార్థి..

బోయినపల్లి మండలం విలాసాగర్‌ జడ్పీ పాఠశాల లో ఎస్సెస్సీ పరీక్షకు అంధ విద్యార్థి హాజరయ్యాడు. కొదురుపాక జడ్పీ పాఠశాల విద్యార్థి నితీశ్‌, అదే పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థి శివసాయి సాయంతో పరీక్ష రాశాడు. 


logo