సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Mar 16, 2020 , 02:41:40

బుర్హాన్‌మియాపేట అభివృద్ధి బాట

బుర్హాన్‌మియాపేట అభివృద్ధి బాట

ఇంటింటా మరుగుదొడ్లు.. ఇంకుడుగుంతలు.. కంపోస్టు ఫిట్లు.. పెరటి తోటలు.. సింగిల్‌ యూజ్‌డ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రత్యేక చర్యలతో ఎలిగేడు మండలం బుర్హాన్‌మియాపేట గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. అభివృద్ధికి ఐదు సూత్రాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ప్రగతిపథంలో పయనిస్తూనే, తోటి గ్రామాలకు స్ఫూర్తి నింపుతున్నది. ముఖ్యంగా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఎవరి ఇంట్లో వారే సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడమే కాకుండా, అదే ఎరువుతో కూరగాయలు సాగు చేస్తూ ఊరినే నందనవనంలా మార్చుకొని పలువురి ప్రశంసలందుకుంటున్నది.

ఎలిగేడు(జూలపల్లి): ఎలిగేడు మండలం బుర్హాన్‌మియాపేట గ్రామం వినూత్న కార్యక్రమాలతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. స్వచ్ఛత, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పంచసూత్రాల(ఇంటింటా ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్డి, కంపోస్ట్‌ ఫిట్‌, పెరటి తోటలు, మహిళల ఆరోగ్యానికి సబల న్యాప్కిన్‌ వినియోగం)ను దిగ్విజయంగా అమలు చేస్తూ ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నది. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో పంచసూత్రాలను అమలు చేస్తే ఊరు బాగుపడుతుందనే నినాదంతో అధికారులు, గ్రామ సర్పంచ్‌ చైతన్యం కలిగించగా, ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు కదిలి, అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. పంచ సూత్రాలను విజయవంతంగా చేపట్టి శభాష్‌ అనిపించుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారానికితోడు ప్రజల సమష్టి కృషితో బుర్హాన్‌మియా పేట జిల్లాలోనే ఆదర్శ విలేజ్‌గా పేరుతెచ్చుకున్నది. 

వెల్లివిరిసిన చైతన్యం..

పంచసూత్రాల కార్యక్రమంపై అధికారులు, గ్రామ సర్పంచ్‌ ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కల్పించడంలో గ్రామస్తులు చైతన్యవంతులయ్యారు. ఒక్కొక్కరుగా ముందుకువచ్చి ఎవరి ఇంట్లో వారు అమలు చేయగా, ఇవ్వాళ గ్రామమే నందనవనంలా మారింది. గ్రామంలో ఏ ఇంట చూసినా వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంత, చెత్తా చెదారం రోడ్లపై పడేయకుండా, సేంద్రియ ఎరువుగా మార్చుకునేందుకు కంపోస్ట్‌ ఫిట్లు, స్వచ్ఛమైన కూరగాయల కోసం పెరటితోటలు కనిపిస్తుంటాయి. గ్రామంలో 365 ఇండ్లు, 1250 జనాభా ఉండగా, 355 ఇండ్ల ఆవరణలో ఇంకుడు గుంతలు, 362 ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. అలాగే 13 సామాజిక ఇంకుడు గుంతలు కట్టుకున్నారు. ఇక బుర్హాన్‌మియాపేటలో బహిరంగ మూత్ర విసర్జననూ నిషేధించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు విచ్చల విడిగా పడేయకుండా ‘ప్లాస్టిక్‌ వేస్ట్‌ కలెక్షన్‌ యూనిట్‌'ను ఏర్పాటు చేసుకొని వంద శాతం వినియోగిస్తున్నారు. మురుగు నీటి కాల్వలతో పనిలేకుండా ఎవరి ఇంట్లో వారు ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో డ్రైనేజీలన్నీ పూడ్చివేశారు. యువతులు, మహిళలు ఆరోగ్య సంరక్షణ కోసం ‘సబల’(న్యాప్కిన్‌)ను అందుబాటులో ఉంచుకుని వినియోగిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పచ్చదనం పెంపుదల కోసం ప్రతి ఇంటా పండ్ల మొక్కలు నాటి బతికించుకుంటున్నారు. అలాగే రోడ్ల వెంట నీడనిచ్చే మొక్కల ఎదుగుదల కోసం చొరవ తీసుకుంటూనే, దోమల రహిత గ్రామంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఇంట్లోనే కూరగాయలు

కూరగాయలు, ఆకు కూరలు బయట కొనే పనిలేకుండా ఎవరి ఇంట్లో వారే పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ స్వచ్ఛమైన కూరగాయలతోనే భోజనం చేస్తున్నారు. పంచసూత్రాల అమలులో భాగంగా ప్రతి ఇంటా పెరటి తోట ఏర్పాటుకుగాను సర్పంచ్‌ రాచర్ల కొండయ్య సొంత ఖర్చులతో ఉచితంగా ఆకు కూరలు, కూరగాయల విత్తనాలు అందించడంతోనే ఇది సాధ్యమైందని గ్రామస్తులు చెబుతున్నారు. 

ఎరువుల తయారీ

ఇంట్లోని వ్యర్థ పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో పడేయవద్దని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రతి ఇంటా కంపోస్ట్‌ ఫిట్‌ ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటున్నారు. ఎరువును తమ పంట పొలాలకు వినియోగించుకోవడంతోపాటు పెరటి తోటల సాగుకూ వాడుతూ స్వచ్ఛమైన కూరగాయలను పండిస్తున్నారు.

గ్రామస్తుల సహకారంతోనే

పచ్చదనం, పరిశుభ్రత, సంపూర్ణ ఆరోగ్యం దిశగా గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంతో చేపట్టిన పంచసూత్రాల కార్యక్రమాన్ని మా గ్రామంలో విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. అధికారుల సలహాలు, సూచనలు, గ్రామస్తుల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సఫలీకృతులమయ్యాం. సమష్టి కృషితోనే ఇవ్వాళ గ్రామంలో ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుండుగుంత, కంపోస్ట్‌ ఫిట్‌, పెరటి తోట ఏర్పాటైంది. 

- రాచర్ల కొండయ్యరాజా, సర్పంచ్‌, బుర్హాన్‌మియాపేటlogo