మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Mar 16, 2020 , 02:34:54

జర్బరా పూలు మెట్టపై సిరులు

జర్బరా పూలు మెట్టపై సిరులు

వ్యవసాయంలో మూస పద్ధతులకు స్వస్తి పలికి పలువురు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఉద్యానవన శాఖ సహకారం.. నూతన ఆలోచనా విధానంతో పలువురు రైతులు తక్కువ పెట్టుబడితో సాగులో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి వెల్ముల రంగారెడ్డి ముందుంటారు. మెట్ట ప్రాంతంపై జర్బరాపూలు , గడ్డి(ఆస్‌ప్రా గ్రాస్‌) చేపట్టి సిరులను ఒడిసిపట్టుకుంటున్నారు. ఎందరికో ఉపాధి కల్పించడమేగాక, స్థానిక రైతులకు స్ఫూర్తిగా లుస్తున్నారు.

  • పాలీహౌస్‌ విధానంలో పూలసాగు
  • ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో చిప్పలపల్లిలో సుమారు ఆరు ఎకరాల్లో తోట
  • తక్కువ మోతాదులో నీరు.. అధిక దిగుబడులు
  • హైదరాబాద్‌, ఢిల్లీ తదితర మహానగరాలకు ఎగుమతులు
  • ఆదర్శంగా నిలుస్తున్న విశ్రాంత ఉద్యోగి రాంరెడ్డి

ముస్తాబాద్‌:సంప్రదాయ వ్యవసాయ విధానాలు.. పంటల సాగుకు స్వస్తి పలికి పలువురు రైతులు ఆధునిక పంథావైపు అడుగులు వేస్తున్నారు. అందులో ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌ గ్రామానికి చెందిన విశాంత్ర ఉద్యోగి రంగారెడ్డి, ఆయన కొడుకు యువ న్యాయవాది వెల్ముల రమణారెడ్డి ముందుంటాడు. సహకార బ్యాంక్‌ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ పొందిన రంగారెడ్డి అనంతరం వ్యవసాయంపై దృష్టి సారించారు. ఏదైనా కొత్తగా చేయాలని భావించి కొడుకుతో చర్చించాడు. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో విరివిగా వినయోగిస్తున్న జర్బరా పూలపై వారు దృష్టిసారించారు. వెంటనే ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించగా, వారు కూడా పాలీహౌస్‌ ద్వారా పూలసాగు చేస్తే బాగుంటుందని సూచించారు. వారి సలహా మేరకు ఆరేళ్ల క్రితం చిప్పలపల్లి శివారులో తొలుత రెండెకరాలలో పాలీహౌస్‌ నిర్మించి జర్బరాపూల సాగుకు శ్రీకారం చుట్టాడు. తొలిదశలో అవాంతరాలు ఎదురైనా వెరువకుండా ముందుకుసాగాడు. సొంత అనుభవాలు, వివిధ రాష్ర్టాల్లో పౌలిహౌస్‌ పంటలపై అధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరవుతూ అక్కడి కొత్త పద్ధతులను తెలుసుకుంటూ క్రమక్రమంగా పూలసాగును విస్తరించారు. ప్రస్తుతం ఆరెకరాల్లో పది పాలీహౌస్‌లు నిర్మించి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న జర్బరా పూలను 7 రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. 

బిందు సేద్యంతో సాగు

పాలీహౌస్‌లో పెంచుతున్న మొక్కలకు ఓపెన్‌ వెల్‌ తవ్వించారు. ఆధునిక డ్రిప్‌తో నీటిని సరఫరా చేస్తున్నాడు. ఎరువులు, పురుగు మందులు పంపింగ్‌ యంత్రాలతో చేపట్టడడంతో కూలీల సంఖ్య తగ్గడమేగాక, తక్కువ సమయంలో మొక్కలకు మందులు పిచికారీ చేయగలుగుతున్నాడు. అదీ గాక నీటి వృథా లేకుండా పోతున్నది. పాలీహౌస్‌లో ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తెలిపేలా మీటర్లు అమర్చారు. వాటి ఆధారంగా పూలమొక్కల సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తూ మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుణే, హైదరాబాద్‌ నుంచి ప్రతి నెలకొకసారి ఉద్యానవన నిపుణులు సందర్శిస్తూ తగిన సలహాలు ఇస్తుండడం గమనార్హం.

పుణే, ఢిల్లీ, బెంగళూర్‌ నుంచి మొక్కల దిగుమతి

రైతు రంగారెడ్డి జెర్బరా పూల మొక్కలను పుణే, ఢిల్లీ, బెంగళూర్‌ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. ఒక్కో మొక్కను రూ.30కి కొనుగోలు చేస్తున్నాడు. ఎర్రమట్టి, ఉనుక, పేడ, సూపర్‌ ఫాస్పెట్‌, నీమ్‌కేక్‌, థైమెట్ల మిశ్రమంలో ఫీట్‌న్నర ఎత్తులో వేసిన కట్టలపై ఆ మొక్కలను జాగ్రత్తగా నాటుతారు. అదేవిధంగా నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో ఎకరం పాలీహౌస్‌లో సుమారు 24వేల మొక్కలు నాటే అవకాశమున్నది. ఒక్కో మొక్క నెలకు ఏడు నుంచి ఎనిమిది పూలనిస్తుండగా, రోజుకు 3600 నుంచి 4000 పూల దిగుబడి రానున్నది. నిర్వహణ బాగుంటే ఒక్కో మొక్క ఆరేళ్ల వరకు దిగుబడినిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన రూ.3కే ఒక్కో పువ్వును విక్రయిస్తున్నారు. ఎకరానికి పెట్టుబడులన్నీ పోను రూ.10లక్షల ఆదాయానికి పైగానే పొందుతుండడం విశేషం.  

సొంతంగా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం

పూలను వెంటనే ఎగుమతులు చేయాలంటే రంగారెడ్డి తొలుత అనేక ఇబ్బందులు పడ్డడు. దీంతో మూడేళ్ల క్రితం స్వయంగా కోల్డ్‌ స్టోరేజీని నిర్మించుకున్నాడు. పూల ఎగుమతులు ఆలస్యమైనా.. మార్కెట్‌లో పూల డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు వాటిని అందులో భద్రపరుస్తున్నాడు. డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాలకు పూలను ఎగుమతి చేస్తున్నారు. ఆయా నగరాలకే కాకుండా సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన ఈవెంట్ల నిర్వాహకులు చాలా మంది పూల కోసం రంగారెడ్డి వద్దకే వస్తున్నారు.

సబ్సిడీతో ఉపాధి

పాలీహౌస్‌ నిర్మాణాన్ని ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తున్నది. అందుకోసం భారీ మొత్తాన్ని సబ్సిడీ అందిస్తున్నది. రంగారెడ్డికి ఉద్యానవన శాఖ రూ.44 లక్షల రుణాన్ని అందించింది. అందులో 90 శాతం సబ్సిడీతో ఆరు ఎకరాల్లో పాలిహౌస్‌లను ఆయన నిర్మించుకున్నాడు. తన వాటాధనంగా రూ.12 లక్షలు కడుతున్నారు. నిత్యం ఆయన వ్యవసాయ క్షేత్రంలో 30 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. 


ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం

మంచి రకం పూలు, ఆస్‌ప్రా గ్రాస్‌ (గడ్డి) సంవత్సరంలో 364 రోజులు పూస్తుంటాయి. మూడు నాలుగు రోజులకు పూలను కోయాలి. మార్కెట్‌కు అనుకూలంగా పూలు వచ్చేలా చూసుకోవాలి. పౌలీహస్‌లో సీసీ కెమెరాలతో పరిశీలిస్తూ వ్యవసాయ, హార్టికల్చర్‌ నిపుణుల పర్యవేక్షణలో సాగు చేస్తున్నాం. ఎకరానికి ఏడాదికి రూ. 10లక్షల ఆదాయం వస్తుంది. మార్కెట్‌ అనుకూలిస్తే ఆ ఆదాయం మరింత పెరిగే అవకాశముంటుంది.

- వెల్ముల రమణారెడ్డి, పాలీహౌస్‌ రైతు 

పట్టణాల్లో భారీ డిమాండ్‌

జర్బరా పూలకు పెద్దపెద్ద పట్టణాల్లోనే డిమాండ్‌ ఉంటుంది. హైదారాబాద్‌, ఢిల్లీ, బెంగుళూర్‌, పుణేలో ఈ పూలకు డిమాండ్‌ ఉంటుంది. ఒక్క పూవ్వు కొన్ని సందర్భాల్లో రూ. 10 ఉంచి 12 వరకు ధర పలుకుతున్నది. వివాహాది శుభాకార్యాలు, సీజనల్‌ పండుగల్లో పూలకు డిమాండ్‌ పెరిగి అధిక ధరలు పలుకుతాయి. తాను ఈ ప్రాంతంలో పెట్టడంతో ప్రస్తుతం బాగానే ఉంది. కూలీల కొరత కొంత ఉంటుంది.

- వెల్ముల రంగారెడ్డి , తోట నిర్వాహకుడు

లాభాలిచ్చే పంటలపై దృష్టిపెట్టాలి

రైతులు సాగులో నూతన విధానాలు, తక్కువ నీటితో అధిక దిగుబడులు వచ్చే పంటలపై దృష్టిపెట్టాలి. ఈ ప్రాంతంలోని సన్నచిన్నకారు రైతులకు అనుకూలమైన పంటలు, తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో లాభాల సాగు చేసే పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. పాలీహౌస్‌ సాగు విధానంలో కలిగే లాభాలను వివరిస్తున్నాం. జిల్లాలో ఇతర రైతులు దీనిపై ఆలోచన చేయాలి. చిప్పలపల్లిలో సాగు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. 

- వెంకటేశం, జిల్లా ఉద్యానశాఖ అధికారిlogo