మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Mar 16, 2020 , 02:21:43

రైతు సంక్షేమ వేదిక

రైతు సంక్షేమ వేదిక

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా రాష్ట్ర సర్కారు ఎప్పటికప్పుడు విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగా తాజాగా గ్రామ, మండల, జిల్లాస్థాయి వరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి, రైతుబంధు వేదికల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.350 కోట్లు ప్రతిపాదించగా, జిల్లా వ్యాప్తంగా 57 క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక ఒక్కో భవన నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించనుండగా, జిల్లాకు రూ.6.84కోట్ల నిధులు రానున్నాయి. ఇప్పటికే వేదిక నిర్మాణానికి 40 చోట్ల స్థల సేకరణ పూర్తికాగా, మరో 17 వేదికల కోసం అనువైన స్థలాన్ని యంత్రాంగం పరిశీలిస్తున్నది. భవనాలు పూర్తియితే వ్యవసాయ విస్తరణాధికారి, మినీ భూసార పరీక్షా కేంద్రం, రైతు బంధు వేదికకు వేర్వేరు గదులతో పాటు సమావేశ హాలు, విత్తనాలు, ఎరువుల నిల్వకోసం గోదాము అందుబాటులో వచ్చే అవకాశముండడంతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

  • జిల్లా వ్యాప్తంగా 57 క్లస్టర్లు
  • ఒక్కో భవనానికి రూ. 12లక్షల చొప్పున జిల్లాకు రూ. 6.84కోట్లు
  • ఇప్పటికే 40 చోట్ల స్థలాల ఎంపిక పూర్తి
  • అన్నదాతకు బహుళప్రయోజనాలు
  • అందుబాటులోకి భూసార పరీక్షా కేంద్రాలు..
  • సమావేశాలకు వీలుగా మందిరాలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ విప్లవాత్మక నిర్ణయాలతో వ్యవసాయం కొత్త పుంతలు
  • రైతన్నల్లో హర్షాతిరేకాలు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారు. రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సన్నద్ధమయ్యారు. భూసార పరీక్షలు మొదలు, పంటల సాగుపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా గ్రామ, మండల స్థాయిలో ఐదు ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి వేదికను నిర్మించాలని సంకల్పించింది. అందులో భాగంగా ఒక్కో క్లస్టర్‌ను 12లక్షలతో నిర్మించేందుకు బడ్జెట్‌లో 350 కోట్లు కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా 57 క్లస్టర్లలో వేదికల ఏర్పాటుకు 6.84కోట్లు మంజూరు కానుండగా, ఇప్పటికే 40చోట్ల స్థలాలు ఎంపిక చేయగా, మరో 17 చోట్ల స్థలాలను ఎంపిక చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సర్కారు తాజా నిర్ణయంపై అన్నదాతల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

సాగునీరు లేక వట్టిపోయిన భూములు

మెట్ట ప్రాంతంలో ఎక్కడ చూసినా సాగుకు నోచుకొని బీడు భూములే కనిపించేవి. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు, కుంటలు ఎండి పోయి, నోళ్లు తెరిచిన బోర్లతో రైతాంగం విలవిలా డింది. ఎవుసం సాగక రైతులు వలస బాటపట్టా రు. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నింపడంతో మెట్ట ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. ఏ పల్లె చూసినా పచ్చని పొలాలతో కళకళలాడుతూ అన్నదాతల మోములో చిరునవ్వులను నింపుతున్నది. సాగునీటితో పాటు  రైతుబంధు పథకం కింద ఎకరాన 10వేలు అందించింది. రైతులు తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేసింది. ఇలా వ్యవసాయం దండగ అన్న సమైక్య పాలకుల కళ్లు తెరిపించేలా పండగలా మార్చిన ప్రభుత్వం ఆ దిశగా మరింత ముందుకు సాగుతున్నది. రైతును రాజు చేయాలన్న సంకల్పంతో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నది. అందులో భాగంగా తాజాగా ఐదు ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

క్లస్టర్‌కో వేదిక .. జిల్లాకు 6.84కోట్లు 

వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేలా ఐదు ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. అందులో ఏవో స్థాయి అధికారి కార్యాలయం ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. దాంతో రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసింది. రైతులతో సమావేశాల నిర్వహణకు భవనాలు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతీ క్లస్టర్‌కో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసం జిల్లాలో 57 క్లస్టర్లకు గాను 57 భవనాలు నిర్మించేందుకు జిల్లా వ్యవసాయశాఖ గతంలోనే ప్రతిపాదనలు పంపించింది. ఇటీవల ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్ర వ్యాప్తం గా వేదికల నిర్మాణాలకు 350 కోట్లు కేటాయించగా, జిల్లాలో 57వేదికలకు 6.84కోట్లు మం జూరు కానున్నాయి. ఒక్కో వేదికకు 12లక్షలు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనాలు రూ పొందించారు. వేదికల కోసం ఇప్పటికే 40క్లస్టర్ల లో స్థలాలను గుర్తించగా, 17చోట్ల స్థలాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

భూసార పరీక్షలు మొదలు..

పంటల సాగు చేయాలంటే ముందుగా భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో భూసార పరీక్షల కేంద్రం ఉమ్మడి జిల్లా కరీంనగర్‌లో మాత్రమే ఉండేది. నలభై కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే రైతులకు అసౌకర్యంగా ఉండడంతో, ఎవరూ ఆ వైపున కన్నెత్తి చూడకపోయేవారు. తమకు నచ్చిన పంటలు సాగు చేసుకునే వారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఐదు ఎకరాలకో క్లస్టర్‌ ఏర్పాటు చేసి, ఏవో స్థాయి అధికారిని నియమించడంతో ఇప్పుడు రైతులకు అన్నివిధాలా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం, సాగు వివరాలను సేకరించింది. దాంతో పాటు భూసార పరీక్షలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి క్లస్టర్‌లో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రైతు సమన్వయ సమితులు సైతం బాగా ఉపయోగపడుతున్నాయి. రైతు వేదికలు అన్నదాతలకు సంక్షేమ నిలయాలు కానున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతులు పంట సాగు నుంచి మొదలుకొని పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించునే అవకాశం వేదికలు కల్పించనున్నాయి. విత్తనాలు, ఎరువులు కూడా ఈ వేదికల్లో నిలువ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నివిధాలుగా ఉపయోగపడేలా ఉండే వేదికలు తమకు అందుబాటులోకి సర్కారు తెస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు సమన్వయ సమితులు కూడా బలోపేతం కానున్నాయి. 

అన్నివిధాలా అండగా సర్కారు

తెలంగాణ ప్రభుత్వం మాకు అన్ని విధాలా అండగా ఉంటున్నది. రైతుబంధు పథకం, రైతుబీమా పథకాలే కాదు రుణమాఫీ చేసి మాకు భరోసానిచ్చింది. మా భూమిలో ఏ పంటలు సాగు చేయాలో తెలియక పత్తి, వరి సాగు జేసినం. ఇప్పుడు అధికారులు మా దగ్గరికి వచ్చి భూసార పరీక్షలు చేసి ఏ పంట వేస్తే ఎంత దిగుబడి వస్తుందో చెబుతున్నరు. క్లస్టర్‌కో వేదిక నిర్మిస్తే రైతులందరికీ మంచి సౌకర్యం ఉంటుంది. 

- గుర్రాల నిర్మల, మహిళా రైతు (ఇల్లంతకుంట)

సమితులు బలోపేతం

క్లస్టర్లకో వేదిక నిర్మించడం వల్ల సమితులు బలోపేతమవుతాయి. రైతులకు అన్నివిధాలుగా సేవలందుతాయి. విత్తనాలు, ఎరువుల నుంచి మొదలుకొని పంట దిగుబడి వరకు, మార్కెటింగ్‌ చేసుకునేందుకు ధర నిర్ణయించుకోవచ్చు. సమావేశాలు జరుపుకోవచ్చు. రైతును ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం జలాలతో మెట్ట భూమిలో పుష్కలమైన నీరు వచ్చింది. భూగర్భ జలాలు పెరిగాయి. ఇక పంట సాగుతో జిల్లా సస్యశ్యామలం కాబోతున్నందుకు అందరిలో ఆనందం వెల్లి విరుస్తున్నది. 

- గడ్డం నర్సయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌