శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Mar 10, 2020 , 01:45:13

మురుగుకాలువలను విస్తరిస్తాం

మురుగుకాలువలను విస్తరిస్తాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: నగరంలో మురుగు కాలువలను విస్తరిస్తామని, నగర జనాభాకు అనుగుణంగా మారుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో కురిసిన అకాల వర్షం మూలంగా దెబ్బతిన్న లోతట్టు ప్రాంతాలైన అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌లో సోమవారం సాయంత్రం మంత్రి పర్యటించారు.  ఆయా ప్రాంతాల్లో మురుగునీరు పూర్తిగా ఇండ్లల్లోకి చేరడం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. 29వ డివిజన్‌లో పలు ప్రాంతాల్లో ఇండ్లల్లోకి బురద చేరడం... రోడ్లపైనా బురద నిలిచి తీవ్ర దుర్వాసన వస్తుండగా, వెంటనే ఈ బురదను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రెండు కాలువలను పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా నగర జనాభాకు అనుగుణంగా ఆధునీకరిస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కాలువలను విస్తరిస్తామని తెలిపారు. నగరంలో ఉన్న రెండు ప్రధాన కాలువలు కూడ ఎప్పుడో నిర్మాణం చేశారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా వాటి మార్పులు చేయాల్సి ఉందన్నారు. రేకుర్తి నుంచి మానేరు వాగు వరకు వర్షపు నీరు సులువుగా వెళ్లేలా సమగ్ర ప్రణాళికతో కాలువను నిర్మించేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే జరిపించి ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తామని వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికే చర్యలు ప్రారంభించామన్నారు. పలు ప్రాంతాల్లో ఈ కాలువలు విస్తరించకపోవడం వల్లే వర్షాలు పడినప్పుడల్లా ఇవే సమస్యలు వస్తున్నాయని గుర్తుచేశారు. వీటి విషయంలో శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మంగళవారం కలెక్టర్‌తో కలిసి మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఒక్కసారిగా అకాల వర్షం కురువడం వల్ల జ్యోతినగర్‌, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో ఇండ్లల్లోకి మురికినీరు వచ్చి చేరిందన్నారు. ఈ విషయంలో మేయర్‌ సునీల్‌రావు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల కొంత మేర ప్రజలకు ఇబ్బందులు తగ్గాయన్నారు. మరో రెండు రోజుల్లో పేరుకుపోయిన బురద తొలగించడంతోపాటు ఇతర అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపడుతామని స్పష్టం చేశారు. మంత్రి వెంట మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, కార్పొరేటర్‌ నాంపెల్లి శ్రీనివాస్‌, నాయకులు మిర్యాల్‌కర్‌ నరేందర్‌ ఉన్నారు.


logo