సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Mar 10, 2020 , 01:41:00

అన్నదాతలు అధైర్యపడవద్దు

అన్నదాతలు అధైర్యపడవద్దు

చొప్పదండి, నమస్తేతెలంగాణ: అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడద్దని, అండగా ఉంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ భరోసా ఇచ్చారు. మండలంలోని రుక్మాపూర్‌లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మక్క చేలను సోమవారం ఆయన పరిశీలించారు. చేతికొచ్చిన పంటలు అకాల వర్షానికి దెబ్బతినడం బాధాకరమని, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. వర్షానికి నేలకొరిగిన పంటల వివరాలు క్షేత్రస్థాయిలో సేకరించి, నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని వ్యవసాయాధికారి వంశీకృష్ణకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నారని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సింగిల్‌విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, సర్పంచ్‌ వెల్మ నాగిరెడ్డి, నాయకులు కర్రె శ్రీనివాస్‌, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, గాండ్ల లక్ష్మణ్‌, మల్లయ్య ఉన్నారు.

పంట నష్టంపై సర్వే చేయాలి

గంగాధర: అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ భరోసా ఇచ్చారు. మండలంలోని వెంకంపల్లిలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి నేలకొరిగిన మక్క చేలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టంపై సర్వే చేసి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఉప్పరమల్యాల పరిధిలోని తుమ్మెదల గుట్టపై వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర నిర్వహించగా ఎమ్మెల్యే రవిశంకర్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. గంగాధరలో వీరభద్రస్వామిని దర్శించుకున్నారు.  ఆలయం వద్ద నిర్వహిస్తున్న గోశాలను పరిశీలించారు. గోశాలలో ఉన్న ఆవులకు ఎమ్మెల్యే అరటి పండ్లు తినిపించారు. ఉప్పరమల్యాల, గంగాధర ఆలయాల్లో ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి ప్రసాదాలు అందజేశారు. జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, కురిక్యాల, గంగాధర సింగిల్‌ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్‌రావు, దూలం బాలగౌడ్‌, సర్పంచులు ముక్కెర మల్లేశం, బొల్లాడి మంజుల, వేముల దామోదర్‌, రాసూరి మల్లేశం, ఎంపీటీసీ ముద్దం జమున, ఉపసర్పంచులు సుద్దాల రాజశేఖర్‌రెడ్డి, నిమ్మనవేని ప్రభాకర్‌, నాయకులు రేండ్ల శ్రీనివాస్‌, ముద్దం నగేశ్‌, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, ఇప్పలపెల్లి మధుసూదన్‌, దోమకొండ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

మక్క రైతులకు  ప్రభుత్వ అండ

రామడుగు: అకాల వర్షానికి మక్క చేలు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ భరోసా ఇచ్చారు. మోతె పరిధిలోని గౌండ్లపల్లె గ్రామానికి చెందిన బత్తిని శంకరయ్య అనే రైతు పొలంలో నేలకొరిగిన మక్క చేనును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మక్క రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రకృతి కన్నెర్రజేసి పంటలకు నష్టం కలిగిస్తే ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుందన్నారు. నష్టపోయిన పంటలను సంబంధిత అధికారులతో సర్వే చేయించి, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం నేడు వాటర్‌గ్రిడ్‌గా తయారైందన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మండల నాయకులు కలిగేటి లక్ష్మణ్‌, వూకంటి శ్రీనివాస్‌రెడ్డి, బత్తిని మల్లేశం, బండారి వెంకటేశం, శ్రీనివాస్‌, శంకరయ్య, సృజన్‌ కుమార్‌, కనుకయ్య, బత్తిని తిరుపతి, తదితరులున్నారు.