సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - Mar 10, 2020 , 01:39:54

ఎరువుల తయారీ.. పంచాయతీకి రాబడి

ఎరువుల తయారీ.. పంచాయతీకి రాబడి

హుజూరాబాద్‌, నమస్తే తెలంగాణ:గ్రామాల్లో ఇంటింటా సేకరించే చెత్తాచెదారం ఇక నుంచి గ్రామ పంచాయతీకి రాబడి తెచ్చిపెట్టనుంది. అలా సేకరించిన చెత్తాచెదారంతో సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, పంచాయతీతోపాటు రైతులకు ప్రయోజనం కలుగనున్నది. అలాగే గ్రామాల్లో చెత్త సమస్య పరిష్కారమై పారిశుధ్యం మెరుగుపడనున్నది.పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి డంపింగ్‌ యార్డు మంజూరు చేయగా, వాటిలోనే ఓ పక్క వర్మీ కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను ఇందుకు వెచ్చిస్తున్నారు. షెడ్లలో తయారైన సేంద్రియ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామ పంచాయతీపై ఎరువుల పెట్టుబడి భారం తొలగనున్నది. మిగిలిన ఎరువులను స్థానిక రైతులకు విక్రయించనుండగా, అదనపు ఆదాయం లభించనున్నది. తద్వారా సాగులో సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరిగి రైతులకు నాణ్యమైన దిగుబడులు అందనున్నాయి.

మెరుగు పడనున్న పారిశుధ్యం

కంపోస్ట్‌ యూనిట్‌ నిర్మాణం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పడనున్నది. చెత్తాచెదారం సేకరణపై గ్రామాల్లో అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నారు. తడి-పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.

174 షెడ్ల నిర్మాణాలకు అనుమతులు

ప్రభుత్వం కంపోస్ట్‌ యూనిట్‌కు రూ.2.50లక్షలు ఉపాధి నిధులు వినియోగించుకునే అవకాశం ఇచ్చింది. ఈ లెక్కన డివిజన్‌లో 109 గ్రామ పంచాయతీల్లో షెడ్ల నిర్మాణానికి రూ. 2కోట్ల 72లక్షల 50వేలు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. ఒకవేళ కంపోస్ట్‌ యూనిట్‌ షెడ్డు పెద్దగా నిర్మించుకునే గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి మరో రూ.లక్ష గ్రామ పంచాయతీ నిధులు వాడుకోవచ్చు. దీనికికూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో 174షెడ్ల నిర్మాణాలకు పాలన పరమైన అనుమతులు రాగా, 100 షెడ్లు నిర్మాణంలో ఉన్నాయి. 


logo