శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Mar 07, 2020 , 01:26:45

పరిశీలిస్తూ.. ఆదేశిస్తూ..

పరిశీలిస్తూ.. ఆదేశిస్తూ..

శంకరపట్నం: మండలంలోని గద్దపాక గ్రామంలో కలెక్టర్‌ కే శశాంక పర్యటన రెండో రోజు శుక్రవారం ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా కొనసాగింది. పల్లె నిద్రలో భాగంగా గురువారం రాత్రి 9 గంటలకు గ్రామానికి చేరుకున్న కలెక్టర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో కలిసి నిద్రించారు. ఉదయం 6.45  గంటలకు గ్రామంలో ప్రారంభమైన ఆయన పర్యటన మధ్యాహ్నం 11.30 గంటల దాకా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో కలియదిరిగారు. అలుపూ సొలుపూ లేకుండా ప్రజలను పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడే అధికారులకు గడువుతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు విరామం లేకుండా పర్యటించి గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నారు. హెల్త్‌ సబ్‌ సెంటర్‌, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, శ్మశాన వాటిక, వన నర్సరీ, తాగునీటి బావి, డంపింగ్‌ యార్డ్‌, వరి పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామంలో మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ రావడం లేదని, ఆసరా పింఛన్లు అందడం లేదని, రికార్డుల్లో భూ వివరాలు రావడం లేదని, డ్రైనేజీలు నిర్మించాలనీ తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాను ఈ గ్రామంలో మొదటిసారిగా పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామం చిరకాలం గుర్తుండేలా అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో బీం ఆర్మీ బాధ్యుడు వాసాల శ్రీనివాస్‌ ఏర్పాటు చేసిన మహనీయుల చిత్రపటాల వద్ద పూలు చల్లి కలెక్టర్‌ నివాళులర్పించారు.

అభివృద్ధి అందరి బాధ్యత

గ్రామ పర్యటన అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ శశాంక మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడానికే తాను పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులపై కూడా ఉందని మరువొద్దన్నారు. ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందేలా సత్వర చర్యలు చేపట్టాలని ఆ శాఖ ఈఈ ఉప్పలయ్యను ఆదేశించారు. కామన్‌ సోక్‌ పిట్‌, కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్‌బీఎం టీంకు సూచించారు. భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే  కారణం వివరించాలని రెవెన్యూ అధికారులకు చెప్పారు. గ్రామంలోని కల్వల ప్రాజెక్టు శివారు, పాత డంపింగ్‌ యార్డు వద్ద భూ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపాలని ఆదేశించారు. వన నర్సరీలో స్టాక్‌ వివరాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ తాగునీటి బావి నుంచి కాకుండా ట్యాంకర్ల ద్వారా నీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. శ్మశాన వాటికకు వెళ్లే దారిలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరి చేయాల్సిన బాధ్యత ఎన్‌పీడీసీఎల్‌ అధికారులది కాదా అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో పరిష్కరించాలని ఏఈ కుమారస్వామిని ఆదేశించారు. కల్వల ప్రాజెక్టు మత్తడి బొద్దు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే పాఠశాలలను తరలించక తప్పదని హెచ్చరించారు. ఉన్నత పాఠశాలలో ఏడుగురు టీచర్లకు 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శశాంకతో పాటు ఉన్నతాధికారులను సర్పంచ్‌ గోపు విజయ్‌కుమార్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌ స్పందనపై పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకటమాధవరావు, ఆర్డీఓ బెన్‌షాలోం, డీపీఓ రఘువరన్‌, డీఆర్డీఓ వెంకటేశ్వర్‌రావు, ఎంపీపీ విజయ, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ గోపు విజయ్‌కుమార్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రమేశ్‌, ఎంపీఓ సురేందర్‌, ఎస్‌బీఎం కోఆర్డినేటర్‌ కిషన్‌స్వామి, పలు శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.