శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - Mar 07, 2020 , 01:24:52

ఇంకుడు గుంతలు తవ్వుదాం

ఇంకుడు గుంతలు తవ్వుదాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకూ అడుగంటి పోతున్న భూగర్భ జలాలను పైకి తెప్పించేందుకు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ చర్యలు మొదలుపెట్టింది. గత మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో భూగర్భ జలాల పెంపుకోసం ఇంకుడు గుంతల నిర్మాణానికి మున్సిపల్‌ శాఖ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరాలు, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ఇంకుడు గుంతల తవ్వించేందుకు చర్యలు మొదలు పెట్టింది. నేటి నుంచి 31 వరకు ఇంకుడు గుంతల నిర్మాణాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. దీనికి సంబంధించి మున్సిపల్‌ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. వీటిని ఏయే ప్రాంతాల్లో నిర్మాణం చేయవచ్చునన్న విషయంలో అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఇంకుడు గుంతలతో సమృద్ధిగా నీరు.. 

నగరాలు, పట్టణాల్లోని ఇళ్లలో వెయ్యి ఫీట్ల మేరకు బోర్లు వేసినా నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడా వర్షపు నీరు భూమిలోకి వెళ్లకపోవడంతో బోర్లలో నీళ్లు వేసవి వచ్చేసరికి అడుగంటి పోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. వర్షం వచ్చిన సమయంలో పది శాతం నేలను తడుపుతుండగా మరో పది శాతం మాత్రమే భూగర్భజలంగా మారుతున్నది. మిగిలిన 80 శాతం వృథాగా పోతున్నది. పట్టణాల్లో పడుతున్న వర్షం ఎక్కువగా ఉపయోగం లేకుండాపోతున్నది. ఇంటి పైకప్పుల పైనా ఆవరణ, రోడ్లు, పార్కులు వంటి తదితర ప్రాంతాల్లో పడుతున్న వర్షం నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో వృథాగా వెళ్లిపోతున్నాయి. అయితే ఇండ్లలో ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల ఇంటి పైకప్పు 50 చదరపు మీటర్లు ఉందంటే కనీసం 25 వేల లీటర్ల నీటిని నిల్వ చేసినట్లేనని భూగర్భ జలశాఖ అధికారులు సూచిస్తున్నారు. తద్వారా బోరుబావిలోంచి సంవత్సరం పొడవునా సమృద్ధిగా నీరు వస్తుందని స్పష్టంచేస్తున్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని వారు చెబుతున్నారు. 

గుంతలు తవ్వడం ఇలా..

శాస్త్రీయంగా ఇంకుడు గుంతలు తవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పు విస్తీర్ణాన్ని బట్టి, ఇంటి అవరణలో ఎక్కడ వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తుందో ఆ ప్రదేశంలో గుంత నిర్మాణం చేపడితే బాగుంటుంది. ఉదాహరణకు వంద చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంటే 6 ఘనపు మీటర్ల విస్తీర్ణంలో గుంత ఉండాలి. లోతు రెండు మీటర్లు, పొడవు రెండు మీటర్లు, 1.5 మీటర్ల వెడల్పు తప్పనిసరిగా ఉండాలి. అందులో 50 శాతం 40 మిల్లీ మీటర్ల గులకరాళ్లు, 25 శాతం 20 మిల్లీ మీటర్ల గులకరాళ్లు, 15 శాతం ఇసుకతో నింపాలి.  గుంతలో వర్షపునీరు పడే ప్రాంతంలో కొబ్బరిపీచు ఉంచడం ద్వారా నీరు తుళ్లకుండా ఉంటుంది. చుట్టూ సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేసుకోవాలి. తద్వారా గుంత పూడిపోకుండా ఉంటుంది.


logo