శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Mar 07, 2020 , 01:21:54

ప్రగతి మెరిసె.. పట్నం మురిసె..

ప్రగతి మెరిసె.. పట్నం మురిసె..

కార్పొరేషన్‌, చొప్పదండి, నమస్తే   తెలంగాణ/ హుజురాబాద్‌టౌన్‌/జమ్మికుంట/కరీంనగర్‌ రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ పారిశుధ్య, విద్యుత్‌, ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు పనులు ఉధృతంగా సాగాయి. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన స్తంభా లు, రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లూజ్‌ వైర్ల తొలగింపు పనులు వేగంగా సాగాయి. ప్రతి వీధుల్లోనూ మురికికాల్వలను పరిశుభ్రం చేయటంతో పాటుగా, ఖాళీ స్థలాలను క్లీనింగ్‌ చేశారు. ప్రజల్లోనూ పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించారు. వాతావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ విషయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అత్యవసరమైన ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్ల పనులు చేపట్టారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 23,132 మంది నిరాక్షరాస్యులను గుర్తించారు. మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌తో పాటు కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, మున్సిపాలిటీల చైర్మన్లు, చైర్‌పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్‌ శశాంక, అదన పు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిశీలిస్తూ పనులపై సూచనలిచ్చారు. 


 హుజురాబాద్‌లో ..

హుజూరాబాద్‌ మున్సిపాలిటీకి ఈ కార్యక్రమం అమలు కోసం రూ.43.28 లక్షలు మంజూరు చేశారు. పట్టణంలో మెరుగైన విద్యుతు సరఫరా, మరమ్మతుల కోసం రూ.25 లక్షల నిధులు ట్రాన్స్‌కో కేటాయించింది. వీటితో పట్టణంలో అవసరమున్న చోట 70 కొత్త స్తంభాలు వేశారు. పాత టెలిఫోన్‌ ఎక్ఛేంజ్‌ ఏరియాలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉండగా వాటిని మరోచోట బిగించారు. విద్యుత్‌ లైట్ల కోసం 5 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేశారు. 703 లైట్లు, కొత్త లైన్లు వేయాలని గుర్తించారు. పాత ఇనుప, సిమెంట్‌ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి వేశారు. 535 చోట్ల ఖాళీ స్థలాలను(ప్రభుత్వ, ప్రైవేట్‌) గుర్తించగా వాటిలో 200 చోట్ల పేరుకు పోయిన చెత్తను తొలగించారు. 30 చోట్ల పాత గేట్‌వాల్స్‌ రిపేర్‌ చేశారు. కొత్తవి మరో 48 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 50 శిథిలమైన ఇండ్లను గుర్తించి వాటిని కూలగొట్టారు. ఆరు పాడుబడిన బావులను పూడ్చివేశారు. రెండు వేలకు పైగా మొక్కలు వాడలు, సెంట్రల్‌ డివైడర్లలో నాటి, ట్రీ గార్డులను అమర్చారు. మరో 16 వేల 500 మొక్కలు నాటేందుకు వీలుందని స్థలాలను గుర్తించారు. విలీన గ్రామాల్లో 3200 కొత్తగా నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. 63 ప్రాంతాల్లో బురదగుంటలను గుర్తించి వాటిలో మట్టి నింపారు. రోడ్లపై చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రం చేసి రంగులవల్లులు వేసి ప్రజలకు అవగాహన కలిగించారు. 


 చొప్పదండిలో..

చొప్పదండి మున్సిపాలిటీకి ఈ కార్యక్రమం కింద రూ.17.31 లక్షలు కేటాయించగా,

ముఖ్యంగా పారిశుధ్య పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. శిథిలావస్థలో, ప్రమాదకరంగా ఉన్న 100 విద్యుత్‌ పోల్స్‌ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. గుమ్లాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ నుండి మర్లవాడ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మట్టిని, ముళ్లపొదలను తొలగించారు. చెత్తతో నిండిపోయిన 26 ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని క్లీన్‌ చేశారు. వాటి యజమానులకు నోటీసులు అందించారు. శిథిలావస్థలో ఉన్న 24 ఇళ్లను పూర్తిగా కూల్చివేశారు. వివిధ వాడల్లో 524 మొక్కలు నాటారు. తడి, పొడి చెత్తను సేకరించేందుకు వీలుగా ప్రతి ఇంటికి రెండు బుట్టల చొప్పున ఐదు వేలు పంపిణీ చేశారు. గుమ్లాపూర్‌ రోడ్డులో వైకుంఠధామం, రెండు పబ్లిక్‌ మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని ప్రజల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారు.


 జమ్మికుంటలో. .  

జమ్మికుంట మున్సిపాలిటీకి ఈ కార్యక్రమం కింద రూ.40.95 లక్షలు కేటాయించారు. ఈ పట్టణంలో ముఖ్యంగా ఏళ్ల తరబడిగా ఉన్న విద్యుత్‌ పోల్స్‌ సమస్యలను పరిష్కరించారు. కొత్తగా 200 వీధిదీపాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో 1500 మొక్కలు నాటారు. రెండు వేలకు పైగా మొక్కలు పంపిణీ చేసి, నాటించారు. శిథిలావస్థకు చేరిన 13 భవనాలను కూల్చివేశారు. 9 నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేశారు. 154 ఖాళీ స్థలాలను గుర్తించి శుభ్రం చేశారు. ఆరు ప్రాంతాల్లో వీధి వ్యాపారులకు స్థలాల కేటాయించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే 9 వేల తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. 


  కరీంనగర్‌లో ..

కరీంనగర్‌ నగరపాలక సంస్థకు పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం రూ.2.44 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాగా, నగర పరిధిలోని 60 డివిజన్లలో అధికారులు, ప్రజాప్రతినిధులు 3346 ఖాళీ స్థలాలను గుర్తించి వాటిల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇందులో మరోసారి చెత్తపేరుకుపోకుండా చూసుకోవాలని 1256 మంది యజమానులకు నోటీసులు అందించారు. పారిశుధ్య పనుల నిర్వహణ కోసం 50కి పైగా ప్రైవేటు సంస్థలకు చెందిన ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లను వినియోగించారు. సుభాష్‌నగర్‌ ప్రాంతంలోని ఖాళీ స్థలాల్లో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్తను తొలగించారు. నగర శివారులోని 10 డివిజన్లలో 614 కొత్త వీధిదీపాలు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం ఉన్న ట్యూబ్‌లైట్‌ స్థానాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1245 కొత్త విద్యుత్‌ పోల్స్‌ వేసేందుకు నిర్ణయం తీసుకుని, పనులు ప్రారంభించారు. కొత్తగా 286 వీధి దీపాలు, 114 మినీ హైమాస్ట్‌, వివిధ చౌరస్తాలో 134 లైట్లను ఏర్పాటు చేశారు. జ్యోతినగర్‌, ముకరంపురలో డ్రైనేజీ సమస్యలకు సంబంధించి స్థానికులతో మాట్లాడి డ్రైనేజీని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. శివారులోని 10 డివిజన్లకు ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు అందించే ఏర్పాటు మొదలుపెట్టారు. నగరంలో మొత్తం 3457 మొక్కలు నాటారు. ప్రతి డివిజన్‌లోని వార్డు కమిటీలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై ప్రతిపాదనలను వివరించారు.