శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Mar 06, 2020 , 01:47:57

ఫికర్‌ మత్‌ ‘కరోనా’

ఫికర్‌ మత్‌ ‘కరోనా’

ఐసోలేషన్‌ వార్డులు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మూడు రోజుల నుంచి అన్ని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాలతోపాటు ఏరియా దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పది పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఫిజీషియన్‌, పల్మనాలజిస్టు, అనస్థిషియా, హెడ్‌ నర్స్‌, సిబ్బందిని నియమించారు. వార్డు ఇన్‌చార్జి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, ఆర్‌ఎంవో శౌరయ్య, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సులోచన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా అనుమానితులుంటే వెంటనే బ్లడ్‌ శాంపిల్స్‌ను హైదరాబాద్‌ పంపించనున్నారు. మాస్క్‌లు, మందులు అందుబాటులో ఉంచారు. హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలోనూ ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. 5 పడకలతో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాడె రవిప్రవీణ్‌రెడ్డి చెప్పారు.  


 ఆర్టీసీ బస్టేషన్లలో ముందస్తు చర్యలు..

ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌ ఆదేశాలతో కరీంనగర్‌ రీజియన్‌లోని అన్ని డిపోల మేనేజర్లు బుధవారం నుంచే శుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. కరీంనగర్‌, గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, హుజూరాబాద్‌ బస్టేషన్లలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బస్టేషన్‌తోపాటు ప్రయాణికులు వేచి ఉండే (కుర్చీలను), ఆ పరిసర ప్రాంతాలను, ప్లాట్‌ ఫారాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు బస్సులను లోపలి సీట్లను, పైన పట్లుకునే హ్యాండిల్‌ సెట్లను, పైపులను ప్రత్యేక జెల్‌తో శుభ్రం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి డిపోలకు బస్సులు రాగానే వెంటనే శుభ్రం చేస్తున్నారు. బస్సులు నిలిపే చోటు, ప్రయాణికులు బస్సెక్కే చోట్లలో మందులను స్ప్రే చేస్తున్నారు. ఇటు మూత్రశాలలు, మరుగు దొడ్లను కూడా క్లీన్‌గా ఉంచుతూ, దుర్వాసన వెదజల్లకుండా స్ప్రే చేస్తున్నారు. గురువారం ఏ బస్టాండ్‌లో చూసినా చాలా మంది ప్రయాణికులు బస్టేషన్‌లో మాస్కులు ధరించి కనిపించగా, కొందరు ఖర్చీఫ్‌లు కడుతున్నారు. పీఏ ప్రసన్నకుమార్‌, పీవో దుర్గయ్య, ఏవోలావణ్యలతోపాటు పలువురు సిబ్బందితో కలిసి ఆర్‌ఎం బస్టేషన్‌లో తిరుగుతూ, వైరస్‌ నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాలలో డిపో మేనేజర్‌ వేముల జగదీశ్వర్‌, మిగతా డిపోల డీఎంలు కూడా డిపోలు పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తున్నారు. 


స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు..

ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీల్లో పిల్లలకు సూచనలు చేశారు. శుభ్రత పాటించాలని, హ్యాండ్‌ వాష్‌ చేసుకోవాలని, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. పలుచోట్ల ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు అవగాహన ర్యాలీలు కూడా తీశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. కరీంనగర్‌లోని నందిని స్కూల్‌లో వాల్మీకి, నందిని పాఠశాలల కరస్పాండెట్‌, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.


కోర్టుల ఆవరణలో జాగ్రత్తలు..

కోర్టుల ఆవరణలో వైరస్‌ నిరోధంపై తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని కోర్టులలో ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచి కరీంనగర్‌ జిల్లా కోర్టు ఆవరణలో ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక డాక్టర్‌ అందుబాటులో ఉండనున్నారు. హోమియో మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గురువారం కరీంనగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి గురువారం కరోనాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైరస్‌పై అవగాహన పెంచుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే దానిని అరికట్టగలుగుతామని తెలిపారు. మాస్కులు ధరించాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని, ఇతరులతో కరచాలనం చేయకూడదని చెప్పారు. ఈ సమావేశంలో వైద్యులు పాల్గొని, వైరస్‌ లక్షణాలను వివరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 


 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇందు కోసం సహాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక వార్డును కేటాయించినట్లు సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖాన సూపరిం టెండెంట్‌ మురళీధర్‌రావు, నోడల్‌ అధికారి డాక్టర్‌ సురసుర రాధాకృష్ణ తెలిపారు. కాగా సిరిసిల్లలో మురళీధర్‌ బృందం ఏర్పాట్లను పరిశీలించింది. 


logo