గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Mar 01, 2020 , 02:11:09

సాహారం ఏకగ్రీవం

సాహారం ఏకగ్రీవం

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎమ్మెస్‌)ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు శనివారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తెచ్చిన సీల్డ్‌ కవర్లలో పేర్లను వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8.30 గంటలకు జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కొత్తగా ఎన్నికైన 15 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. మంత్రులు గంగుల, కొప్పుల కూడా వీరితో కలిసి వచ్చారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అవసరమైన కోరం ఉన్నట్లు ఎన్నికల అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి నిర్ధారించుకున్నారు. అనంతరం మంత్రుల సమక్షంలో చైర్మన్‌ పదవికి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సహకార సంఘం అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు, వైస్‌ చైర్మన్‌గా కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట సహకార సంఘం అధ్యక్షుడు పింగళి రమేశ్‌ నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికైన రవీందర్‌రావు, రమేశ్‌తోపాటు డైరెక్టర్లు జలగం కిషన్‌రావు, సింగిరెడ్డి స్వామిరెడ్డి, కృష్ణప్రసాద్‌, శ్రీపతి రవీందర్‌గౌడ్‌, వీ నరేశ్‌రెడ్డి, వుచ్చిడి మోహన్‌రెడ్డి, గుజ్జుల రాజిరెడ్డి, డీ మోహన్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్‌, భూపతి సురేందర్‌, వీరబత్తిని కమలాకర్‌, మిట్టపల్లి రమేశ్‌ రెడ్డికి ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాలు అందించారు. 


డీసీఎమ్మెస్‌లో మొత్తం 8 మంది డైరెక్టర్లు ఉండగా ఉదయం 8.30 గంటలకు ఆరుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికల అధికారి సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ కోరం ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఇక్కడ కూడా మంత్రుల సమక్షంలో అలాగే చైర్మన్‌ పదవికి జగిత్యాల జిల్లా ధర్మపురి సహకార సంఘం అధ్యక్షుడు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కొత్తపల్లి కో ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ స్టోర్స్‌ అధ్యక్షుడు మహ్మద్‌ ఫక్రుద్దీన్‌ నామినేషన్‌ సమర్పించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీకాంత్‌రెడ్డి, ఫక్రుద్దీన్‌లతోపాటు డైరెక్టర్లు అలువాల కోటయ్య, గాజుల నారాయణ, ఎంప గోవర్ధన్‌రెడ్డి, ఎలిశెట్టి భూమయ్యకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలు అందించారు. డైరెక్టర్లు ముదుగంటి సురేందర్‌రెడ్డి, వీర్ల వెంకటేశ్వర్‌రావుకు గైర్హాజరయ్యారు. logo