శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Feb 26, 2020 , 04:06:12

పారిశుధ్యంపై దృష్టి సారించాలి

పారిశుధ్యంపై  దృష్టి సారించాలి

కోనరావుపేట: పారిశుధ్యం, పచ్చదనంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ తెలిపారు. మండలంలోని మంగళ్లపల్లి, సుద్దాల, పల్లిమక్త, కనగర్తి, మామిడిపల్లి, బావుసాయిడపేట గ్రామాల్లో ఆమె మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల శ్మశాన వాటికలు, డంప్‌యార్డుల పనులను ప్రారంభించారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ తలపెట్టిన 30రోజుల కార్యాచరణ, పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. శ్మశానవాటికలు, డంప్‌ యార్డుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని, అధికారులు రోజు వారీగా పనులను పర్యవేక్షించాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలని, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. అనంతరం పల్లిమక్త, కనగర్తి గ్రామాల్లో చేపట్టిన శ్మశానవాటిక నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. కనగర్తిలో మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నిధులు అవసరమున్న తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మంత్రి కేటీఆర్‌ సహకారంతో వాటి మంజూరికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించాలి

అనంతరం సుద్దాల గ్రామంలో ఆమె పర్యటించారు. అగ్గితెగులు సోకిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతులతో పంటల సాగుపై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని, చీడ పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు. ముఖ్యంగా ఏ భూముల్లో ఏ పంటలు పండుతాయో రైతులకు వివరించాలని ఆదేశించారు. పంట మార్పిడి, అంతర పంటల సాగు ఆవశ్యకతను తెలపాలని వివరించారు.


సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ కింద 11 గ్రామాలకు చెందిన 18మందికి రూ.4లక్షల 75వేలు నిధులు మంజూ రు కాగా సంబంధిత లబ్ధిదారులకు సుద్దాల గ్రా మంలో జడ్పీ అధ్యక్షురాలు అందజేశారు. ప్రభు త్వం ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నదని తెలిపారు. అనంతరం చెక్కు మంజూరు చేసిన ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు, జడ్పీ అధ్యక్షురాలు అరుణకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సర్పంచ్‌లు సంతోష్‌, దేవలక్ష్మి, అనిల్‌, భారతి, భారత, గంగాధర్‌, ఎంపీటీసీలు మమత, లక్ష్మి, యాస్మిన్‌, ఉపసర్పంచ్‌లు శరత్‌, నాగరాజు, కిషన్‌, రాంరెడ్డి, తాసిల్దార్‌ రమేశ్‌బాబు, ఎంపీడీ వో రామకృష్ణ, ఎంపీవో మీర్జా, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, జేఈ శ్రీహరి, టీఏ జ్యోతి, ప్రవళిక, వింధ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.