గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 25, 2020 , 01:59:11

‘అనంతగిరి’ క్లియర్‌

‘అనంతగిరి’ క్లియర్‌

ఇల్లంతకుంట: సమస్యలను పరిష్కరిస్తామన్న సర్కారు భరోసాతో గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అన్నపూర్ణ రిజర్వాయర్‌ ముంపు బాధితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ముంపు బాధితుల చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడానికి సర్కారు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీలో భాగంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామ శివారులో ని ర్మాణమైన అన్నపూర్ణ రిజర్వాయర్‌ నీటి విడుదలకు సర్వం సిద్ధం చేశారు. కానీ, ముంపు అనంతగిరి గ్రామస్తులు పూర్తి స్థాయిలో సహకరించకపోడంతో ఇప్పటి వరకు విడుదల చేయలేకపోయారు. తాజాగా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సోమవారం గ్రామస్తులతో సామరస్యంగా చర్చలు జరిపారు. 


కలెక్టర్‌, ఎమ్మెల్యేతోపాటు జడ్పీ ఉపాధ్యక్షుడు సిద్దం వేణు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, తాసిల్దార్‌ రాజిరెడ్డి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా ఉంటామని సర్కారు తరఫును హామీ ఇవ్వడంతో ముంపు బాధితులు స్వచ్ఛందంగా గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించారు. సోమవారం రాత్రి నుంచి తమ నివాసాలను ఖాళీ చేయడం ప్రారంభించారు. ముంపు బాధితులు వల్లంపట్ల రాజారాం, మాసం లక్ష్మణ్‌, న్యాత రవి, న్యాత లింగయ్య తమ నివాసాలను ఖాళీ చేసి, సామగ్రితో అనంతగిరి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనికి పయనమయ్యారు. ముంపు బాధితుల సహకారంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి, సర్పంచ్‌ పల్లె నర్సింహారెడ్డి, ఎంపీటీసి గొట్టెపర్తి పర్శరాం, ఉప సర్పంచ్‌ కిషన్‌, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo