బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Feb 24, 2020 , 02:28:22

ఇక ‘పట్టణ’ బాట

ఇక ‘పట్టణ’ బాట
  • పది రోజులపాటు కార్యక్రమం
  • సమస్యల గుర్తింపునకు ప్రాధాన్యత
  • పారిశుధ్యం.. పచ్చదనంపై ప్రత్యేక దృష్టి
  • పరిష్కారాలపై ప్రణాళికల రూపకల్పన
  • ఇప్పటికే వార్డుల వారీగా ప్రత్యేక నోడల్‌ అధికారుల నియామకం
  • కౌన్సిలర్లతో కలిసి కమిటీల ఏర్పాటు పూర్తి
  • సిరిసిల్ల 26వ డివిజన్‌లో ప్రారంభించనున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పట్టణ ప్రగతి’ అమలుకు సర్వం సిద్ధమైంది. పల్లె ప్రగతి స్ఫూర్తితో నేటి నుంచి పది రోజుల పాటు ఈ కార్యక్రమం అమలుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో, వార్డుల వారీగా ప్రత్యేకాధికారులు, నోడల్‌ అధికారులను నియమించగా, వారు ఇప్పటికే ఆయా కౌన్సిలర్లతో కలిసి ఒక్కొక్క వార్డులో ఐదు చొప్పున కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించనున్నారు. కాగా, సోమవారం సిరిసిల్ల బల్దియాలోని 26వ వార్డులో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.       -రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ


రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నేటి నుంచి నిర్వహించనున్న పట్టణ ప్రగతికి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. 24వ తేదీ నుంచి 3 వరకూ జరిగే కార్యక్రమాలను సోమవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ప్రారంభించనున్నారు. మున్సిపల్‌ కొత్త చట్టం ప్రకారం అందులోని ఐదు కార్యక్రమాలను ప్రధానంగా అమలు చేయనుండగా, ఒక్కో కార్యక్రమానికి 15 మంది చొప్పున వార్డుకు 75 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అమలు చేయనున్నారు. జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాల్టీ, వేములవాడ మున్సిపాల్టీల్లో సోమవారం కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ప్రారంభించనుండగా, కమిషనర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు పాల్గొననున్నారు. ఈనెల 24 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పదిరోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనుండగా, అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. కొత్త మున్సిపాల్టీ చట్టప్రకారం చేపట్టబోయే పలు కార్యక్రమాలపై కౌన్సిలర్లకు స్థానిక మున్సిపల్‌ కమిషనర్లు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కూడ కల్పించారు. వార్డుల్లో ప్రధానంగా తడిచెత్త, పొడిచెత్త సేకరణతో పాటు మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. 


 ఐదు కమిటీలు..

పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యం త్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం వార్డు కమిటీలను నియమించింది. వార్డులో 75 మం దితో కలిపి జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాల్టీలో 39వార్డులకు గాను 2,925మంది, వేములవాడలోని 28వార్డుల్లో 2100 మంది సభ్యులతో కమిటీలు వేశారు. అందులో 1) యూత్‌కమిటీ, 2) ఉమెన్స్‌కమిటీ, 3) సీనియర్‌ సిటిజన్‌ కమిటీ, 4) ఎమినెంట్‌ పర్సన్‌ కమిటీ, 5) హరితహారం కమిటీ. ప్రతీ కమిటీలో 15 మంది చొప్పున ఐదు కమిటీలకు మొత్తంగా 75 మందిని సభ్యులుగా చేర్చారు. కమిటీ సభ్యులంతా తమ వార్డుల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలు, అసంపూర్తిగా నిలిచిన పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి వార్డులోని ప్రత్యేక అధికారికి నివేదించాల్సి ఉంది. కమిటీలకు కూడా పట్టణప్రగతిపై ఈ మేరకు అవగాహన కల్పించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో వివరించారు. నేటి నుం చి కమిటీ సభ్యులు, అధికారులు కలిసి ఆయా వార్డుల్లో పర్యటించనున్నారు. ప్రజలు కూడా వార్డుల్లో నెలకొన్న సమస్యలు, ఇబ్బందులు కమిటీ సభ్యులకు తెలియజేస్తే, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారు. 


 పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..

ప్రస్తుతం వాతావారణ కాలుష్యంతో పాటు పరిసరాలు పరిశుభ్రం లేకపోవడం వల్ల కొత్తకొత్తరోగాలు పుట్టుకొస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు పారిశుధ్యం, హరితహారం లాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పల్లెలు స్వచ్ఛతవైపు అడుగులు వేసి, అభివృద్ధి చెందుతున్నాయి. అదే స్ఫూర్తితో పట్టణాల ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. పట్టణ ప్రగతిలో తాము సైతం అం టూ కమిటీ సభ్యులు ముందుకు రాగా, ప్రజలు కూడ ఆసక్తి కనబరుస్తున్నారు. స్వచ్ఛతలో ఇప్పటికే పలుమార్లు జాతీయస్థాయి అవార్డులను దక్కించుకున్న సిరిసిల్ల మున్సిపాల్టీకి దీటుగా వేములవాడను తీర్చిదిద్దడానికి నగర పంచాయతీ పాలకవర్గం తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండు పట్టణాలు పోటాపోటీగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి, నంబర్‌వన్‌ స్థానం సాధించే దిశగా ముందుకుపోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించిన మున్సిపాల్టీల్లో ఇప్పటికే ఇంటింటికీ చెత్త సేకరణ చేపట్టాయి. తడిచెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నేటి నుంచి నిర్వహించే పట్టణ ప్రగతిలో అధికారులు ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకోనున్నారు. పారిశుధ్యంతో పాటు హరితహారంలో మొక్కలు నాటడం, ఇంటింటికీ నీరు సరఫరా అవుతుందా? లేదా? కమిటీ సభ్యులు ప్రజల నుంచి వివరాలను సేకరిస్తారు. వీధిదీపాలు, విద్యుత్‌ సమస్యలు, వేలాడే లూజ్‌వైర్లు, రోడ్ల మధ్యన విద్యుత్‌ స్థంభాలు, మురుగు కాలువలు, తదితర సమస్యలు ప్రజలు కమిటీ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లయితే వారు అధికారులకు నివేధించి సమస్యలను పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటారు. పట్టణ ప్రగతిలో మొదటి రోజు కమిటీ సభ్యులు, ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు వార్డులలో పర్యటించి పనులను గుర్తించనున్నారు. రెండో రోజు పారిశుధ్యం చేపట్టనున్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.