శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Feb 22, 2020 , 04:48:46

ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ

వేములవాడ నమస్తే తెలంగాణ/ కల్చరల్‌: వేములవాడ రాజన్న సన్నిధి శుక్రవారం శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎటుచూసినా భక్తజన సందోహం కనిపించింది. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మ హారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వేకువజాము నుం చే ఆలయానికి చేరుకున్నారు. సుమారు 2 లక్షల మంది తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. తలనీలాలతో పాటు బంగారం(బెల్లం) మొక్కులను కూడా సమర్పించారు. క్యూలైన్లలో నాలుగు గంటల పాటు వేచి ఉండి మరీ స్వామి వారిని దర్శించుకున్నారు. రా జన్న ఆలయంతో పాటు అనుబంధ బద్దిపోశమ్మ, భీమేశ్వర, నగరేశ్వర, కేదారేశ్వర ఆలయాల్లోనూ బారులు తీరారు. భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు సేవలందించారు. మానేరు స్వచ్ఛంద సేవ సంస్థతోపాటు కరీంనగర్‌ డెయిరీ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.


స్వామి వారికి పట్టువస్ర్తాలు.. 

రాజరాజేశ్వరస్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉదయం 6.30 గంటలకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మరియ దంపతులు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ దంపతులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు, రాష్ట్ర దేవాదాయశాఖ అనిల్‌కుమార్‌ పట్టు వస్ర్తాలను సమర్పించారు. వీరికి రాజన్న ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించిన తర్వాత మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో మంత్రి దంపతులకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్వామివారి చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. ఆనవాయితీలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి హరిచంద్రనాథ్‌, అర్చకులు గురువరాజు స్వామివారికి పట్టు వస్ర్తాలను అందజేశారు. 8.30 గంటలకు ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్వామివారికి శేషవస్ర్తాలను సమర్పించగా, మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బ్రేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవిప్రసాద్‌, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ స్వామివారిని దర్శించుకున్నారు. వీరందరికీ రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్‌, ఈశ్వరగారి సురేశ్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికి, ఆలయ అద్దాల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. వీరి వెంట ఆలయ ఈవో కృష్ణవేణి, ఆర్డీవో శ్రీనివాసరావ్‌, డీఎస్పీ చంద్రకాంత్‌, తాసిల్దార్‌ నక్క శ్రీనివాస్‌, రాజన్న ఆలయ విశ్రాంత ఈవో దూస రాజేశ్వర్‌తో పాటు అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. భక్తులు, పట్టణ ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకుగాను సిటీ కేబుల్‌ ఎండీ కొక్కుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చేసారు. 


రాజన్న సన్నిధిలో ప్రముఖులు..

పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. కరీంనగర్‌ జిల్లా న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి, ఫ్యామిలీ కోర్ట్‌ జడ్జ్‌ లలితాశివజ్యోతి, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్‌, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మార్క్‌ఫెడ్‌చైర్మన్‌ లోక బాపురెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ యోగితా రాణా, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, అంజయ్య, జడ్పీ వైస్‌చైర్మన్‌ సిద్ధం వేణు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఆలయ మాజీ చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీరి వెంట ఆర్డీవో శ్రీనివాసరావ్‌, డీఎస్పీ చంద్రకాంత్‌, తాసిల్దార్‌ నక్క శ్రీనివాస్‌, ఆలయ ఈవో కృష్ణవేణి, రాజన్న ఆలయ విశ్రాంత ఈవో దూస రాజేశ్వర్‌తో పాటు అధికారులు, రాజకీయనాయకులు  ఉన్నారు. 


ఘనంగా మహాలింగార్చన..

వేములవాడకు చెందిన అగ్రహార బ్రాహ్మణులతో ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో దాదాపు 128 కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 


ఘనంగా రుద్రాభిషేకం...

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి 11 గంటలకు లింగోద్భవకాలాన వేములవాడ స్వామివారికి ఆలయ అర్చకులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. 


శివదీక్షాపరుల శోభాయాత్ర..

41రోజులుగా దీక్షలో లీనమైన దాదాపు వెయ్యి మందికిపైగా శివస్వాములు ‘ఓం నమశ్శివాయ..’ అంటూ ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణతో మార్మోగించారు. అంతకుమందు పట్టణంలో భారీ శోభాయాత్రను నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్న అనంతరం, రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఇరుముడులను చెల్లించుకుని మాల విరమణ చేశారు. logo