మంగళవారం 02 జూన్ 2020
Rajanna-siricilla - Feb 22, 2020 , 04:46:03

రాష్ట్ర స్థాయి పోటీలకు ‘వీర్నపల్లి’ ముస్తాబు

రాష్ట్ర స్థాయి పోటీలకు  ‘వీర్నపల్లి’ ముస్తాబు

వీర్నపల్లి : రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు వీర్నపల్లి మండలం వేదికైంది. ఒకప్పుడు అడవి బాట పట్టిన యువత నేడు క్రీడలు, చదువు వైపు అసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర స్థాయి అవకాశాలు రావడం అరుదు. కేవలం మండల స్థాయి క్రీడలకే పరిమితమైన క్రీడాకారులను ప్రొత్సహించేందుకు అధికారులు, ఎన్‌ఆర్‌ఐలు, వాలీబాల్‌ క్లబ్‌ సభ్యులు ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతంలోనే రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించాలని భావించారు. అందులో భాగంగానే వీర్నపల్లిలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించేందుకు నిర్వాహాకులు అన్ని  ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పల్లె క్రీడాకారులకు రాష్ట్రస్థాయిలో సత్తాచాటుకునే అవకాశం లభించింది. ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించే క్రీడాపోటీలకు రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి వాలీబాల్‌ జట్లు పాల్గొనే అవకాశం ఉంది. 


ముందస్తు శిక్షణ ప్రారంభం...

క్రీడల నిర్వహణకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదనంలో క్రీడల కోసం ప్లడ్‌ లైట్‌లు, నెట్‌పోల్స్‌, హైమస్ట్‌ లైట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈనెల 18 నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా క్రీడాకారులకు వాలీబాల్‌ ఆటపై శిక్షణ ఇస్తున్నారు. వాలీబాల్‌ ఆటలో మెళకువలు నేర్పిస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడలను 30 మంది రాష్ట్ర రెఫిరిట్‌ అసోసియేషన్‌ సభ్యులు పర్యవేక్షించనున్నారు. క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు జిల్లాల నుంచి వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తున్నారు.


నాలుగురోజులు క్రీడలు

నాలుగురోజుల పాటు నిర్వహించే క్రీడల్లో బాలికలు 10, బాలురు 10 జట్ల చొప్పున పాల్గొనే అవకాశాలున్నాయి. అందుకోసం 80మంది పీఈటీలు, పీడీల పర్యవేక్షణలో క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక్కో జట్టుకు ఇద్దరూ చొప్పున 40మంది కోచ్‌, మేనేజర్లు హాజరవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మ్యాచ్‌లను ఆడించనున్నారు. పది రోజుల ముందు నుంచే వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి రాందాస్‌, ఎస్‌ఐ రామచంద్రంగౌడ్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిత్యం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.


ఎన్‌ఆర్‌ఐల చేయూత 

రాష్ట్రస్థాయిలో నిర్వహించే క్రీడలకు ఆర్థికభారం పడుతుండగా పూర్తిస్థాయిలో ఎన్‌ఆర్‌ఐలు చేయూతనందిస్తున్నారు.ప్రతి రోజు 500 మందికి భోజనాలతో పాటు ఇతరుల ఖర్చుల కోసం ఎన్‌ఆర్‌ఐలు రాధారపు సత్యం(ఈటీసీఏ అధ్యక్షుడు), తోట రామ్‌కుమార్‌ ఆర్థికసాయం అందించారు. రాష్ట్రస్థాయిలోనే క్రీడలకు పూర్తిస్థాయిలో చేయూతనందిస్తామని ఈ ఇద్దరూ ఎన్‌ఆర్‌ఐలు స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. క్రీడల నిర్వహణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు.


logo