మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Feb 21, 2020 , 06:22:31

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

‘గ్రామాలు పచ్చదనంతో పరిశుభ్రంగా మార్చడమే సీఎం లక్ష్యం.. గ్రామానికి సర్పంచే కేసీఆర్‌గా మారి ఆదర్శంగా మార్చుకోవాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘తాగు, సాగునీరు, నిరంతర విద్యుత్‌తో పాటు ప్రతి నెలా పంచాయతీలకు నిధులిస్తున్నాం..

  • పల్లెప్రగతిని నిరంతరం కొనసాగించాలి
  • ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా పాల్గొనాలి
  • యువత, మహిళలను భాగస్వాములను చేయాలి
  • గ్రామానికో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసుకోవాలి
  • గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలి
  • డంప్‌యార్డు, శ్మశానవాటిక, ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తి చేయాలి
  • పీఆర్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం
  • పచ్చదనం, పరిశుభ్రతే సీఎం లక్ష్యం
  • సర్పంచ్‌లు పనిచేయకపోతే చర్యలు
  • సిరిసిల్లలో పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో మంత్రి కేటీర్‌

సిరిసిల్లటౌన్‌/ సిరిసిల్లరూరల్‌: ‘గ్రామాలు పచ్చదనంతో పరిశుభ్రంగా మార్చడమే సీఎం లక్ష్యం.. గ్రామానికి సర్పంచే కేసీఆర్‌గా మారి ఆదర్శంగా మార్చుకోవాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘తాగు, సాగునీరు, నిరంతర విద్యుత్‌తో పాటు ప్రతి నెలా పంచాయతీలకు నిధులిస్తున్నాం.. పంచాయతీరాజ్‌ చట్టం పకడ్బందీగా అమలు చేస్తాం.. నిర్లక్ష్యం వహిస్తే పదవులు పోతాయ్‌..’ అని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు వారి స్థాయిని బట్టి నడుచుకొని అభివృద్ధికి పాటుపడాలని, తమ గ్రామాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశాకే నిధుల కోసం తనవద్దకు రావాలని సూచించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీలు చేస్తారని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని హితవుపలికారు. వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందిస్తున్న మిషన్‌ భగీరథ నీటినే తాగాలని సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ‘పల్లెప్రగతి’పై నిర్వహించిన పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. మొ దట సభప్రాంగణంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించారు.


అక్కడ మిషన్‌భగీరథ నీటి ని మంత్రి తాగారు. అనంతరం సభాప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. అభివృద్ధిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు సభ్యులు అం కితభావంతో పని చేయాలన్నారు. గ్రామాలను బాగు చేస్తే ప్రజలంతా హర్షిస్తారని , సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానం తో ప్రతిఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చా రు. పల్లె ప్రగతితో గ్రామాల్లో మార్పు వచ్చిందని, ఈ మా ర్పును శాశ్వతంగా కొనసాగించాలని సూచించారు. కేసీఆర్‌ పాలనపై ప్రజలకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఏర్పడిందని, ఆయన పనిచేసే ముఖ్యమంత్రిగా ప్రజల మదిలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను బాగుచేసుకోవడానికి, మున్సిపల్‌ చట్టంను ముఖ్యమంత్రి రూపొందించారని తెలిపారు.


చట్టాలపై అవగాహన పెంచుకోవాలి..

సర్పంచ్‌లు, ఎంపీటీసీలు చట్టంపై అవగాహన చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రజలకు సేవ చేయలనే పట్టుదల ఉండాలని, పనిచేసిన పాలకులనే ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకుంటారని ఉద్బోధించారు. పనిచేయకుంటే నూతన చట్టంతో పదవి ఊడడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వం ఆశించిన సేవలు అందించ కుంటే చట్టం ఊరుకోదని, పదవి పోతే కోర్టులు, సీఎం కేసీఆర్‌ కూడా కాపాడలేరని తెలిపారు. చట్టం పటిష్టంగా రూ పొందించారని, చట్టంపై అవగాహన చేసుకుని పోటీచేయాలని ఎన్నికల ముందే నాయకులకు సూచించిన ట్లు ఉద్ఘాటించారు. ప్రభుత్వం నీళ్లు, 24 గంటలు కరెంటు, తాగు, సాగునీరు, ఇంటింటికీ సంక్షేమ పథకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు లాంటి పథకాలు అందిస్తున్నదని చెప్పారు. ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి గ్రామాన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఆదర్శంగా మార్చుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. 


లక్ష్యం పూర్తి చేస్తేనే నిధులిస్తాం..

గ్రామాల్లో సర్పంచ్‌లు వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డ్‌లు, చెత్త తరలించడానికి ట్రాక్టర్లు, ఇంకుడుగుంతలు, నాటిన మొక్కలు బతికేలా, పారిశుధ్య రక్షణకు చర్యలను వందశాతం పూర్తి చేస్తేనే తమ వద్దకు రావాలని మంత్రి కేటీఆర్‌ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి గ్రామంలో పనులు పూర్తి చేసినట్లు నివేదికతో వస్తేనే కొత్త పనులకు ని ధులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. వెనకబడి ఉన్న గ్రామాలు ఇప్పటికైనా మేల్కొని పనులు త్వరి తగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లెప్రగతిలో జిల్లా ముందంజలో ఉండడం సంతోషకరమని, అయినా వంద శాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే ముందుంచాలని ఆకాంక్షించారు.


మార్చిలో సీఎం తనిఖీ..

పల్లె ప్రగతి పూర్తయిన గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ మార్చి మొదటి వారంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయా గ్రామాల అభివృద్ధి రిపోర్ట్‌లను సంబంధిత ఎమ్మెల్యేలకు పంపిస్తామని, గ్రామాల అభివృద్ధి కూడా ఎమ్మెల్యేల బాధ్యత ఉంటుందని వివరించారు. బాగా పని చేసిన వారికి ప్రశంసలు ఉంటాయనీ, పని చేయని ప్రజాప్రతినిధుల జాబితాను వారి ఎమ్మెల్యేలకే అందిస్తామన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి తండ్రి వంటి వారన్నారు.

మిషన్‌ భగీరథ నీళ్లే తాగాలి.. 

కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నో కోట్లు వెచ్చించి మిషన్‌భగీరథ ద్వారా అందిస్తున్న శుద్ధనీటిని ప్రజలు తాగాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తాను కూడా మిషన్‌ భగీరథ నీరు తాగానని, ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలలో అన్నింటా మిషన్‌ భగీరథ నీళ్లే వినియోగించాలని ఆదేశిం చారు. ప్టాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ముస్తాబాద్‌ మండలం మోహినికుంట గ్రామానికి చెందిన జూట్‌ బ్యాగ్‌లను కేటీఆర్‌ సమావేశంలో చూపించారు. తయారు చేసిన మహిళాసంఘం నేతలు, డీఆర్‌డీఏ సిబ్బందిని అభినందించారు. దీంతో పాటు స్టీల్‌ టిఫిన్‌ బాక్సు తీసుకెళ్తేనే మాంసం విక్రయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 


ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు శ్రీకారం..

జిల్లాలో ప్రయోగపూర్వకంగా అన్ని గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. గ్రామాల్లో వీధి దీపాల ఉన్న విద్యుత్‌ స్తంభాల సంఖ్య తీసి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎల్‌ఈడీ లైట్లతో 30 నుంచి 40 శాతం వరకు విద్యుత్‌ ఆదా అవుతుందని, పంచాయతీలపై విద్యుత్‌ భారం కూడా తగ్గుతుందన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఏర్పాటుచేసేలా చర్య లు తీసుకుంటామన్నారు. 


అభివృద్ధికి కృషిచేయాలి..

గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు త మ స్థాయి విధులను బట్టి నడుచుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయా లని పిలుపునిచ్చారు. 


సుందరీకరణ పనులు ప్రారంభిస్తాం..

సిరిసిల్ల పర్యటనకు విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్‌ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్సుటైల్‌ పార్కు ప్రధాన గేటు వద్ద ఆందోళన చేస్తున్న పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, కార్మికులను చూసి మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను ఆపారు. కారు లోంచి దిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. నాయకుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. త్వరలోనే టెక్స్‌టైల్‌ పార్కులోని సుందరీకరణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌చైర్మన్‌ సిద్దం వేణు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌ అంజయ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్‌ ఆర్గనైజర్‌ గుగులోత్‌ రేణ, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీ నర్‌ గడ్డం నర్సయ్య, సెస్‌ చైర్మన్‌ లక్ష్మారె డ్డి, జిల్లా అధికారులు జడ్పీసీఈఓ గౌతంరెడ్డి, డీపీవో రవీందర్‌, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, ఆయా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.


ప్రతినెలా పంచాయతీలకు 339 కోట్లు..

గ్రామ అభివృద్ధికి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెలా 339 కోట్లు అందిస్తున్నదని తెలిపారు. వీటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయన్నారు. పారిశుధ్యం, పచ్చదనంతో కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణం చేపట్టే పనులకు పంచాయతీ ట్రాక్టర్ల ద్వార ఇసుక రవాణా చేసుకోవాలని , దీంతో ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేసినట్లు అవుతుందన్నారు. ఎన్నికల సీజన్‌ ముగిసిందని, ఇక పరిపాలనపైనే సీఎం దృష్టి సారించారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పని చేసి తమ గ్రామానికి కావాల్సిన శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, కంపోస్టు షెడ్‌లు గ్రామాలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అధికారులు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తారని స్థలాల కొరత లేకుండా అవసరమైతే అటవీభూములను అందించేందుకు సీఎం ఆదేశించారని చెప్పారు.పల్లెప్రగతి కన్నతల్లిలా కనిపిస్తున్నది..

పల్లె ప్రగతి కన్నతల్లిలా కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్‌ కలలు గన్న గ్రామస్వరాజ్యం కండ్ల ముంగిట కనిపిస్తున్నది. పల్లెప్రగతిలో ఇల్లంతకుంట గ్రామాలు మందంజలో ఉండడం సంతోషకరం. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో మరుగుదొడ్లు కట్టుకోవాలని అవగాహన కల్పించిన. ప్రజలు చైతన్యవంతులు కావాలి. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసుకోవాలి. నిధులతో పాటు తాగు, సాగు నీరు, కరెంటు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రజాప్రతినిధులు గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రంగా అందంగా మార్చుకోవాలి. పల్లెప్రగతిని నిరంతరం నిర్వహించుకోవాలి. 

- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కేసీఆర్‌తోనే గ్రామస్వరాజ్యం

సీఎం కేసీఆర్‌తోనే గ్రామస్వరాజ్యం సాధ్యమైంది. పల్లె ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామాల్లో ముఖచిత్రాలు మారాయి. పల్లెప్రగతిలో గ్రామాలను పచ్చదనంగా, పరిశుభ్రంగా మార్చుకుందాం. కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా పని చేద్దాం. అపరభగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌. మెట్ట ప్రాంతమైన నియోజకవర్గాన్ని వాటర్‌హబ్‌గా మార్చారు. కాళేశ్వర జలాలను తీసుకొచ్చారు. రైతుల కండ్లల్లో ఆనందాలు చూస్తున్నాం. యాసంగి సాగుకు కోరగానే 1టీఎంసీ నీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌కు శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ 


logo