గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Feb 21, 2020 , 06:20:51

సంకల్పంతో పనిచేయాలి

సంకల్పంతో పనిచేయాలి

ప్రజల మనసులో నిలిచిపోయేలా ప్రతి వార్డు కౌన్సిలర్‌ సంకల్పంతో పనిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. వేములవాడలోని మహారాజా ఫంక్షన్‌హాల్‌లో వేములవాడ, సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘాల పాలకవర్గం, అధికారులతో ప్రగతి సమ్మేళనం నిర్వహించారు.

  • పౌరసేవలే ప్రధానంగా నూతన చట్టం
  • పనిచేయకుంటే పదవి ఊడుతుంది
  • పల్లె ప్రగతే పట్టణ ప్రగతికి స్ఫూర్తి
  • వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా.. రాజన్న క్షేత్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాం
  • పట్టణ ప్రగతి సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌

వేములవాడ, నమస్తే తెలంగాణ: ప్రజల మనసులో నిలిచిపోయేలా ప్రతి వార్డు కౌన్సిలర్‌ సంకల్పంతో పనిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. వేములవాడలోని మహారాజా ఫంక్షన్‌హాల్‌లో వేములవాడ, సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘాల పాలకవర్గం, అధికారులతో ప్రగతి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. పట్టణాల్లో పౌరులకు అవినీతి రహితంగా సేవలు అందించడమే ప్రధానంగా నూతన మున్సిపల్‌ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పరిశీలించి అమలు చేశారన్నారు. నూతన చట్టం కఠినంగా ఉండనుందనీ, పనిచేయకుంటే పదవి ఊడుతుందన్నారు. 30 రోజుల్లో పల్లె ప్రగతిలో సాధించిన స్ఫూర్తినే పట్టణ ప్రగతిలో అమలు చేస్తున్నామన్నారు. వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా మార్చుతుండగా రాజన్న క్షేత్రాన్ని కూడా తీర్చిదిద్దుతామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గడిచిన 73 ఏళ్లలో ఎక్కడా జరగని పరిపాలన సంస్కరణలను సీఎం కేసీఆర్‌ అమలు చేశారన్నారు. అనేక ప్రభుత్వాలు మారినా, గ్రామాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని పరిపాలన సంస్కరణలు రాష్ట్రంలో అమలవుతున్నాయని వివరించారు. దేశంలోనే గొప్ప సంస్కరణలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 


అపవాదు చేశారు

రాజన్న ఆలయానికి వస్తే పదవులు కూడా ఉడతాయని ఉమ్మడి రాష్ట్రంలో అపవాదులు పెట్టారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ స్వయం గా స్వామివారిని దర్శించుకొని ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తుచేశారు. ఆలయాన్ని కూడా గొప్పగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే పనులు వేగవంతం కాగా, వచ్చే వందేళ్ల వర కు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సుదీర్ఘ కాలంగా ఉండే విధంగా సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. 

 పని చేయకుంటే వేటే..

పురపాలక సంఘంలో కొత్త చట్టాన్ని అమలు చేశామని మంత్రి గుర్తుచేశారు. చట్టంపై అవగా హన తెచ్చుకొని పోటీ చేయాలని ఎన్నికలకు ముందే తాను ప్రతి సమావేశంలో వివరించామని పేర్కొన్నారు. కౌన్సిలర్‌ తప్పనిసరిగా తన వార్డు స్వరూపంపై అవగాహన కలిగిఉండాలన్నారు. నూతన చట్టంలో వార్డు పరిధిలో నాటిన మొక్క ల్లో 85శాతం బతికించాల్సిన బాధ్యత వార్డు కౌన్సిలర్లపై ఉందన్నారు. ఏ ఒక్కటి తక్కువైనా, మొత్తానికి నాటకపోయినా, పదవులు ఊడతాయ న్నా రు. తప్పు చేసినా, పని చేయకపోయినా, పదవిని మాత్రం శివుడు కూడా రక్షించలేడని బోధించారు. వందశాతం వార్డు పరిధిలో పన్నులను వసూలు చేసే బాధ్యత కౌన్సిలర్లపైనే ఉందన్నారు. 


75 గజాల లోపు అనుమతులు అవసరం లేదు

పురపాలక సంఘం పరిధిలోని నూతన భవన నిర్మాణాల్లో 75 గజాల లోపు స్థల యజమాని వ్యక్తిగతంగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని పురపాలక సంఘానికి అందజేస్తే అనుమతులు అక్కరలేవన్నారు. ఇక 75 గజాలపై నుంచి 600 గజాలలోపు నిర్మాణాలకు కూడా స్థల యజమాని వ్యక్తిగతంగా స్వీయధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. తాను నిర్మించే భవనం, చదరపు అడుగులు, రహదారులకు సెట్‌బ్యాక్‌ లాంటివి అందులో పొందుపరచాలన్నారు. వ్యక్తిగతంగా స్వీయధ్రువీకరణ పత్రం అందజేసి వాటి ని అతిక్రమిస్తే నోటీసులు లేకుండానే భవనాన్ని కూల్చివేసే అధికారం అధికారలకు కొత్త చట్టంలో రూపొందించారని వివరించారు. ఆస్తి పన్నులను కూడా వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే 25 రేట్ల ఆపరాధ రుసుంతో వసూలు చేస్తారన్నారు. 


బడ్జెట్‌లో 10 శాతం పచ్చదనానికి...

పురపాలక సంఘం బడ్జెట్‌లో 10 శాతం నిధులను పచ్చద నానికి వెచ్చించాలని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశానికి సిరిసిల్లలో తాను, వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు హాజ రవుతారని సూచించారు. ఆస్తిపన్నులను వందశాతం వసూలు చేసి నగరాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. 


పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం 

నగరాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని మంత్రి సూచించారు. తడి, పొడి చెత్తను వేరుచేసి తప్పనిసరిగా పారిశుధ్య సిబ్బందికి అందజేసే విధంగా వార్డు సభ్యులు చూడాలని వివరించారు. ఇందుకు ప్రతి ఇంటికీ అవగాహన కల్పించడమే కాకుండా రహదారులపై కూడా చెత్త వేయకుండా చూడాలన్నారు. పాత భవనాలను తొలగిస్తుండ గా, శిథిలాలను రోడ్లపై వేయకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే యజమాను లను గుర్తించి నోటీసులు అందజేయాలన్నారు. రోడ్లకు ఇరు వైపులా పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు తొలగించాలన్నారు. 


ప్రతి వార్డులో మరుగుదొడ్ల నిర్మాణం

వార్డుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ స్థలాలు గుర్తించి పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని నిర్మించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, దవాఖానలు, పాఠశాలల్లోనూ నిర్మాణాలను చేపట్టాలన్నారు. 


అవగాహన కల్పించాలి

పరిశుభ్రతలో భాగంగా ప్లాస్టిక్‌ వాడకాలను  తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చేతిసంచిని తీసుకొని వెళ్లే అలవాటు చేసు కోవాలని ప్రజలకు సూచించాలన్నారు. మిషన్‌ భగీరథ నీటిని తాగేలా అవగాహన కల్పించాలన్నారు. మాంసం విక్రయదారులతో సమావేశం ఏర్పాటుచేసి స్టీల్‌ డబ్బాలను మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

 

పట్టణ ప్రగతిపై దృష్టి సారించాలి

పట్టణ ప్రగతిపై పురపాలక సంఘం అధ్యక్షులు తప్పనిసరిగా దృష్టి సారించాలన్నారు. వార్డుల్లో సమస్యలను, అభివృద్ధి విషయాలను కౌన్సిలర్లు అధ్యయనం చేస్తారని, పట్టణ ప్రగతిపై మాత్రం అధ్యక్షులు దృష్టి పెట్టాలన్నారు. ఇందులో మంచి కూరగాయల మార్కెట్‌, మాంసం దుకణాలు, పూల మార్కెట్‌ ఇలా పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు అందేవిధంగా చేపట్టాల్సిన పనులపై అధ్యయనం చేయాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణం స్థలాలను గుర్తించి పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకరావాలన్నారు. 


జిల్లాను నంబర్‌వన్‌ చేద్దాం

రాజకీయాలు ముగిశాయని, వచ్చే నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవని, ముందున్నది ప్రజాసంక్షేమం, అభివృద్ధేనని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నా రు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన వాటిన్నంటిని ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 4 వరకు ప్రతి వార్డులో వార్డు సభ్యులు తిరిగి అధ్యయనం చేయాలన్నారు. తాను వచ్చిన రోజు కౌన్సిలర్‌ను వార్డుపై పూర్తి వివరాలను స్వయంగా అడుగుతానన్నారు. సమావేశంలోనూ కేవలం కౌన్సిలర్లు మాత్రమే ఉండాలని, వారి భర్తలు ఉండరాదని సూచించి బయటకు పం పారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు పట్టణ ప్రగతిలో జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. సిరిసిల్లను తీర్చిదిద్దుతున్నట్లుగానే వేములవాడను కూడా గొప్ప పుణ్యక్షేత్ర పట్టణంగా మార్చుతానన్నారు. 


కౌన్సిలర్లతో అంశాలను రాయించిన మంత్రి

మంత్రి కేటీఆర్‌ సమావేశం ప్రారంభానికి ముందు ప్రతి వార్డు కౌన్సిలర్‌కు నోట్‌పుస్తకాలను అందించాలని అధికారుల ను ఆదేశించారు. సమా వేశంలో వెల్లడిస్తున్న ప్రతి అంశాన్నీ నమోదు చేసు కోవాలని పరిశీలిస్తూ.. ఒక్కో వార్డు కౌన్సిలర్‌ను అంశాలను నమోదు చేసుకోవాలని ఆదేశించారు. దీంతో సమా వేశానికి హాజరైన కౌన్సిలర్లు మంత్రి చెప్పిన అంశాలను పొం దుపరుచుకున్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌ అంజయ్య, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్లు మంచె శ్రీనివాస్‌, మధు రాజేందర్‌, మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, వార్డు అధికారులు, తదితరులు ఉన్నారు.  


logo