గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 19, 2020 , 02:39:45

పట్టణ ప్రగతి కి సన్నద్ధం

పట్టణ ప్రగతి కి సన్నద్ధం

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ : జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారు లు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈనెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి కార్యాచరణపై వివరిస్తూ ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని ఆదేశించారు. సీఎంతో సమావేశం లో మంత్రి కేటీఆర్‌, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ అధ్యక్షులు జిందం కళ, రామతీర్థపు మాధవి పాల్గొన్నారు.  

పట్టణ ప్రగతి కార్యాచరణ 

 ఈనెల 24 నుంచి పది రోజుల పాటు చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం కా ర్యాచరణ ప్రకటించింది. ఆ మేరకు వివరాలివి..

వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వార్డుల వారీగా చేయాల్సిన పనులను, పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యతకు చర్యలు చేపట్టాలి. 

ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో వార్డులు, డివిజన్ల వారీగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ వచ్చే ఐదు రోజుల్లో పూర్తి కావాలి. 

పట్టణ ప్రగతిలో పచ్చదనం-పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురుగునీటి గుంతలను పూడ్చివేయాలి.  

హరిత ప్రణాళిక రూపొందించాలి. విరివిగా మొక్కలు నాటాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3100వాహనాలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి సమకూర్చుకోవాలి. 

పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.

పట్టణ ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలను పూర్తిగా పూడ్చివేయాలి. 

వైకుంఠధామాల ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలి.

పొదలు, తుమ్మలను నరికి వేయాలి.

వెజ్‌/నాన్‌వెజ్‌ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటికోసం స్థలాలను ఎంపిక చేయాలి.

క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయాలి.

డంప్‌ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలి.

పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్‌ నిర్మించాలి. వీటికోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. 

వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపే దాకా వారిని ఇబ్బంది పెట్టవద్దు. 

పార్కింగ్‌ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం ఏర్పాటు చేయాలి.

పట్టణాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతులు అవలంబించాలి. ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థ ఉండాలి. వంగిన, తుప్పు పట్టిన స్తంభాలను, రోడ్డు మధ్యలోని స్తంభాలను, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లను మార్చివేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. 

ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు రం గంలోకి దిగారు. ఈ నెల 24నుంచి చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నా రు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ అధ్యక్షులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమాయత్తమయ్యారు. 

అవితీనిని అంతమొందించండి

‘ఐదు కోట్ల మంది ఉన్న తెలంగాణలో 140 మందికే చైర్‌పర్సన్లుగా అవకాశం లభించింది. మీ కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోం డి.. అవినీతిని అంతమొందించి నిస్వార్థంగా సేవ చేసి ప్రజా నాయకులుగా ఎదగండి. పదవి అంటే ఒక అధికారం కాదు.. అదొక అసిధార వ్ర తం”..అంటూ మున్సిపల్‌ అధ్యక్షులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్తవ్యబోధ చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పల్లె ప్రగతి కార్యాచరణను వివరించడంతో పాటు దిశా నిర్దేశం చేశారు. పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చా రు. మున్సిపాలిటీలంటేనే ప్రజా సమూహంలో లంచగొండులు, చెత్తా చెదారమనే పేరు పడిపోయిందని, దీన్ని రూపుమాపేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రజా శక్తి అన్నింటికంటే ఉత్కృష్టమైందనీ, దాన్ని సమీకృతం చేయగలిగితే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సూచించా రు. పట్టణ ప్రగతిని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలనీ, ఆరు నెలల పాటు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ పౌరులు సమష్టిగా కృషి చేస్తే అందమైన నగరాలు కళ్లెదుట సాక్షాత్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.  


logo