సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Feb 19, 2020 , 02:38:18

రాబోయే బడ్జెట్‌లో రాజన్నకు 200 కోట్లు

రాబోయే బడ్జెట్‌లో రాజన్నకు 200 కోట్లు

వేములవాడ, నమస్తేతెలంగాణ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రాబోయే బడ్జెట్‌లో 200 కోట్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ఈనెల 20 నుంచి వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయనీ, ఇక వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్‌లో ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా 200 కోట్లను కేటాయిస్తామనీ, పనుల ఆమోదం కోసం శృంగేరి పీఠాధిపతి వద్దకు తాను స్వయంగా వస్తానని చెప్పారు. ప్రస్తుతం వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులపై కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు లోటుపాట్లు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించి, ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, నమిలకొండ ఉమేశ్‌ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. ఇక్కడ ఆలయ ఈవో కృష్ణవేణి, ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేశ్‌, ఎడ్ల శివసాయి, తదితరులు ఉన్నారు.