గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Feb 19, 2020 , 02:35:15

ఎములాడ ముస్తాబు

ఎములాడ ముస్తాబు

వేములవాడ కల్చరల్‌: మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబవుతున్నది. రేపటి నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నిర్వహించే జాతరకు సర్వం సిద్ధమవుతున్నది. ఇటు రాజన్న ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. విద్యుత్‌ కాంతులతో గోపురం, కలకత్తా క్లాత్‌ డెకోరేషన్‌తో ఆలయ ప్రాంగణం మెరిసిపోతున్నది. మంత్రి కేటీర్‌, మార్గనిర్దేశనంతో, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సహకారంతో, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సూచనల మేరకు ఉత్సవాలను ఈ యేడాది కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఈవో కృష్ణవేణి వెల్లడించారు. జాతరపనులను మంగళవారం ఈవోతోపాటు సాయంత్రం ఎస్పీ రాహుల్‌ హెగ్డే, ఆర్డీవో శ్రీనివాస రావు పరిశీలించారు. మొత్తంగా 3 నుంచి 4లక్షల మంది భక్తులు వస్తారనీ, వారికి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. చలువపందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. క్యూలైన్లో తాగునీరు సరఫరా చేయనున్నారు. ధర్మగుండంలో మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. 4 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్‌ ట్యాంకర్‌ని వివిధ ప్రాంతాలలో ఉంచనున్నారు. దేవస్థానం ఆవరణలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు, వైర్‌లెస్‌ సెట్లతో అనుసంధానం చేయనున్నారు. చెరువులోని మైదాన ప్రాంతంలో పార్కింగ్‌ స్థలం, శివార్చన కార్యక్రమం కోసం వేదిక, స్వాగత కమాన్ల పనులు శరవేగంగా చేస్తున్నారు. దేశంలో పేరుగాంచిన కళాకారులతో శివరాత్రి రోజున శివతాండవం, శివార్చన నృత్యరూపకాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 300 బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తుల సౌకర్యార్థం ఆరుచోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.. చెరువులోని మైదాన ప్రాంతంలో భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, 20 నల్లాలను బిగించినట్లు చెప్పారు. ఆలయ గోపురాలకు రంగులు వేసే పని, చెరువులోని మైదాన ప్రాంతంలో హైమాస్ట్‌ లైట్స్‌ బిగించే పనులు మంగళవారంతో పూర్తి చేయనున్నారు. ఇంజినీరింగ్‌ ఈఈ రాజేశ్‌, డీఈ మధు రఘునందన్‌, రామేశ్వర్‌రావు, ఏఈ రాంకిషన్‌రావు, నాగరాజు పర్యవేక్షణలో పనులు చేస్తున్నారు. 

రెండువేలమంది పోలీస్‌ సిబ్బంది.. 

మూడురోజులపాటు, మూడు షిప్టుల్లో రెండువేల మంది పోలీసులు అప్రమత్తంగా ఉంటారని డీఎస్పీ వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు పార్కింగ్‌స్థలాలు చూపించే బోర్డులను ఏర్పాటు చేశామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. లడ్డూ ప్రసాదాలను కూడా తయారుచేస్తున్నారు. జగిత్యాల బస్తాండ్‌ ప్రాంతంలోని ఐబీపీ సిలిండర్‌ల గోదాం పక్కన గల ఖాలీస్థలంలో చలువపందిల్లు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.


logo