గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 18, 2020 , 02:09:47

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు వీలుగా చెక్‌ డ్యాంలు, ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణాళికలకు సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం జలాలు మొదట ముద్దాడిన ప్రదేశంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ప్రత్యేకత ఉందనీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ జల కూడలిగా మారిందన్నారు. ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలోని వాగుల్లో అవసరం, అవకాశం ఉన్నచోట చెక్‌ డ్యాంలు, ఎత్తిపోతల పథకాలు నిర్మించాలన్నారు. చెక్‌ డ్యాం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 8ను సవరించి ఈ జిల్లాలో చెక్‌డ్యాం నిర్మాణానికి అనుగుణంగా మార్పులు చేస్తామని చెప్పారు. 


ఉమ్మడి జిల్లాలో నిర్మించనున్న చెక్‌డ్యాంలలో ముంపునకు ఆస్కారం లేకుండా ఎక్కువ నీటిని ఒడిసి పట్టే విధంగా చేపట్టాలని ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి చెక్‌ డ్యాంల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. చెక్‌ డ్యాంలకు ఇరువైపులా నీటిని తరలించేందుకు వీలుగా కాలువలు నిర్మించాలని సూచించారు. ప్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా సాగు అవసరాలకు నీటిని తీసుకునేలా రైతులు అవకాశం కల్పించే విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో చేపట్టబోయే కాలువల ఆధునీకరణ పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరందించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రావిటీతో నీరందించే ఆస్కారం లేని చోట ఎత్తిపోతల పథకాలు చేపట్టే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులనూ ఆధునీకరించి ఎక్కువ నీటిని ఒడిసి పట్టేలా, ఆయకట్టు స్థిరీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి కాలువలకు ఇరువైపులా డీ మార్కేషన్‌ చేయాలనీ, భవిష్యత్‌లో కాలువలు అన్యాక్రాంతం కాకుండా ముంద జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో సాగునీటి అంశాలపై క్షుణ్‌నంగా చర్చించేందుకు శాసన సభ్యులు క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలున్నాయనీ, వాటిని వేగంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. నిర్వాసితులకు న్యాయం అందేలా కృషి చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇంజినీరింగ్‌ అధికారులు చెక్‌డ్యాంల నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలన్నారు. సీఎం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారనీ, జిల్లాకు రూ.1000-1500 కోట్ల వరకు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతి మారుమూల గ్రామాల చివరి ఆయకట్టుకూ నీరు అందేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాగునీరు లేక రాష్ట్రం అల్లాడిందనీ, అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాగునీటి సమస్యను సీఎం కేసీఆర్‌ తీర్చారని గుర్తు చేశారు. నీటి నిర్వహణలో ఎలాంటి లోపాలూ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో కాలువల బలోపేతం చేయడం, చెరువులను మినీ రిజర్వాయర్లుగా మార్చి ప్రాజెక్టులకు అనుసంధానించడం ముఖ్యమని వెల్లడించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాలకు పునరావాస సమస్యను పరిష్కరించాలని సూచించారు. అవసరమైన చోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.


రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ జిల్లాలోని చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అలాగే చెరువుల నుంచి అనధికారిక నీటి విడుదల జరగకుండా చూడాలని సూచించారు. సాగునీటి కాలువల వెంబడి ఇటీవల కాలంలో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయనీ, అలాంటి ప్రదేశాలను గుర్తించి పెన్షింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్సారార్‌, ఎల్‌ఎండీ నిండిన తర్వాత ప్రతి నీటి బొట్టునూ నిలువ చేసేందుకు చెక్‌డ్యాంలు నిర్మించుకోవాలని సీఎం ఆదేశించారనీ, ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చెక్‌డ్యాంల నిర్మాణానికి జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో శాసన, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్‌ ఇంజినీర్లతో కలిసి ప్రతిపాదనలు తయారు చేయాలనేదే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. చెక్‌ డ్యాంల నిర్మాణానికి భూసేకరణ లేకుండా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. 


కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ద్వారా చివరి గ్రామాలకు సాగునీరు అందడం లేదనీ, అందేలా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సారెస్పీలో భూములు పోయిన రైతులకు ఎన్‌ఓసీ రావడం లేదనీ, రీసర్వే చేసి హద్దులు నిర్ణయించి ఎన్‌ఓసీ ఇప్పించేలా ఏర్పాట్లు చూడాలన్నారు. వరద కాలువ పక్కన భూములకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సమస్య లేకుండా రోడ్డు కమ్‌ చెక్‌ డ్యాంలను ఏర్పాటు చేయాలని కోరారుజగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రూ.70 కోట్లతో చేపట్టిన రాళ్ల వాగు ప్రాజెక్టుతో భూమిని కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇచ్చామనీ, అయినా పనులు పూర్తి కావడం లేదని తెలిపారు. అటవీ భూమి సమస్యలుంటే పరిష్కరించాలని కోరారు. వరద కాలువ ద్వారా చెరువులను నింపాలన్నారు. సారంగాపూర్‌ మండలంలో చెరువులు నింపడానికి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేయాలని కోరారు. కొత్తపేట, తాటిపల్లి ఊర చెరువు, చింతల చెరువు నింపడానికి లిప్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేయాలన్నారు.మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తన నియోజపకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగు నీరందించుటకు 40 చెక్‌డ్యాంలను ప్రతిపాదించినట్లు తెలిపారు. 


45 వేల ఎకరాలకు సాగునీరు అందించే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. దామెరకుంట, సుందిళ్ల వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయాలనీ, పలిమెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు మరమ్మతులు చేయాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులపై నెలకోసారి ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించాలని సూచించారు.రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ కాలువల ద్వారా ఎక్కువ నీరు అందించి చివరి ఆయకట్టు భూములకు నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బండల వాగుపై లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలనీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పునరావసం ప్యాకేజీ మంజూరు చేయాలని సూచించారు.చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ వరదకాలువపై సూపర్‌ ప్యాసేజీ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. గాయత్రీ పంపు హౌస్‌కు భూములు ఇచ్చే రైతుల భూములకు సాగునీరు అందించాలనీ, నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కట్టను ఎత్తు పెంచుతూ బలోపేతం చేయాలనీ, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేయాలని సూచించారు. 


హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు వస్తుందనీ డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్‌ పనులను పూర్తి చేయాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, మిగిలిన పనులకు రూ.20 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలన్నారు. శనిగరం రిజర్వాయర్‌ పనులు పూర్తయ్యాయనీ, కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ ఎస్సారార్‌ రిజర్వాయర్‌ పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌ పూర్తయిందనీ, కాలువల నిర్మాణ పనులు కాలేదని తెలిపారు. మానకొండూర్‌ పరిధిలో 13 చెక్‌డ్యాంలకు ప్రతిపాదనలు ఇచ్చామనీ, రెండు మంజూరు చేశారనీ, మిగిలినవి కూడా మంజూరు చేయాలని కోరారు. తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేశారనీ, కాలువలు మాత్రం పూర్తి కాలేదనీ, వీటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ మాట్లాడుతూ కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో 45 వేల ఎకరాలకు వరదకాలువ నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. 


వేములవాడ పరిధిలో 3 చెక్‌డ్యాంలు ప్రతిపాదించామనీ, వాటిని తక్షణమే మంజూరు చేయాలన్నారు. మల్కపేట, నిమ్మపల్లి ప్రాజెక్టుల ద్వారా కోనారావుపేట మండలంలో 25 వేల ఎకరాలు సాగులోకి రానుందనీ, కలికోట సూరమ్మ చెరవు పూర్తయితే కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో 40 వేల ఎకరాలకు సాగులోకి వస్తాయనీ, వరద కాలువపై మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలకు అవసరమైన ఓటీలు నిర్మించాలని కోరారు. తన నియోజకవర్గానికి ఎల్లంపల్లి ద్వారా ఇప్పటికే 40 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో శాసన మండలి సభ్యులు భానుప్రసాద్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు కనుకమల విజయ, పుట్ట మధు, వసంత, ఎన్‌ అరుణ, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లు శశాంక, కృష్ణ భాస్కర్‌, రవి, సిక్తా పట్నాయక్‌, కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఎన్‌సీలు వీరయ్య, అనిల్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ సీఈ శంకర్‌, ఈఈలు, డీఈలు, తదితరులు పాల్గొన్నారు.


logo