బుధవారం 15 జూలై 2020
Rajanna-siricilla - Feb 18, 2020 , 02:00:16

సీఎం జన్మదినం.. డ్రోన్‌తో విత్తనం

సీఎం జన్మదినం.. డ్రోన్‌తో విత్తనం

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ వీర్నపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో జిల్లా అటవీశాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా డ్రోన్‌ కెమెరాలతో విత్తన బంతులను చల్లేవిధానంతో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గతంలో హెలికాప్టర్‌ ద్వారా అటవీప్రాంతంలో విత్తనాలు చల్లిన సందర్భాలుండగా, సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ సంస్థ తయారు చేసిన డ్రోన్‌ కెమెరాతో ఒకే రోజు 15 వేల విత్తన బంతులను చల్లి రికార్డు సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా చేసిన ఈ ప్రయోగానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,  మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో సంస్థ నిర్వాహకులను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. 


దేశంలోనే తొలిసారిగా..

ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారంలో అధికారులు, ఉపాధి కూలీలు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడానికి అనేక వ్యయప్రయసాలకు లోనవుతున్నారు. అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి రావడంతో అటవీ ప్రాంతల్లో డ్రోన్‌ల ద్వారా జారవిడిచిన విత్తన బంతులతో ఎన్నో మొక్కలు బతికాయో లెక్కించే అవకాశం ఏర్పడింది. దీంతో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మరోమారు విత్తన బంతులను చల్లే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి పని, ఆర్థికభారం తగ్గడమే కాకుండా సాంకేతికతో సులువుగా మొక్కలకు ప్రాణం పోసే విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు కానుకగా జిల్లాలో వినూత్న ఆవిష్కరణ చేపట్టారు. దేశంలో తొలిసారిగా డ్రోన్‌ కెమెరా సహాయంతో 15 వేల విత్తన బంతులు చల్లడం, అది మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. దోమలను పారదోలేందుకు మారుత్‌ డ్రోన్‌ తయారీ సంస్థ ప్రత్యేక డ్రోన్‌లను తయారు చేసి, గ్రేటర్‌ హైదరాబాద్‌ సంస్థకు విక్రయించింది. అదే తరహాలో 23 కిలోల బరువు ఉండి, 16 ఎంఎం గల విత్తన బంతులు 10 కిలో బరువు వరకు మోయగల శక్తి కలిగిన డ్రోన్‌లను సదరు సంస్థ తయారు చేసింది. 


దీనిని తొలిసారిగా సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలంలో గల అటవీ ప్రాంతంలో ప్రయోగించేందుకు అటవీశాఖ ఎంచుకుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం సిరిసిల్లలో విత్తన బత్తులు తయారు చేశారు. వాటిని వీర్నపల్లి మండలంలోని అటవీప్రాంతంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేతితో విసిరిన విత్తన బంతులు పెద్దగా ఫలితం ఇవ్వక పోవడంతో మారుత్‌ సంస్థ కొత్తగా డ్రోన్‌లను తయారు చేసింది. వీటిని అటవీశాఖకు అప్పగించే ఒప్పందం చేసుకుంది. వీర్నపల్లి మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు స్థానిక నాయకులు, అటవీశాఖ, విద్యాశాఖ అధికారుల సహకారంతో మూడు రోజుల్లోనే తక్కువ సారం గల జీవామృతం కలిపిన 15వేల విత్తన బంతులను తయారు చేశారు. విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకుపోయారు. ఈ మేరకు తొలి ప్రయోగాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ పైలట్‌ ప్రాజెక్టు ద్వారా అటవీప్రాంతంలో గంగరావి, వెలగ, గుమ్మడి టేకు, సీమ చింత, రావి, సీతాఫలాలకు సంబంధించిన 15 వేల విత్తన బంతులను చల్లినట్లు సంస్థ సీఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. 10 కిలోల బరువును మోసే డ్రోన్‌ కెమెరా సుమారు 50 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. 


కేటీఆర్‌ అభినందనలు

హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు డ్రోన్‌ కెమెరాతో విత్తన బంతుల ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు, అటవీశాఖ అధికారులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో ట్విట్‌ చేశారు. కాగా విత్తన బంతులను మోసుకెళ్లే డ్రోన్‌ బంతులను చల్లుతూ జియోట్యాగింగ్‌ చేస్తుంది. విత్తన బంతులు మొలకెత్తాయా? వర్షాకాలం తర్వాత గుర్తించే వీలుంటుంది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలలో ప్రవేశపెట్టనున్నట్లు మారుత్‌ డ్రోన్‌ తయారీ సంస్థ సీఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. అంతకుముందు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి, కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎంపీపీ మాలోతు భూల, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఎడ్ల సాగర్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నీలం రాజేశ్‌, బంజార సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోతు సురేశ్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, ఎస్‌ఐ రామచంద్రంగౌడ్‌, ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్‌, మహిళ విభాగం మండలాధ్యక్షులు గుగులోతు కళ, సర్పంచులు దినకర్‌, మల్లేశం, శ్రీనివాస్‌, రవి, ఎంపీటీసీ అరుణ్‌, నాయకులు మల్లేశం, జగన్‌, శ్రీరాంనాయక్‌, భాస్కర్‌, సంతోష్‌, దేవరాజు, ప్రవీణ్‌, శేఖర్‌, అజయ్‌, మారుత్‌ సంస్థ సీఈవో ప్రేమ్‌కుమార్‌, పాల్గొన్నారు.logo