బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Feb 15, 2020 , 00:39:11

నాలుగు రోజులు రెండు టీఎంసీలు

నాలుగు రోజులు రెండు టీఎంసీలు

(రామడుగు, ధర్మారం, బోయినపల్లి, తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ):కాళేశ్వరం లింక్‌-2లో గోదారి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్‌ఎండీ దాకా గోదారి పరుగులు తీస్తున్నాయి. కాగా, గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా ఈ నెల 10వ తేదీ నుంచి రాత్రి వేళల్లో ఇప్పటి వరకు రెండు టీఎంసీలు శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎత్తిపోసినట్లు అధికారులు తెలిపారు. ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు మళ్లీ మోటర్లు ఆన్‌ చేశారు. 2, 3, 5, 6 మోటర్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని కాళేశ్వరం ఏడో ప్యాకేజీలోని నంది రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి జలాలు ఎనిమిదో ప్యాకేజీ రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌ సర్జ్‌పూల్‌కు చేరుతున్నాయి. ఇక్కడ కూడా సోమవారం రాత్రి 9 గంటల నుంచి రాత్రి వేళల్లో బాహుబలి మోటర్లు ఎత్తిపోస్తున్నాయి. శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత 2, 3, 4, 7 మోటర్లను ప్రా రంభించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సూచనలతో జలాలను ఎత్తిపోస్తున్నారు. ఐదు టీఎంసీలను ఎస్సారార్‌కు తరలించడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం కృషి చేస్తుండగా ఇప్పటివరకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు తెలిపారు. ఇక్కడ ఈఈ నూనె శ్రీధర్‌, ఏఈఈలు వెంకటేష్‌, సురేశ్‌, శ్రీనివాస్‌, రమేశ్‌నాయక్‌, మెగా ప్రతినిధులు రామకృష్ణ, అవినాష్‌ ఉన్నారు.

ఎస్సారార్‌ నుంచి 6 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి శుక్రవారం 6 వేల క్యూసెక్కుల నీటిని పంపించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో 24.778 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. లక్ష్మీపూర్‌ పంపు హౌస్‌ నుంచి వచ్చిన నీటిని యథావిధిగా దిగువకు వదలుతున్నట్లు ఎస్‌ఆర్‌ఆర్‌ ఈఈ అశోక్‌ కుమార్‌ తెలిపారు. 

ఎల్‌ఎండీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ఎస్సారార్‌ రిజర్వాయర్‌ నుంచి రిజర్వాయర్‌లోకి 4987 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తున్నది. 5751 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో రూపంలో వెళ్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ఎల్‌ఎండీలో ప్రస్తు తం 8.370 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు.