శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - Feb 14, 2020 , 03:47:40

ప్రతి ఎకరాకూ సాగునీరు

 ప్రతి ఎకరాకూ సాగునీరు
  • ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కావాలి
  • హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
  • కాళేశ్వరం పర్యటన సక్సెస్‌
  • ఎన్ని కోైట్లెనా సరే.చెక్‌డ్యాంలు నిర్మించాలి
  • కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దాలి
  • సాగునీటి ప్రణాళికలపైచర్చ
  • ఇంజినీరింగ్‌, నీటి పారుదల శాఖ అధికారులకు దిశానిర్దేశం
కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/ కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి జిల్లాను ఇప్పటికే వాటర్‌ హబ్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌ ప్రతి ఎకరాకూ సాగు నీటిని అందించాలనే తన లక్ష్యాన్ని అధికారులకు వివరించారు. కరీంగగర్‌ కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన, ఎంతో కష్టపడి నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుని చివరి ఆయకట్టు సద్వినియోగం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 161 చెక్‌ డ్యాంలు మంజూరు చేశామనీ, ఇందుకు వెయ్యి కోట్ల నుంచి 1,200 కోట్లు అవసరం ఉంటాయని అంచనా వేశారనీ, ఇవి సరిపోకుంటే ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వచ్చే 15 వరకు మంజూరైన ప్రతి చెక్‌ డ్యాంను యుద్ధ ప్రాతిపదిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేలు మరిన్ని చెక్‌ డ్యాంలు కావాలని కోరుతున్నారనీ, వాటిని కూడా మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఉమ్మడి జిల్లాపై మరోసారి మమకారం.. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపై సీఎం కేసీఆర్‌ తన మమకారాన్ని చాటుకున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్‌ఎండీ వరకు నీటిని మళ్లించి చివరి ఆయకట్టు వరకు సాగు నీటిని అందిస్తుండగా చెక్‌ డ్యాంల నిర్మాణంతో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనేది తమ లక్ష్యంగా తెలియజేశారు. ఇప్పటికే జిల్లాలోని కరీంనగర్‌, హుజూరాబాద్‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించిన చెక్‌ డ్యాంల్లో నీరు నిలుపుతుండగా అత్యధికంగా స్థానిక రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఇటీవల శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని సందర్శించేందుకు వచ్చినపుడు ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసిన చెక్‌ డ్యాంల వివరాలను వెల్లడించారు. ఈ విషయాన్ని అప్పుడు విలేకరుల సమావేశంలో వెల్లడించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం, మే 15 వరకు పనులు పూర్తి చేయాలని చెప్పడం జిల్లాపై ఆయనకు ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. వచ్చే వర్షాకాలం నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలనీ, ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించాలనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి బ్యారేజ్‌ నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం వరకు టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందుకు ప్రణాళికలు కూడా సిద్ధమైనట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఇటు కాళేశ్వరం జలాలతో నిండే చెక్‌ డ్యాంలు, అటు టూరిజం కేంద్రాలతో ఉమ్మడి జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. 


విజయవంతమైన సీఎం పర్యటన..

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా రెండు రోజుల పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ బుధవారం రాత్రి స్థానిక తీగలగుట్టపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు ఆయనను కలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం కరీంనగర్‌ నుంచి నేరుగా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదుల సంగమ స్థలికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. నదిలో నాణేలు వదిలారు. అక్కడి నుంచి కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానానికి చేరుకున్న ముఖ్యమంత్రి దైవ దర్శనం చేసుకుని ఇక్కడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజ్‌ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నిండుకుండను తలపిస్తున్న ప్రాణహిత నదీ జలాలను ఏరియల్‌ వ్యూ ద్వారా మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి వీక్షించారు. లక్ష్మి బ్యారేజ్‌ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ బ్యారేజీ మీది నుంచి గోదావరిలో నాణేలు వదిలి, ఉద్యమకాలం నాటి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ వద్ద ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. 


వచ్చే వర్షాకాలం వరదనీరు ఉధృతంగా చేరుతుందనీ, ఈ నేపథ్యంలో లక్ష్మి బ్యారేజీ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలనీ, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మేడిగడ్డ వద్ద భోజనం చేసి హెలికాప్టర్‌ ద్వారా తిరిగి కరీంనగర్‌కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా సాగు నీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్‌ వెంట రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, నగర మేయర్‌ వై సునీల్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్‌, సిరిసిల్ల కలెక్టర్లు శశాంక, కృష్ణ భాస్కర్‌, తదితరులు ఉన్నారు.


మూడున్నర గంటల పాటు సమీక్ష..

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి సాయంత్రం 4.30 గంటలకు కరీంనగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ ఏకధాటిగా మూడున్నర గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లతో ప్రధానంగా చర్చించారు. ఇందులో ఎక్కువగా ఉమ్మడి జిల్లా ప్రస్తావనే వచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగు నీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. ముఖ్యంగా చెక్‌ డ్యాంల నిర్మాణం, జిల్లాలోని చెరువులు, కుంటలను కాళేశ్వరం జలాలతో నింపడం ఎలాగో ప్రణాళికలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెలీక్యాప్టర్‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి వచ్చిన తర్వాత ఎక్కడా అలసట కనబర్చకుండా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ రాత్రి 8.20 తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. 


హరితనగరంగా కరీంనగర్‌..

కరీంనగర్‌ను వచ్చే రెండేళ్ల కాలంలో హరిత నగరంగా  తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గురువారం కాళేశ్వరం వెళ్లే ముందు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావుతో కొద్దిసేపు మాట్లాడారు. కరీంనగర్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనీ, నగరానికి ఆనుకొని అతి పెద్ద జలాశయం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. అయితే కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని మంత్రి కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావుకు సీఎం సూచించారు. వచ్చే రెండేళ్లలో ఈ ప్రణాళిక అమలు జరిగేలా చూడాలన్నారు. అధికారులు మాత్రమే మొక్కలు పెట్టడం వల్లే హరిత నగరాన్ని సృష్టించలేమనీ, ఇందుకోసం ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కపెట్టాలి.. దానిని పెంచి పోషించాలన్న దిశగా ప్రజలను మనం తీసుకెళ్లగలిగితే తప్పకుండా అనుకన్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఈ దిశగా ప్రయత్నాలు వెంటనే ప్రారంభించాలని అదేశించారు. 


కార్పొరేటర్లతో మాటామంతి..

తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌లో గురువారం ఉదయం కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ నగర కార్పొరేటర్లను ముఖ్యమంత్రికి పేరు పేరునా పరిచయం చేశారు. కార్పొరేటర్లు ముఖ్యమంత్రి పూల మొక్కలు అందించి సత్కరించారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేయడంతోపాటు, కార్పొరేటర్లు అందించిన మొక్కలను అందుకొని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. విడివిడిగా, ఉమ్మడిగా ఫొటోలు దిగారు. సీఎం కేసీఆర్‌ ప్రతి ఒక్క కార్పొరేటర్‌ను పలుకరించి బాగోగులు తెలుసుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రులు ఈటల, కొప్పులతోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా సీఎంతో చాలా సేపు మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు కూడా కేసీఆర్‌ నివాసానికి వచ్చి పూల మొక్కలు అందించి సత్కరించారు. వారితో కూడా సీఎం కొద్ది సేపు మాట్లాడారు. కేసీఆర్‌ భవన్‌లోనే సీఎం చాలా సేపు గడపడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులకు కావాల్సినంత సమయం దొరికింది. 


కరీంనగర్‌కు కొత్త కలెక్టరేట్‌

ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌ స్థానంలో కొత్తది నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. కలెక్టరేట్‌ చాలా క్రితం నిర్మించిందనీ, అంతా గందరగోళంగా ఉన్నదని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండె కాయలాంటి కరీంనగర్‌కు అద్భుతమైన కలెక్టరేట్‌ ఉండాలనీ, వెంటనే కావాల్సిన నిధులు మంజూరు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. దీంతో ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న కలెక్టరేట్‌ స్థానంలో కొత్త భవన సముదాయం మంజూరుకు సీఎం ఆదేశాలు ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

logo