గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 12, 2020 , 04:30:41

టీఆర్‌ఎస్‌ దూకుడు

టీఆర్‌ఎస్‌ దూకుడు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా డైరెక్టర్లు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడా అవకాశం లేకుండా అధికార మొత్తంగా టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే సత్తాచాటారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీకి సహకార సంఘాల్లో అవకాశమే లభించని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 260 ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 107 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందరూ సంఘాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌.. 

జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల పరిధిలో సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలంలోని నందిమేడారం పీఏసీఎస్‌ పరిధిలో సంపూర్ణంగా 13స్థానాలలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే మండలంలోని పత్తిపాకలో సంఘంలో 4 స్థానాల్లో సత్తాచాటగా, ఇక్కడ మరో మూడు గెలిస్తే టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే రానుంది. ఇక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నియోజకవర్గమైన పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌ సత్తాచాటింది. ఎలిగేడు మండలం ధూళికట్ల పీఏసీఎస్‌ పరిధిలోని 13కు 13 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికై సొసైటీని కైవసం చేసుకున్నారు. అలాగే అప్పన్నపేట పరిధిలో 9, చిన్న కల్వల 7 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికై సంపూర్ణ  మెజార్టీ సాధించడంతోపాటు కూనారంలో  6, జూలపల్లిలో 6, సుల్తానాబాద్‌ 4, పెద్దపల్లి 4  స్థానాల్లో ఏకగ్రీవాలతో సత్తాచాటారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ నియోజకవర్గమైన రామగుండంలోని అంతర్గాం మేడిపల్లి సంఘంలోనూ 13కు 13 స్థానాల్లో గులాబీ మద్దతుదారులే యునానిమస్‌గా ఎనికయ్యారు. ఇక ప్రస్తుత జడ్పీ చైర్మన్‌, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ నియోజకవర్గమైన మంథనిలోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగించింది. మంథని, కనుకుల, ఎలిగేడు, కమాన్‌పూర్‌ పీఏసీఎస్‌లల్లో 5స్థానాల చొప్పున పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

అంతుచిక్కని టీఆర్‌ఎస్‌ వ్యూహాలు 

సహజంగా ప్రజల్లోనే కనిపించే టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నికలు వచ్చేసరికి అనుసరిస్తున్న వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలకు అంతుచిక్కని పరిస్థితి కనిపిస్తోంది. తమ సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటే తాము ఉన్నామని రైతులు ఇది వరకు జరిగిన అనేక ఎన్నికల్లో నిరూపించారు. ఇక తమ సంఘాల పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టేందుకు ముందుకు రావడం సహజం. అయితే సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా, మండల నాయకులే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముందస్తు సమావేశాలు నిర్వహించుకుని సాధ్యమైనన్ని డైరెక్టర్‌ పదవులను, తద్వారా సంఘాలను ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించారు. డైరెక్టర్‌ పదవులు ఆశిస్తున్న వారి వివరాలను ముందే సేకరించి పెట్టుకున్నారు. ఏ సంఘం పరిధిలో ఏ నియోజకవర్గంలో ఎవరు నామినేషన్‌ వేయాలనేది ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో ఇతర రైతులు ఎవరైనా నామినేషన్‌ వేసినా వారిని ఒప్పించి స్వచ్ఛందంగా ఉపసంహరించుకునేలా చేశారు. నామినేషన్ల అనంతరం కూడా పార్టీ నాయకులు కలిసి కట్టుగా పనిచేశారు. పార్టీ కార్యకర్తలు ఒకే స్థానంలో ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేసినా ముందుగా నిర్ణయించిన వారిని పోటీలో ఉంచి మిగతా వారితో నామినేషన్లు ఉపసంహరింపజేశారు. కార్యకర్తలు కూడా క్రమశిక్షణగా స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు చెప్పింది వినడంతో జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం కావడం, వాటిని టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడం ఏకకాలంలో జరిగిపోయింది.

గెలుపు కోసం కలిసికట్టుగా..

పోటీ అనివార్యమైన 153 ప్రాదేశిక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు కలిసికట్టుగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పోటీ జరుగుతున్న 153 నియోజకవర్గాలకు ముగ్గురి చొప్పున పోటీలో ఉన్నారు. ఇందులో 101స్థానాల్లో ఇద్దరు చొప్పున పోటీలో ఉండగా, 52 స్థానాల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. అయితే ఇందులో టీఆర్‌ఎస్‌ బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపును ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ నామమాత్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నా ఎక్కడా తేలికగా తీసుకోకూడదని టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్ణయించుకున్నారు. పరిషత్‌ ఎన్నికల మాదిరిగానే జిల్లాలోని 20 సహకార సంఘాలను కైవసం చేసుకునేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే 3 పీఏసీఎస్‌లను ఏకగ్రీవంగా, మరో రెండు పీఏసీఎస్‌లలో ఏడుకు పైగా డైరెక్టర్‌ పదవులను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు మిగిలిన 15 సంఘాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 15న డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత లెక్కింపు, ఆ తర్వాత చైర్మన్‌ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. దాదాపు అన్ని సంఘాల్లో ఇదే రోజు చైర్మన్‌ ఎన్నికలు పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారు. ప్రతి సంఘం పరిధిలో కలిసి కట్టుగా నిలబడి తమ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు.


logo