మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Feb 12, 2020 , 04:24:59

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వండి

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వండి

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాల అమలు బాధ్యత కలెక్టర్లదే అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. కలెక్టర్లతోపాటు మంత్రులు, అడిషనల్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వీరికి దిశానిర్దేశం చేశారు. ‘చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలి. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధులుగా కలెక్టర్లు వ్యవహరించాలి.. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చేలా పని చేయించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి.. ఆదర్శ పల్లెలకు అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. ఈ సదస్సులో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పాల్గొన్నారు.  

ఇక నిరంతర పల్లె ప్రగతి

పల్లెల రూపురేఖలు మార్చిన ‘పల్లె ప్రగతి ’ కార్యక్రమం ఇక నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఇప్పటి వరకు రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో ప్రజలు కోరుకున్న మార్పు కనిపించడంతో పాటు పారిశుధ్యం, రవాణా, విద్యుత్‌ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వ్యక్తులను బట్టి కాకుండా సమస్యల ప్రాధాన్యతకు అనుగుణంగా అమలు కానున్నాయి. జిల్లాల కలెక్టర్లే ఈ ప్రాధాన్యతను గుర్తించాల్సి ఉంటుంది. పల్లెల్లో పచ్చదనం. పారిశుధ్యం కనిపించేలా కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది. నాటిన ప్రతిమొక్కనూ కాపాడే బాధ్యతనూ తీసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్‌తో పాటు మిగితా అధికారులు ఒక జట్టులా పనిచేసి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ‘ఇప్పటికే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు,  గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను మరింత చేరువ చేశాం. ఆయా పోస్టులను భర్తీ చేశాం. నిధులనూ విడుదల చేస్తున్నాం. అనుకున్న విధంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని’ సీఎం కలెక్టర్లను ఆదేశింంచారు.


logo