శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Feb 09, 2020 , 01:01:58

ఏకగ్రీవం దిశగా

ఏకగ్రీవం దిశగా
  • జిల్లావ్యాప్తంగా 53చోట్ల అవకాశాలు
  • అధికారిక ప్రకటనే తరువాయి
  • సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు
  • టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి ఎన్నిక
  • నర్సింగాపూర్‌, అల్మాస్‌పూర్‌ పీఏసీఎస్‌లు యూనానిమస్‌రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ/ఎల్లారెడ్డిపేట/బోయినపల్లి: సిరిసిల్ల జిల్లా పరిధిలోని పల్లె లు ఐక్యతను చాటుతున్నాయి. సహకార సంఘా ల ఎన్నికల్లో ఏకగ్రీవాలకే మొగ్గు చూపాయి. అనేక వార్డుల్లో పోటీ లేకుండా పోయింది. జిల్లాలోని 309 వార్డులకుగాను 53వార్డుల్లో ఒకటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. గంభీరావుపేటలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, బోయినిపల్లి మండలం నుంచి డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి యునానిమస్‌గా ఎన్నికయ్యారు. అదేవిధంగా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్‌లోని సహకార సంఘం, ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ పాలకవర్గా లు ఏకగ్రీవమయ్యాయి. అక్కడ పోటీ లేకపోవడం చూస్తే గ్రామ ప్రజల్లో ఉన్న ఐక్యతకు నిదర్శనమని చెప్పవచ్చు. కాగా టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు వరుసగా ఏకగ్రీవమవుతూ సంచలనం సృష్టిస్తున్నారు. మండలంలో ఆయనకున్న పట్టు, ఎళ్లవేలలా తమ బాగోగులు చూస్తూ వెన్నంటి ఉంటారన్న ధీమా ప్రజల్లో ఉంది. 


ఏకగ్రీవం దిశగా 53వార్డులు..

జిల్లాలో 24 సహకార సంఘాలుండగా, అం దులో 309 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 6నుంచి 8వరకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 103 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు 327, మూడో రోజున 526, మొత్తంగా 949 నామినేషన్లు దాఖలయ్యాయి. సహకార సంఘాలలో ఓటు హక్కు ఉన్న రైతులంతా తమ ఐక్యతను చాటుకుంటూ చాలా చోట్ల అభ్యర్థులు పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ ఇష్టమైన నాయకులను, మంచి సేవలందిస్తారన్న నమ్మకంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుని, తద్వారా ఒక్క నామినేషన్‌ పడే విధంగా కలిసి కట్టుగా కృషి చేశారు. సిరిసిల్లలో 1, తంగళ్లపల్లిలో 3, కోనరావుపేట మండలంలో1, వేములవాడ మండలంలో6, గంభీరావుపేట మండలంలో 5, ఇల్లంతకుంట మండలంలో 4, ముస్తాబాద్‌ మండలంలో2 వార్డులకు, చందుర్తి మండలంలోని సనుగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని 8వ వార్డు బండపల్లి గ్రామం సింగిల్‌ విండో డైరెక్టర్‌ స్థానం ఏకగ్రీవమైంది. ఆ వార్డుకు గడ్డం తిరుపతిరెడ్డి మాత్రమే నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. దాదాపు ఆయా వార్డులన్నీ కూడా ఏకగ్రీవం కానున్నాయి.


నర్సింగాపూర్‌లో సొసైటీ పాలకవర్గం 

బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌ సహకార సంఘం పాలకవర్గం మొత్తంగా ఏకగ్రీవం కానుంది. సంఘంలో 13 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో పాలకవర్గం మొత్తం యునానిమస్‌గా ఎన్నికకానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారి అబ్ధుల్‌ అజిమ్‌ వెల్లడించారు. ఇక్కడి నుంచి నర్పింగాపూర్‌ సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన ముదుగంటి సురేందర్‌రెడ్డి ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చూర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన 11వ వార్డు నుంచి డైరెక్టర్‌ నామినేషన్‌ దాఖలు చేయగా ఏకగ్రీవమయ్యారు. 1వ వార్డు నుంచి కత్తెరపాక లచ్చయ్య, 2వ వార్డు నుంచి మాడిశెట్టి లచ్చయ్య, 3వవార్డు నుంచి నల్లాల బాలరాజు, 4వ వార్డు నుంచి పండుగ ఎల్లయ్య, 5వ వార్డు నుంచి గంగాధర రాజయ్య, 6వ వార్డు నుంచి సుంకపాక లక్ష్మి, 7వ వార్డు నుంచి సంది చంద్రశేఖర్‌, 8వ వార్డు నుంచి ఎమిరెడ్డి మల్లారెడ్డి, 9వ వార్డు నుంచి కుతాడి కనుకయ్య, 10వ వార్డు నుంచి కూర లచ్చయ్య, 11వ వార్డు నుంచి పొరెడ్డి మల్లారెడ్డి, 12వ వార్డు నుంచి గోపి ఇందిర, 13వ వార్డు నుంచి ముదుగంటి సురేదర్‌రెడ్డి (ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. ‘సీఎం కేసీఆర్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ సీనీయర్‌ నాయకులు కత్తెరపాక కొండయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు జూలపల్లి అంజన్‌రావు, కొంకటి మధు, కొమ్మన బోయిన సువీన్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ లెంకల సత్యానారాయణరెడ్డి, డైరెక్టర్లు ఎమిరెడ్డి సురేందర్‌రెడ్డి, బొజ్జ లక్ష్మీరాజం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లేశం, దేశాయిపల్లి సర్పంచ్‌ ఒంటెల గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


అల్మాస్‌పూర్‌ చైర్మన్‌గా మోహన్‌రెడ్డి

ఎల్లారెడ్డిపేట మండలంలోని మూడు సొసైటీల్లో అల్మాస్‌పూర్‌ సొసైటీ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఉచ్చిడి మోహన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం చివరిరోజు నామినేషన్‌ వేసేనాటికి టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, నాయకుల మంత్రాంగం ఫలితంగా స్నేహపూర్వక వాతావరణంలో సొసైటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిరోజు వరకు 13 స్థానాలకు గాను 9 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతరం తోట ఆగయ్య, వీర్నపల్లి టీఆర్‌ఎస్‌ నాయకుల నిర్ణయం మేరకు డైరెక్టర్లు అందరూ కలిసి అనుభవజ్ఞుడైన మోహన్‌రెడ్డి చైర్మన్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల అధికారిక ప్రకటనే తరువాయిగా మారింది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ డైరెక్టర్లు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు.  


logo